Politics

YCP: అమరావతిలో వైసీపీకి నో ఎంట్రీ.. నాటి పరిణామాలకు పర్యావసానమా??

ఏ పరిణామమైనా చిటికెలో జరిగిపోదు. దానికి ముందు పాలకులు తీసుకున్న నిర్ణయాలు ప్రజలను ఎంతలా ప్రభావితం చేశాయనడానికి నిదర్శనంగానే జరుగుతుంటాయి. ఏపీలో నిన్న అదే జరిగింది.

YCP: అమరావతిలో వైసీపీకి నో ఎంట్రీ.. నాటి పరిణామాలకు పర్యావసానమా??

ఏ పరిణామమైనా చిటికెలో జరిగిపోదు. దానికి ముందు పాలకులు తీసుకున్న నిర్ణయాలు ప్రజలను ఎంతలా ప్రభావితం చేశాయనడానికి నిదర్శనంగానే జరుగుతుంటాయి. ఏపీలో నిన్న అదే జరిగింది. అప్పట్లో అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకు ముందు ప్రభుత్వం చేపట్టిన రాజధాని నిర్మాణ పనులను తన భుజస్కందాలపై వేసుకుని పూర్తి చేసి ఉంటే వైసీపీ నేతలు నేడు రాజధాని గ్రామాల్లో రొమ్ము విరుచుకుని మరీ తిరిగి ఉండేవారు.

పోనీ.. తిరిగి కూటమి ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాతైనా మద్దతు పలికి ఉంటే బాగుండేది. మావిగన్ అంటూ జగన్ చెప్పిన థియరీతో మరింత జనాల్లో చులకన అయిపోయారు. రాజధాని రైతులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు వేధించిన తరువాత ఆ పార్టీ నేతలను అక్కడి ప్రజలు ఎందుకు సహిస్తారు? తాజాగా అదే జరిగింది. జనాలు వైసీపీ నేతలను తరిమికొట్టినంత పని చేశారు.

వైసీపీ గోబ్యాక్..

‘రాజధాని ద్రోహి జగన్‌.. గోబ్యాక్‌ వైసీపీ’ అంటూ నినాదాలు చేశారు. సుమారు గంట పాటు వారిని అడ్డగించడంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఉద్రిక్త వాతావరణం.. నానా హడావుడి. గందరగోళం. ఎప్పుడైనా సరే.. అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న రాజకీయ నిర్ణయాల ప్రభావం ఎంతకాలమైనా వెంటాడుతుందనే విషయాన్ని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఐదేళ్లపాటు రాజధాని అంశంపై వైసీపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై అసంతృప్తిగా ఉన్న రాజధాని గ్రామాల ప్రజలు తాజాగా ఆ పార్టీ నేతలకు గట్టిగా నిరసన తెలిపారు. "రాజధాని ద్రోహి జగన్.. గో బ్యాక్ వైసీపీ" అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దాదాపు గంటపాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ తీవ్ర ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది.

న్యాయ పోరాటాలతో..

ఇదంతా వైసీపీ స్వయంకృతం. రాజధాని ప్రాంతంలోకే ఆ పార్టీ నేతలను అడుగు పెట్టేందుకు అక్కడి ప్రజలు అంగీకరించడం లేదు. ఒకప్పుడు ఆ ప్రాంతవాసులను అంతలా వైసీపీ అధినేత సహా ఆ పార్టీ నేతలంతా క్షోభ పెట్టారు. కేసులు, కోర్టులు, న్యాయ పోరాటాలతో ఆ ప్రాంతం అట్టుడికింది. ఇంత చేసి తగుదునమ్మా అంటూ పర్యటనకు నేతలు వెళితే ఊరుకుంటారా? పైగా అక్కడికి వెళ్లిన వారిలో అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్ వంటి నేతలున్నారు. దేవినేని అవినాష్ అయితే కొంతకాలం ఓపిక పట్టలేక వైసీపీలోకి వెళ్లి అక్కడి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఇక అంబటి, పేర్ని నాని నోటికి హద్దూ పొద్దూ లేకుండా పోయింది. ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారు. రాజధాని రైతులను వైసీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానించారు.

పున: సమీక్షించుకుంటారా?

రాజకీయ వర్గాల్లో ఈ పరిణామంపై చర్చ సాగుతోంది. వైసీపీ నేతల కార్లపై కోడిగుడ్ల దాడి.. వారి కార్ల అద్దాలు పగలగొట్టడం సహా అక్కడి ప్రజలు ఆయా నేతలను వెంబడించి మరీ తరిమారు. అంతటి దుస్థితి వైసీపీ నేతలు ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చిందనేది ఇప్పటికైనా పున: సమీక్ష చేసుకుంటే మంచిది. లేదంటే ఫ్యూచర్‌లో ఎప్పుడూ కూడా రాజధాని ప్రాంతంలో అడుగు పెట్టలేరనేది అక్షర సత్యం. ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమరావతినే రాష్ట్ర రాజధానిగా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో.. వైసీపీ నేతలు రాజధాని ప్రాంతంలో పర్యటించడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న రోజుల్లో రాజధాని రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 28, 2026 5:07 AM