Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సీఎం మెటీరియలా? నెట్టింట ఆసక్తికర చర్చ!
సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. దేశ రాజకీయ చరిత్రలోనే ఎంతో మంది నటులు ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చారు. తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత ముఖ్యమంత్రులుగా చరిత్ర సృష్టించగా.. ప్రస్తుతం హీరో విజయ్ కూడా రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. దేశ రాజకీయ చరిత్రలోనే ఎంతో మంది నటులు ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చారు. తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత ముఖ్యమంత్రులుగా చరిత్ర సృష్టించగా.. ప్రస్తుతం హీరో విజయ్ కూడా రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ సీఎం కాగా.. ప్రస్తుతం ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. మరి తెలంగాణ సంగతేంటి?
అయితే తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఇక్కడ సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి అడుగుపెట్టినా.. ప్రజలపై పెద్ద స్థాయిలో ప్రభావం చూపిన ఉదాహరణలు ఇప్పటివరకు కనిపించలేదు. దీంతో భవిష్యత్తులో తెలంగాణ నుంచి ఏదైనా సినీ హీరో రాజకీయాల్లో సంచలనం సృష్టించే అవకాశం ఉందా? అనే చర్చ అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. నిజమే కదా.. తెలంగాణకు సినీ నటులు సీఎం కాలేరా? అసలు అంతటి సత్తా తెలుగు సినీ ప్రముఖులెవరికీ లేదా? అంటే అందరికీ ఎందుకు ఉంటుంది? తెలంగాణ వారికే కదా.
అంత సీన్ ఉందా?
ఈ క్రమంలోనే ఒక తెలంగాణ హీరో ఫ్యూచర్‌లో రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశాలున్నాయని ఓ టాక్. వినడానికి విచిత్రంగా ఉన్నా కూడా ఒకవేళ సినీ రంగం నుంచి వచ్చి రాజకీయ చదరంగం ఆడాలంటే ఆ సత్తా ఒకే ఒక హీరోకు ఉంది. ఎవరా హీరో? ఆయనకు అంత సీన్ ఉందా? అంటే కచ్చితంగా ఉందనే టాక్. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తరచూ వినిపించే పేరు విజయ్ దేవరకొండ. తెలంగాణ యాస, భాషను తన సినిమాల్లో సహజంగా వినిపిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌కు యువతలో విశేషమైన ఫాలోయింగ్ ఉంది. అభిమానులు ఆయనను ప్రేమగా "మా బంగారు కొండ" అని పిలుచుకోవడం కూడా ఆయనకు ఉన్న క్రేజ్‌కు నిదర్శనం.
ఆయనకు తగ్గట్టే రష్మిక..
ఏ హీరో అయినా పెళ్లైతే తమ బంధువులను, సన్నిహితులను, స్నేహితులను పిలుచుకుంటారు. కానీ దాదాపుగా ప్రతి ఒక్కరికీ తన వివాహానికి సంబంధించిన స్వీటు తినిపించిన హీరో ఇండస్ట్రీలో ఒక్క విజయ్ దేవరకొండ ఒక్కరే. ఆయనకు తగ్గట్టే రష్మిక మందన్నా వైఫ్‌గా దొరికింది. ఇద్దరూ కలిసి సామాజిక కార్యక్రమాలను సైతం నిర్వహిస్తూ వావ్ అనిపించుకుంటున్నారు. సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక అంశాలపై స్పందించడం, తన ఫౌండేషన్ ద్వారా అవసరమైన వారికి సహాయం చేయడం, యువతతో నిరంతరం అనుసంధానంగా ఉండడం వంటి అంశాలు కూడా ఆయనకు ప్రత్యేక ఇమేజ్‌ను తీసుకొచ్చాయి. అందుకే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే ప్రభావం చూపే సామర్థ్యం ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ పేరు తరచూ వినిపిస్తుంటుంది.
సందేహమే లేదు..
అయితే ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ తన ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టారు. అసలు రాజకీయాల్లోకి వచ్చే సంగతి పక్కనబెడితే కనీసం వాటి గురించి ఏనాడూ కూడా ఆయన మాట్లాడింది లేదు. కానీ భవిష్యత్తులో ఇండస్ట్రీ నుంచి ఎవరైనా తెలంగాణ పొలిటిక్స్‌లోకి అడుగు పెట్టి నిలదొక్కుకోగలరంటే అది విజయ్ దేవరకొండ అనడంలో సందేహం లేదు. ఒకవేళ భవిష్యత్తులో రాజకీయాల్లోకి విజయ్ అడుగుపెడితే యువత మద్దతు దాదాపుగా లభిస్తుందనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. అప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో జనాలు విసిగిపోయి ఉంటారు కాబట్టి విజయ్‌కు తిరుగుండదని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి మున్ముందు రాజకీయాల్లోకి సైతం విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇస్తారనే టాక్ నడుస్తోంది. ఆయన వస్తే.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలవడం ఖాయమనే తెలుస్తోంది. మరి విజయ్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారా? లేక ఆయన ప్రయాణం సినిమాలకే పరిమితమవుతుందా? కాలమే అందుకు సమాధానం చెప్పాలి.
ప్రజావాణి చీదిరాల