Politics

Donald Trump: ఎవియాన్‌లో పొలిటికల్ హీట్.. ఒకే వేదికపై ట్రంప్‌ ప్రత్యర్థులు..!

దాదాపు 16 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మోదీ, ట్రంప్ కలుసుకోవడం ఒక విశేషమైతే.. ట్రంప్ వర్సెస్ ప్రత్యర్థులైన ఇతర దేశాధినేతలు కలుసుకోవడం మరో విశేషం.

Donald Trump: ఎవియాన్‌లో పొలిటికల్ హీట్.. ఒకే వేదికపై ట్రంప్‌ ప్రత్యర్థులు..!

అంతర్జాతీయ రాజకీయ వేదికపై ప్రత్యర్థులంతా కలిశారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని ఎవియాన్ నగరంలో జీ7 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, మార్క్ కార్నీ, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తదితరులంతా హాజరయ్యారు. దాదాపు 16 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మోదీ, ట్రంప్ కలుసుకోవడం ఒక విశేషమైతే.. ట్రంప్ వర్సెస్ ప్రత్యర్థులైన ఇతర దేశాధినేతలు కలుసుకోవడం మరో విశేషం.

ట్రంప్, మోదీ ఇరువురూ ఒకరినొకరు కరచాలనం చేసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 2025 ఫిబ్రవరిలో వీరిద్దూ అమెరికాలోని వైట్‌హౌస్‌లో సమావేశమైన తర్వాత ఇదే ప్రత్యక్షంగా మరోసారి కలుసుకోవడం. జీ7 సదస్సు నేపథ్యంలో నేడు (బుధవారం) మోదీ, ట్రంప్‌ల మధ్య అధికారిక ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యపరమైన సవాళ్లు, ఇండో-పసిఫిక్ వ్యూహం తదితర కీలకమైన అంశాలపై వారిద్దరూ చర్చించుకోనున్నట్టు తెలుస్తోంది.

ఆసక్తికరంగా జీ7 సమావేశం..

ఫ్రాన్స్‌లోని ఎవియాన్ నగరంలో జూన్ 15–17 మధ్య జరుగుతున్న 52వ జీ-7 (G7) సదస్సు ప్రపంచ రాజకీయాల్లో కీలక చర్చలకు వేదికైంది. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూరప్‌కు చెందిన మిత్రదేశాల నాయకుల మధ్య విదేశాంగ విధానం, ఇరాన్ వ్యవహారం, వాణిజ్య సుంకాలు, ఉక్రెయిన్ యుద్ధం, రష్యా పాత్ర వంటి అంశాలపై స్పష్టమైన అభిప్రాయ భేదాలు బయటపడ్డాయి. దాదాపుగా ఈ సదస్సులో పాల్గొంటున్న అందరు దేశాధినేతలోనూ ట్రంప్‌కు విభేదాలున్నాయి. ఈ క్రమంలోనే ఈ సమావేశం మరింత ఆసక్తికరంగా మారింది.

ఇరాన్ అంశంపై విభేదాలు

సదస్సు ప్రారంభానికి ముందు అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి రూపురేఖలు సిద్ధమయ్యాయని ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రపంచ భద్రతకు మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే యూరోపియన్ దేశాల నాయకులు ఈ ప్రక్రియపై జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఇరాన్ అణు కార్యక్రమం, క్షిపణి సామర్థ్యాలు, మధ్యప్రాచ్య భద్రతపై మరింత సమగ్ర ఒప్పందం అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ తదితరులు ఇరాన్ విషయంలో అమెరికా చర్యలు అంతర్జాతీయ స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.

వాణిజ్య సుంకాలపై అసంతృప్తి

అమెరికా అమలు చేస్తున్న టారిఫ్‌లు (సుంకాలు) కూడా జీ-7 చర్చల్లో ప్రధాన అంశంగా మారాయి. ట్రంప్ "అమెరికా ఫస్ట్" విధానంలో భాగంగా విధిస్తున్న సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని యూరోపియన్ నాయకులు అభిప్రాయపడ్డారు. వాణిజ్య వివాదాలు ట్రాన్స్-అట్లాంటిక్ సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

రష్యా అంశంపై భిన్నాభిప్రాయాలు

జీ-7 నుంచి 2014లో తొలగించబడిన రష్యాను తిరిగి చేర్చుకోవాలనే ఆలోచనను ట్రంప్ గతంలో పలుమార్లు వ్యక్తం చేశారు. అయితే యూరోపియన్ దేశాలు, కెనడా మరియు జపాన్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న పరిస్థితిలో అలాంటి నిర్ణయాన్ని సమర్థించలేమంటున్నాయి. ఈ సదస్సులో కూడా ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగించాలని యూరోపియన్ నాయకులు కోరారు.

పశ్చిమ దేశాల ఐక్యతపై ప్రశ్నలు

ఈ సదస్సులో ట్రంప్ అనుసరిస్తున్న స్వతంత్ర, ఏకపక్ష విదేశాంగ వైఖరి పశ్చిమ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక విభేదాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా ఇరాన్, వాణిజ్యం, ఉక్రెయిన్ వంటి అంశాల్లో అమెరికా, యూరోపియన్ మిత్రదేశాల మధ్య దృక్పథ వ్యత్యాసాలు స్పష్టంగా కనిపించాయి.

స్పెషల్ అట్రాక్షన్‌గా మోదీ–ట్రంప్ భేటీ 

ఈ ఉద్రిక్త వాతావరణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ-7 సదస్సులో పాల్గొనడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. భారతదేశం ఆహ్వానిత దేశంగా సమావేశాలకు హాజరైంది. మొత్తంగ ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ-7 సదస్సు కేవలం ఆర్థిక లేదా భద్రతా చర్చలకే పరిమితం కాకుండా, అమెరికా, దాని సాంప్రదాయ మిత్రదేశాల మధ్య పెరుగుతున్న విధానపరమైన విభేదాలకు ప్రతిబింబంగా మారింది. ఇరాన్ శాంతి ఒప్పందం, ఉక్రెయిన్ యుద్ధం, వాణిజ్య సుంకాలు, రష్యా భవిష్యత్ పాత్ర వంటి అంశాలు ప్రపంచ రాజకీయాల దిశను నిర్ణయించే అంశాలుగా నిలుస్తున్నాయి.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 17, 2026 3:31 AM