BJP: టీఎంసీకి షాక్.. బీజేపీకి జాక్‌పాట్.. ఎంపీల జంప్‌పై హస్తినలో హాట్ టాక్!
టీఎంసీ పతనం తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? కేంద్రంలో బీజేపీకి బలం పెరుగుతుందా? రానున్న వర్షాకాల సమావేశాలు ఏకపక్షంగా సాగనున్నాయా? ఎన్డీఏ ప్రభుత్వం ఇకమీదట పెట్టే బిల్లులన్నీ ఏకగ్రీవంగా ఆమోదంగా పొందనున్నాయా?
టీఎంసీ పతనం తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? కేంద్రంలో బీజేపీకి బలం పెరుగుతుందా? రానున్న వర్షాకాల సమావేశాలు ఏకపక్షంగా సాగనున్నాయా? ఎన్డీఏ ప్రభుత్వం ఇకమీదట పెట్టే బిల్లులన్నీ ఏకగ్రీవంగా ఆమోదంగా పొందనున్నాయా? అంటే అన్నింటికీ ఒకటే సమాధానం. అవుననే తెలుస్తోంది. దీనికి కారణం నేతలకు కావల్సింది అధికారం.. గాలి ఎటు వీస్తే అటే గడ్డి వంగినట్టుగా, దేశ రాజకీయాల్లో కూడా అధికారం ఎటు ఉంటే నేతల అడుగులు అటువైపే పడతాయి.
దేశ రాజకీయాల్లో అధికారం అనేది కేవలం పాలనకే పరిమితం కాదు. అది రాజకీయ పార్టీల భవిష్యత్తును, నేతల నిర్ణయాలను, శాసనసభలు, పార్లమెంట్‌లోని శక్తి సమీకరణాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాని చుట్టూ నాయకులు, ప్రజాప్రతినిధులు గుమికూడటం ఎంత సహజమో, అదే పార్టీ ఓటమి పాలైతే రాజకీయ వలసలు ప్రారంభమవడం కూడా అంతే సాధారణం. అందునా మన దేశంలో ఇది చాలా ఎక్కువ. ప్రస్తుతం అధికారం కోల్పోయిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాజకీయ వలసలను ఎదుర్కొంటోందని టాక్.
ఇదొక కీలక మలుపు!
20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు బీజేపీ (BJP)తో టచ్‌లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇదే నిజమైతే మాత్రం దేశ రాజకీయాల్లో ఇదొక కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, ఒక పార్టీ అధికారాన్ని కోల్పోయిన వెంటనే అంతర్గత విభేదాలు బయటపడటం అనేది కొత్తేం కాదు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు, అవకాశాలు, ప్రభావం వంటి అంశాలు నేతలను ఒకే వేదికపై ఉంచుతాయి. కానీ అధికారాంతమున చూడవలె అయ్యవారి సౌభాగ్యముల్ అంటారు కదా. అలా అధికారం దూరమైన తర్వాత పార్టీ ప్రెసిడెంట్ చాలా సపోర్ట్‌ను కోల్పోతారు. దీనికి కారణం పార్టీ నేతల్లో భవిష్యత్తుపై అనిశ్చితి పెరగడమే. చాలామంది తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలోనే జంపింగ్స్ పెరుగుతాయి. టీఎంసీ విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో బలమైన స్థితిలో ఉన్న బీజేపీ వైపు కొందరు ఎంపీలు మొగ్గు చూపుతున్నారనే గుసగుసలు హస్తినలో వినిపిస్తున్నాయి.
ఏకపక్షంగా సమావేశాలు..!
ఒకవేళ టీఎంసీ ఎంపీలలో గణనీయమైన సంఖ్యలో నేతలు బీజేపీకి మద్దతు ఇస్తే లేదా పార్టీలో చేరితే, అది పార్లమెంట్‌లో అధికార పక్షానికి మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది. ఇప్పటికే బలమైన సంఖ్యాబలం కలిగిన బీజేపీ, ప్రాంతీయ పార్టీల నుంచి మద్దతు పెరిగితే జాతీయ రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంటుంది. ఇటీవలి కాలంలో పార్లమెంటులో కొన్ని బిల్లులను ప్రవేశపెట్టి భంగపడిన ఎన్డీఏ ప్రభుత్వానికి ఇలా మద్దతు పెరగడమనేది అద్భుతమైన పరిణామం. ఇక ఏ బిల్లు కావాలంటే ఆ బిల్లును యథేచ్ఛగా ప్రవేశపెట్టవచ్చు. అదే సమయంలో ప్రతిపక్షాలు మరింత బలహీన పడతాయి. ఈ క్రమంలోనే వర్షాకాల సమావేశాలు ఏకపక్షంగా సాగే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. టీఎంసీ వంటి ప్రధాన ప్రతిపక్ష శక్తులు బలహీనపడితే, రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై దాని ప్రభావం గట్టిగానే ఉంటుంది. పైగా ప్రతిపక్షం సంఖ్యాబలం తగ్గిపోతే చట్టాలపై తీవ్ర స్థాయి చర్చలు, వ్యతిరేక స్వరాలు తగ్గిపోవచ్చు.
టీఎంసీ అడ్డుకుంటుందా?
పార్లమెంట్‌లో ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రభుత్వం తీసుకొచ్చే అనేక కీలక బిల్లులు పెద్దగా అడ్డంకులు లేకుండా ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అధికార పక్షానికి అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో, మిత్రపక్షాలు, ఇతర పార్టీల మద్దతు కూడా లభిస్తే బిల్లులన్నీ ఏకగ్రీవంగా పాస్ అయిపోతాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, టీఎంసీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నుంచి భారీ స్థాయిలో వలసలు కొనసాగితే పార్లమెంట్‌లో ప్రతిపక్షం ప్రభావం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిలో అధికార పక్షం నిర్ణయాలకు ఎదురొడ్డి నిలిచే శక్తి తగ్గిపోవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎంత బలంగా ఉండాలో, ప్రతిపక్షం కూడా అంతే బలంగా ఉండాలి. ఎందుకంటే బలమైన ప్రతిపక్షమే ప్రభుత్వాన్ని జవాబుదారిగా ఉంచుతుంది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ పరిణామాలు అధికార పక్షం వైపు శక్తి కేంద్రీకరణ జరుగుతోందనే సంకేతాలను ఇస్తున్నాయి. ఏది ఏమైనా టీఎంసీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత 20కి పైగా ఎంపీలు బీజేపీతో టచ్‌లోకి వచ్చారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మరి ఇదే నిజమైతే దీనిని టీఎంసీ ఎలా అడ్డుకుంటుందో చూడాలి.
ప్రజావాణి చీదిరాల