ఇందిర - మమత .. కేసీఆర్ నుంచి జగన్ వరకూ చరిత్ర చెప్పే శాశ్వత సత్యమిదే
రాజకీయంగా ఎంత తోపులైనా సరే.. ఒక్క గాలివానకు కుప్పకూలాల్సిందే. నేతలు ఏదో ఒక సమయంలో అధికార ఒంటరితనాన్ని అనుభవించాల్సిందే. అసలు రాజకీయ గుత్తాధిపత్యాలు చివరికి ఎందుకు కూలిపోతాయి? ఇందిరాగాంధీ నుంచి మమతాబెనర్జీ వరకూ చరిత్ర చెప్పిన పాఠాలలో మార్పేమీ లేదు.
రాజకీయంగా ఎంత తోపులైనా సరే.. ఒక్క గాలివానకు కుప్పకూలాల్సిందే. నేతలు ఏదో ఒక సమయంలో అధికార ఒంటరితనాన్ని అనుభవించాల్సిందే. అసలు రాజకీయ గుత్తాధిపత్యాలు చివరికి ఎందుకు కూలిపోతాయి? ఇందిరాగాంధీ నుంచి మమతాబెనర్జీ వరకూ చరిత్ర చెప్పిన పాఠాలలో మార్పేమీ లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరనుకున్నారు. అది అజేయంగా కనిపించింది. కట్ చేస్తే సీన్ మారింది. రూల్ మారింది.. రూలింగూ మారింది.
తమిళనాడును తీసుకుంటే డీఎంకేను ఎవరూ ఓడించలేరనుకున్నారు. కానీ ఓడించారు. ఆ తరువాత ఏఐఏడీఎంకే శాశ్వతం. దానిని ఎవరూ కదిలించలేరనుకున్నారు. మరోవైపు పశ్చిమబెంగాల్ విషయానికి వస్తే.. టీఎంసీకి ఎందురు లేదని అంతా భావించారు. తెలంగాణ విషయానికి వస్తే టీఆర్ఎస్/బీఆర్ఎస్ చెక్కుచెదరదనే అంతా ఫిక్స్ అయ్యారు. అలాగే ఏపీ విషయానికి వస్తే.. టీడీపీని ఓడించి భారీ మెజారిటీతో వైసీపీ విజయం సాధించింది. ఈ పార్టీకి కూడా ఇక తిరుగుండదని అంతా భావించారు.
ఇందిరమ్మకు అండగా నిలిచిన వ్యక్తులే..
ఏదిఏమైనా చరిత్ర చెప్పే పాఠం ఒక్కటే. ఏ రాజకీయ పార్టీ కూడా శాశ్వతంగా అధికారంలో కొనసాగలేదు. ఏ నాయకుడు కూడా శాశ్వతంగా ఏకఛత్రాధిపత్యం వహించలేడు. దాదాపు ఐదు దశాబ్దాలుగా భారతదేశ వ్యాప్తంగా ఈ కథ రిపీట్ అవుతూనే ఉంది. వాస్తవానికి ఒక మహా ప్రకంపన అనేది తొలిసారిగా 1977లోనే వచ్చింది. 1971లో ఇందిరాగాంధీ అనూహ్య విజయం సాధించారు. బంగ్లాదేశ్ ఆవిర్భావం తరువాత.. ఇందిరాగాంధీ పొలిటికల్‌గా తిరుగులేని వ్యక్తిగా కనిపించారు. అద్వితీయమైన శక్తిగా ఆమె కొనసాగారు. కాంగ్రెస్‌ను బ్రేక్ చేసే శక్తి ఎవరికీ లేదనుకున్నారు. ఆ తర్వాత 1975–77 మధ్య ఎమర్జెన్సీ వచ్చింది. ప్రజల్లో దీనిపై వ్యతిరేకత వచ్చింది. అప్పటి వరకూ ఇందిరమ్మకు అండగా నిలిచిన వ్యక్తులే ఆమెను దూరం పెట్టడం ప్రారంభించారు. 1977 ఎన్నికలు దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో పెను మార్పు. ఏ నాయకుడూ శాశ్వత బలవంతుడు కాదని ఈ ఎన్నికలు నిరూపించాయి.
ఎన్టీఆర్ సొంతింటి నుంచే పొలిటికల్ సునామీ..
1983లో ఎన్‌టీ రామారావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మార్చివేశారు. ఆయన కాంగ్రెస్ ఆధిపత్యాన్ని సవాలు చేసి మరీ గెలిచి నిలిచారు. తెలుగువారి ఆత్మగౌరవమే అజెండాగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించి తనేంటనేది తెలుగు జాతికి చాటి చెప్పారు. ఎన్టీఆర్, టీడీపీ విడదీయరానివని తెలుగువారంతా భావించారు. కానీ 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక పొలిటికల్ సునామీ వచ్చింది. అది ఢిల్లీ నుంచి కానీ.. ప్రతిపక్షాల నుంచి వచ్చిన సునామీ కాదు. సొంత రాజకీయ కుటుంబం నుంచే వచ్చింది. అది ఎన్టీఆర్ చేజేతులా చేసుకున్నదే. రాజకీయాలు, పర్సనల్ లైఫ్ రెండూ వేర్వేరు. ఒకదానిని మరొక దానితో ముడిపెట్టకూడదు. మరో వ్యక్తిని వివాహం చేసుకోవడమనేది ఎన్టీఆర్ పర్సనల్ విషయం. కానీ లక్ష్మీ పార్వతిని రాజకీయాల్లో కీలకం చేసి తాను కీలుబొమ్మలా మారి సర్వత్రా వ్యతిరేకతను కూడగట్టుకున్నారు. చివరికి సొంతింటి నుంచే ఆ వ్యతిరేకత దావానంలా మారి ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్నే దహించి వేసింది. ఇది వాస్తవానికి ఎవరూ ఊహించని పరిణామం.
తమిళనాడులో దిగ్గజాల శకమది..
తమిళనాడులో దశాబ్దాల పాటు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్), ఆ తర్వాత కరుణానిధి తమిళనాడు రాజకీయాలను శాసించారు. ఇద్దరూ అపారమైన విధేయతను సంపాదించి, శక్తివంతమైన రాజకీయ సంస్థలను నిర్మించారు. అయినప్పటికీ ఈ దిగ్గజాలు సైతం అంతర్గత వర్గాలను, వారసత్వ పోరాటాలను, తమతో పోటీపడేవారిని ఎదుర్కొనేందుకే తన శక్తినంతా వెచ్చించాల్సి వచ్చింది. రాజకీయ సామ్రాజ్యం అనేది ఎంత పెద్దదైతే.. దాని వారసులను నియంత్రించడమనేది అంత పెద్ద సవాలుగా మారుతుంది.
అత్యంత ప్రభావవంతమైన శక్తిగా కేసీఆర్..
2014–2023 ఏపీ, తెలంగాణలకు అత్యంత కీలక సమయం. ప్రాంతీయ దిగ్గజాలు ఆవిర్భవించింది ఈ సమయంలోనే. తెలంగాణ ఏర్పాటు కావడంతో కేసీఆర్.. భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన ప్రాంతీయ నాయకులలో ఒకరిగా మారారు. 2014, 2018లలో వరుస విజయాల తర్వాత, బీఆర్ఎస్ రాజకీయంగా అజేయంగా కనిపించింది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత, ఒకప్పుడు కేసీఆర్‌ను అనివార్యమని భావించిన చాలా మంది నేతలు కొత్త రాజకీయ పొత్తులను అన్వేషించడం ప్రారంభించారు. ఇది ఒకే ఒక విషయాన్ని నిరూపించింది. అదేంటంటే... చాలా మంది రాజకీయ నాయకులు సిద్ధాంతాల కంటే విజయానికే ఎక్కువ విధేయత చూపుతారని ఇది నిరూపించింది.
వైఎస్ జగన్ విషయంలో చరిత్ర చెప్పిన పాఠమిదే..
2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అసాధారణ విజయం సాధించారు. ఆ విజయానికి ఇక తిరుగుండదని భావించారు. కానీ స్వయంకృతం.. ఐదేళ్లు తిరగ్గానే ఎంతటి అసాధారణ విజయాన్ని ప్రజలు అందించారో.. అంతకు మించి దారుణమైన పరాజయాన్ని వైసీపీకి ప్రజలు రుచి చూపించారు. అప్పటి అధికార పక్షం కింద తమ రాజకీయ జీవితాన్ని నిర్మించిన నేతలు సైతం తమ తమ భవిష్యత్తును పునఃసమీక్షించుకోవడం ప్రారంభించారు. ఏపీ నేర్పిన పాఠం ఏమిటంటే.. విజయం అనుచరులను ఆకర్షిస్తుంది.. అనిశ్చితి విధేయతను పరీక్షిస్తోంది.
మమత ఓటమి నేర్పిన పాఠమేంటంటే..
మమతా బెనర్జీ భారతదేశపు అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకులలో ఒకరిగా నిలిచారు. కానీ 2026 చరిత్ర గతిని మార్చేసింది. మమతా బెనర్జీ అప్రతిహత విజయానికి ప్రజలే గండికొట్టారు. ప్రస్తుతం మమతా బెనర్జీ అడుగులకు మడుగులొత్తిన నేతలంతా అధికార పార్టీ వైపు చూడటం ప్రారంభించారు. రాజకీయాల్లో నమ్మకం, అపనమ్మకం అనేవి కేవలం జయాపజయాలపైనే ఆధారపడి ఉంటాయి. టీఎంసీ అధికారం కోల్పోవడంతోనే ఆ పార్టీ పరిస్థితి మారిపోయింది.
అత్యంత శక్తివంతమైన రాజకీయ సంస్థగా..
దేశంలో ఏ పార్టీ చరిత్ర చూసినా అంతే.. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న ప్రతి నాయకుడు ఒకే సవాలును ఎదుర్కొన్నారు. రాజకీయ బలం అనేది తరచుగా పార్టీ విజయం సాధించిన సమయంలో కాకుండా, బలహీన సమయాల్లోనే కొలవబడుతుందని చరిత్ర చెబుతోంది. ఈ విషయంలో అత్యంత బలవంతులకు కూడా మినహాయింపు లేదు. నేడు నరేంద్ర మోదీ ఆధునిక భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన రాజకీయ సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు. కానీ చరిత్ర శాశ్వత మినహాయింపులను ఇవ్వదు. ఏ రాజకీయ సామ్రాజ్యం ఒక్క రోజులో కూలిపోదు. అది శాశ్వతంగా ఉంటుందని దాని సొంత ప్రజలే నమ్మడం మానేసినప్పుడే కూలిపోతుంది.
ప్రజావాణి చీదిరాల