Politics

Telangana Politics: ఒక వ్యాఖ్య.. రెండు తెలుగు రాష్ట్రాలు.. పెద్ద రాజకీయ కథ..!

రాజకీయాల్లో సంఘటనలు అనేవి ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి. వాటిని ప్రత్యేకంగా పట్టించుకోనవసరం లేదు. కానీ భావోద్వేగాలనేవి మాత్రం శాశ్వతం. అందుకే ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ జనసేన వివాదాన్ని కేవలం ఒక టీవీ డిబేట్, ఒక వ్యాఖ్య, ఒక క్షమాపణగా మాత్రమే చూడలేం.

Telangana Politics: ఒక వ్యాఖ్య.. రెండు తెలుగు రాష్ట్రాలు.. పెద్ద రాజకీయ కథ..!

రాజకీయాల్లో సంఘటనలు అనేవి ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి. వాటిని ప్రత్యేకంగా పట్టించుకోనవసరం లేదు. కానీ భావోద్వేగాలనేవి మాత్రం శాశ్వతం. అందుకే ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ జనసేన వివాదాన్ని కేవలం ఒక టీవీ డిబేట్, ఒక వ్యాఖ్య, ఒక క్షమాపణగా మాత్రమే చూడలేం. అలా చూసి ఉంటే.. ఆ అంశం.. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం, ఆ తర్వాత వ్యాఖ్యల ఉపసంహరణతో ముగిసి ఉండేది. కానీ అది అక్కడితో ఆగలేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అవుతారంటూ ప్రచారం, భద్రత అంశం, పౌర సమాజ స్పందన, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు, వాటికి ప్రతిస్పందనలు, చివరకు ఆంధ్ర-తెలంగాణ ప్రాంతీయ చర్చల వరకు విస్తరించింది. చినికి చినికి గాలి వానగా మారడమంటే ఇదేనేమో. వాస్తవానికి ఇక్కడ ప్రశ్న లేదంటే వ్యాఖ్య ఎవరు మొదలుపెట్టారు అనేది కాదు.. చివరకు ఎవరు లాభపడతారనేదే కీలకం.

చినికి చినికి గాలి వానలా..

గతంలో ఇలాంటి వివాదాలు కొన్ని రోజులకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి వ్యాఖ్యను, ప్రతి ప్రతిస్పందనను మరింత విస్తృతంగా ప్రచారం చేస్తోంది. యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్ వంటి వేదికల్లో వివాదం నిరంతరం జరుగుతూనే ఉండటంతో అది ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు.. ఆయనకు అభిమానుల్లో ప్రత్యేకమైన భావోద్వేగ అనుబంధం ఉంది. అందువల్ల ఆయనపై వచ్చే విమర్శలను చాలా మంది రాజకీయ విమర్శలుగా కాకుండా వ్యక్తిగత దాడులుగా పరిగణిస్తారు. ఈ అంశమే వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. అందుకే ఈ వివాదాన్ని ఒక వ్యాఖ్య, ఒక క్షమాపణ లేదా ఒక టీవీ డిబేట్‌తో పరిమితం చేయడం కష్టం. ఇది ఆధునిక రాజకీయాల్లో నాయకుల చుట్టూ ఏర్పడే భావోద్వేగ అనుబంధాలు, సోషల్ మీడియా ప్రభావం, భావ ప్రకటనా స్వేచ్ఛ, రాజకీయ ప్రయోజనాలు ఎలా పరస్పరం ముడిపడి ఉంటాయో చూపించే ఒక ఉదాహరణగా కూడా చూడవచ్చు. "చినికి చినికి గాలి వాన"లా మారిన ఈ వివాదం, అసలు అంశం కంటే దాని చుట్టూ ఏర్పడిన సామాజిక-రాజకీయ ప్రతిస్పందనల వల్లే ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంది.

రాజకీయ భిక్ష పెట్టిందెవరు?

ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ జనసేన అంశం ఆంధ్ర-తెలంగాణ ప్రాంతీయ చర్చలకు సైతం దారితీసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ రాజకీయ సమీకరణాల్లో ఆంధ్ర మూలాలకు చెందినే ఓటర్లే నేటికీ అత్యంత ప్రభావవంతమైన వర్గం. అలాంటి తరుణంలో కేవలం పవన్ కల్యాణే కాదు.. తెలుగు ఆత్మగౌరవం, ఎన్టీఆర్ వారసత్వం, ప్రాంతీయ గుర్తింపు వంటి అనేక భావోద్వేగ చర్చలు ఒకేసారి తెరపైకి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని తాజాగా నెరవేర్చుకున్నారు. అదేంటంటే.. ఎన్నటీఆర్ విగ్రహ ఏర్పాటు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాదించింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని హైదరాబాద్‌ నగర కేంద్రమైన మైత్రీవనం చౌరస్తాలో రేవంత్ ఏర్పాటు చేసి.. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై కూడా నిప్పులు చెరిగారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ నీడన బతికిన వాళ్లంతా ఆయనను తక్కువ చేసి మాట్లాడటం సమంజసమా? అని నిలదీశారు.

బొంగరం కూడా తిప్పలేరు..

ఎన్టీఆర్‌ లేకుండానే నాయకులయ్యారా? అని రేవంత్ ప్రశ్నించారు. మొత్తానికి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పనిలో పనిగా కేసీఆర్‌ను కార్నర్ చేశారు. ఒకరకంగా చెప్పాలంటే.. ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి దానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ప్రస్తుతం ఒంటరిగా మిగిలిందంటే బీఆర్ఎస్ అనే చెప్పాలి. ఒకప్పుడు అంటే గత ఎన్నికల సమయంలో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పనున్నారంటూ వచ్చిన వార్తలపై కేటీఆర్ స్పందిస్తూ.. ఢిల్లీలో చక్రం తిప్పడం అటుంచి, విజయవాడలో కనీసం బొంగరం కూడా తిప్పలేరంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్ర ప్రజలే ఆయనను రిటైర్ చేస్తారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. పైగా ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ ఉత్తర కుమార ప్రగల్భాలను కేసీఆర్ తదితరులు పలికారు. మొత్తానికి ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కే ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.

గడ్డు సమయమే..

ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం సహా కొన్ని జిల్లాల్లో ఇంకా ఆంధ్రా మూలాలు గట్టిగానే ఉన్నాయి. వారిని ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తన వంతు ప్రయత్నం తాను గట్టిగానే చేస్తోంది. పైగా రేవంత్ వచ్చేసి చంద్రబాబు శిష్యుడు కావడంతో ఆంధ్రకు చెందిన వారు ఆయనకే సపోర్ట్‌గా నిలుస్తారనడంలో సందేహం లేదు. మరి బీఆర్ఎస్ వారిని ఎలా తమ వైపునకు తిప్పుకుంటుంది? గతంలో అయితే ఇక్కడ టీడీపీని గెలిపిస్తే తిరిగి ఏపీ పాలకులు ఎంటర్ అవుతారు. తిరిగి ఏపీ వాళ్లే తెలంగాణపై అధిపత్యం చెలాయిస్తారంటూ ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టారు. ఇప్పుడు ప్రజలు తెలివిమీరి పోయారు. అలాంటి పప్పులేమీ ఉడకడం లేదు. ఈ తరుణంలో ఏపీ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ ఏం చేస్తుందో చూడాలి. ఒకరకంగా ఇది ఆ పార్టీకి గడ్డు సమయమే. టీఆర్ఎస్‌ పేరుతో ఎదిగిన పార్టీ.. ఆ పేరును తాజాగా కవిత తన్నుకుపోయారు. ఏపీ వాసులను కాంగ్రెస్ బుట్టలో వేసే పనిలో ఉంది. మొత్తంగా బీఆర్ఎస్ ఇక ముందు ఏం చేస్తుందో చూడాలి.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 30, 2026 7:49 AM