తిరుమల లడ్డూపై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ.. మరి అయోధ్య రాముడేం చేశాడు?
తిరుపతి లడ్డూ విషయానికి వస్తే.. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్‌సైట్, యూట్యాబ్ ఛానల్స్ ఒకటేమిటి? అన్నింటిలోనూ పెద్ద ఎత్తున చర్చ. ప్రతి టీవీ స్టూడియోలో చర్చలే. ప్రతి రాజకీయ నాయకుడూ మీడియా ముందుకు వచ్చి వ్యాఖ్యలు చేశాడు.
తిరుపతి లడ్డూ విషయానికి వస్తే.. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్‌సైట్, యూట్యాబ్ ఛానల్స్ ఒకటేమిటి? అన్నింటిలోనూ పెద్ద ఎత్తున చర్చ. ప్రతి టీవీ స్టూడియోలో చర్చలే. ప్రతి రాజకీయ నాయకుడూ మీడియా ముందుకు వచ్చి వ్యాఖ్యలు చేశాడు. ప్రతి సోషల్ మీడియా టైమ్‌లైన్‌లో అదే అంశం. మరి అయోధ్య రామయ్య ఏం పాపం చేశాడు? అసలు పాపం చేసింది ఆయనా? లేదంటే నిలువునా దోచేస్తున్న దొంగలా?
రామ మందిరం విషయానికి వచ్చేసరికి హైడ్‌లైన్స్ ఎందుకు డైవర్ట్ అవుతున్నాయి? ఇంట్రస్ట్‌గా పెట్టే థంబ్ నైల్స్ అయోధ్య రామయ్య విషయంలో ఎందుకు ఆసక్తి కనబరచడం లేదు? హెడ్‌లైన్లు ఒక్కసారిగా సియా, ఇథనాల్, టీఎంసీ, శివసేన, నీట్ వంటి ఇతర అంశాల వైపు ఎందుకు మళ్లిపోతున్నాయి? ప్రజాస్వామ్యం మారిందా? అసలేం జరుగుతోంది. ఎందుకు మీడియా మొత్తం మూకుమ్మడిగా సైలెంట్ అయిపోయింది?
ఏం చేసినా చెల్లుతుందనా?
అయోధ్య శ్రీరాముడి ఆలయంలో బాలరాముడిని ఎందుకు ప్రతిష్టించారో ఇప్పుడు అర్థమవుతోంది. బాల రాముడు పసివాడు. అన్యం పుణ్యం ఎరుగని వాడు కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనా? ఎంత దారుణంగా దోచేసినా బాల రామయ్య చిరునవ్వులు చిందిస్తూ చూస్తూ కూర్చుంటాడనా? బాల రామ్ లల్లా నుంచి మర్యాద పురుషోత్తముడి వరకూ.. ధర్మం చెప్పే శాశ్వత సందేశం ఒక్కటే. శతాబ్దాలుగా కోట్లాది మంది భక్తులు శ్రీరాముడు తన జన్మభూమికి తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఆ నిరీక్షణకు ముగింపు పలికిన మహత్తరమైన క్షణంలో ప్రతిష్ఠించబడింది యోధుడైన రాముడు కాదు… అయోధ్యకు పట్టాభిషిక్తుడైన రాజు కాదు… అమాయకమైన చిరునవ్వుతో దర్శనమిచ్చే బాల రామ్ లల్లా. ఈ రూపం వెనుక ఒక ఏదైనా గొప్ప మెసేజ్ దాగి ఉందని అనిపిస్తుంది. బాలుడు నిర్మలత్వానికి, అమాయకత్వానికి ప్రతీక. స్వార్థం, రాజకీయాలు, అధికారం, కుట్రలు, మోసాలు, అవినీతి వంటి మానవ బలహీనతల గురించి బాలుడికి తెలియదు.
ఆలస్యమవుతుందేమో కానీ..
అలాగే దేవుని బాలరూపం కూడా స్వచ్ఛమైన ప్రేమను, నిష్కల్మషమైన భక్తిని మాత్రమే స్వీకరిస్తుంది. భక్తి వెనుక ఉన్న హృదయాన్ని చూస్తుంది కానీ ప్రదర్శనను కాదు. అయితే ఒక శాశ్వత సత్యాన్ని మనం మరవకూడదు. బాలుడనే వాడు ఎప్పటికీ అలాగే ఉండిపోడు. ప్రతి బాలుడు ఎదుగుతాడు.. ఎదగాల్సిందే. అలాగే బాల రామ్ లల్లా కూడా కేవలం అమాయకత్వానికి ప్రతీకగా చూస్తే అంతకు మించిన అమాయకత్వం మరొకటి ఉండదు. ధర్మానికి భంగం కలిగినప్పుడు, నిరపరాధులపై అన్యాయం జరిగినప్పుడు, విశ్వాసాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించినప్పుడు, అదే బాలుడు మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడిగా నిలుస్తాడు. ధర్మాన్ని స్థాపించే వాడు, అధర్మాన్ని ఎదుర్కొనే వాడు, అన్యాయం ఎన్నటికీ శాశ్వతంగా విజయం సాధించదని ప్రపంచానికి గుర్తుచేసే వాడు. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం ఎప్పటి నుంచో ఒకే సూత్రాన్ని చెబుతోంది. ధర్మం ఆలస్యమవుతుందేమో గానీ, ఓడిపోదు. అధర్మం కొంతకాలం విజయవంతంగా కనిపించవచ్చు.
స్వార్థానికి ఆయుధంగా..
అధికారంతో, సంపదతో, ప్రచారంతో అది బలంగా కనిపించవచ్చు. కానీ కాలం గడిచేకొద్దీ సత్యం తన స్థానాన్ని తిరిగి సంపాదిస్తుంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి పేరును దుర్వినియోగం చేసినవారు ఎప్పటికైనా తమ కర్మఫలాన్ని అనుభవిస్తారనే విశ్వాసం భక్తుల్లో ఉన్నట్లే, ఇదే శాశ్వత ధర్మసూత్రం ప్రతి చోటా వర్తిస్తుంది. ఏ దేవుని పేరునైనా స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించడం, భక్తుల విశ్వాసాన్ని మోసం చేయడం, పవిత్రతను లాభనష్టాల లెక్కల్లోకి తేవడం.. ఇవి తాత్కాలికంగా ప్రయోజనం ఇచ్చినట్లు కనిపించినా, ధర్మం ముందు నిలబడలేవు. దేవుని పేరును మనుషులు దుర్వినియోగం చేయవచ్చు. మతాన్ని రాజకీయాలకు ఉపయోగించవచ్చు. విశ్వాసాన్ని స్వార్థానికి ఆయుధంగా మార్చవచ్చు. కానీ దేవుని న్యాయాన్ని ఎవరూ మోసం చేయలేరు. మనుషుల చట్టం నుంచి కొందరు తప్పించుకోవచ్చు. సమాజాన్ని కొంతకాలం మభ్యపెట్టవచ్చు. చరిత్రను కూడా తమకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నించవచ్చు. కానీ ధర్మం నుంచి ఎవరూ తప్పించుకోలేరు.
విజయం వ్యక్తులది కాదు..
ఎందుకంటే ధర్మం అనేది ఒక వ్యక్తి తీర్పు కాదు, ఒక ప్రభుత్వ చట్టం కాదు, ఒక రాజకీయ సిద్ధాంతం కాదు. అది కాలాన్ని మించిన సత్యం. అది కర్మకు ప్రతిఫలం ఇచ్చే శాశ్వత నియమం. చివరికి కాలమే దేవునికి సాక్షిగా నిలుస్తుంది. అసత్యపు పొరలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. నిజం వెలుగులోకి వస్తుంది. అధర్మం తన ఫలితాన్ని అనుభవిస్తుంది. ధర్మం తన స్థానాన్ని తిరిగి పొందుతుంది. అందుకే బాల రామ్ లల్లా రూపం కేవలం బాల్యానికి ప్రతీక కాదు. అది భక్తికి, నిర్మలత్వానికి, సహనానికి ప్రతీక. అదే సమయంలో అవసరమైనప్పుడు ధర్మాన్ని స్థాపించే శ్రీరాముని శాశ్వత వాగ్దానానికి కూడా ప్రతీక. చివరికి విజయం వ్యక్తులది కాదు. అధికారాలది కాదు. కాలం మారినా, యుగాలు మారినా, శాశ్వతంగా నిలిచేది ఒక్కటే ధర్మం. దాన్ని భూస్థాపితం చేసిన వారు అంతమవక తప్పదు. దీని వెనుక ఎలాంటి శక్తులున్నా కూడా దారుణమైన ఫలితం అనుభవించక తప్పదు.
ప్రజావాణి చీదిరాల