Trisha: తిరుచ్చి ఈస్ట్‌పై ఆసక్తికర చర్చ.. సీన్‌లోకి త్రిష.. విజయ్ ఏం చేస్తారో..
తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నిక ప్రస్తుతం తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, యాక్టర్ రాఘవ లారెన్స్ సైడ్ అయిపోయి సీన్‌లోకి త్రిష రావడమే.
తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నిక ప్రస్తుతం తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, యాక్టర్ రాఘవ లారెన్స్ సైడ్ అయిపోయి సీన్‌లోకి త్రిష రావడమే. తొలుత లారెన్స్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ ఆయనైతే తను తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో పోటీ చేయడం లేదని చెప్పి పోటీపై వస్తోన్న ఊహాగానాలకు లారెన్స్ చెక్ పెట్టారు. తిరుచ్చి ఈస్ట్‌లో తాను పోటీ చేయడం ధర్మం కాదని.. టీవీకే విజయం, విజయ్‌ను సీఎం చేయడం కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకే ఈ అవకాశం దక్కాలన్నారు. లారెన్స్ మరో విషయం కూడా చెప్పారు. తాను తిరుచ్చి నుంచి మాత్రమే తప్పుకుంటున్నానని.. భవిష్యత్తులో వేరే ప్రాంతం నుంచి ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని... ప్రజలకు సేవ చేసేందుకు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని లారెన్స్ స్పష్టం చేశారు
మరో బాంబ్ కూడా లారెన్స్ పేల్చారు. తాను ఏ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నారు. అంటే ఆయన టీవీకే నుంచే పోటీ చేస్తారని అనుకోవడానికి లేదు. తనకు ఏ పార్టీలో గౌరవం ఉంటుందో ఆ పార్టీలోనే చేరుతానని లారెన్స్ స్పష్టం చేశారు. 2026, ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్ని్కల్లో టీవీకే చీఫ్ విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి కాబట్టి తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. దీంతో తిరుచ్చి ఈస్ట్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఇక్కడి లారెన్స్ పోటీ చేస్తారని ఊహాగానాలు నడిచాయి. కానీ ఆయన అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని తేల్చడంతో సీన్‌లో త్రిష వచ్చారు. ప్రస్తుతం త్రిష చుట్టూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ స్థానం నుంచి త్రిష పోటీ చేస్తారంటూ ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. టీవీకే తరుఫున త్రిష బరిలోకి దిగనుందంటూ ప్రచారం జరుగుతోంది. లారెన్స్‌కు బదులుగా త్రిష పేరు తెరపైకి వచ్చింది. అసలు విజయ్ మనసులో ఏముందనేది తెలియడం లేదు. త్రిషను విజయ్ రాజకీయాల్లోకి తీసుకొస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక తిరుచ్చి ఈస్ట్ నుంచి త్రిష పోటీ చేస్తారా? లేదంటే మరెవరైనా బరిలోకి దిగుతారా? అనేది కాలమే తేల్చనుంది.