Politics

సీఎంలు సైతం ఆమె విగ్రహాన్ని చూసి వణికిపోతారట.. ఆమె ఎవరంటే..

ఓ విగ్రహాన్ని చూస్తే ముఖ్యమంత్రులకు సైతం ముచ్చెమటలు పడతాయట. సాక్షాత్తు జయలలిత అంతటి నాయకురాలే.. ఆమె ఎదురుగా ఉంటే భయం కలుగుతోందని ఆ విగ్రహాన్ని అసెంబ్లీ ముందు నుంచి తీయించేశారట. మరి అంతటి ప్రభావవంతమైన ఆ స్త్రీ ఎవరు?

సీఎంలు సైతం ఆమె విగ్రహాన్ని చూసి వణికిపోతారట.. ఆమె ఎవరంటే..

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌కి వెళ్లినప్పుడు మనం చాలా విగ్రహాలను చూస్తుంటాం. వరుసబెట్టి ఎందరో మహానుభావుల విగ్రహాలు అయితే ఉంటాయి. అలాగే చెన్నై మెరీనా బీచ్‌లోనూ విగ్రహాలుంటాయి. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. వాటిలో ఓ విగ్రహాన్ని చూస్తే ముఖ్యమంత్రులకు సైతం ముచ్చెమటలు పడతాయట. సాక్షాత్తు జయలలిత అంతటి నాయకురాలే.. ఆమె ఎదురుగా ఉంటే భయం కలుగుతోందని ఆ విగ్రహాన్ని అసెంబ్లీ ముందు నుంచి తీయించేశారట. మరి అంతటి ప్రభావవంతమైన ఆ స్త్రీ ఎవరు? ఎందుకు ఆమె విగ్రహాన్ని చూసినా నేతలకు ముచ్చెమటలు పడతాయి? తెలుసుకుందాం.

చెన్నై మెరీనా బీచ్‌లో ఒక విగ్రహం చాలా స్పెషల్‌గా జీవం ఉట్టిపడుతూ దర్శనమిస్తుంది. అది ఒక స్త్రీ మూర్తి విగ్రహం. మన ఎదురుగా ఆగ్రహంతో రగిలిపోతూ.. విరబోసుకున్న జుట్టుతో చాలా ధిక్కారంగా నిలబడి.. ఒక చేతిలో కాళ్ళకి వేసుకునే కడియాన్ని పట్టుకొని, మరో చేతితో ఎవరినో నిలదీస్తున్నట్టుగా ఉంటుందా విగ్రహం. సీఎంలు సైతం ఆ విగ్రహం వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడిపోతారట.

సాధారణ ఇల్లాలు..

ఆ స్త్రీ మూర్తి పేరు కణ్ణగి. ఆమె ఎవరంటారా? ఆమె ఒక సాధారణ గృహిణి. మరి ఆమెకు ముఖ్యమంత్రులు భయపడటమేంటంటారా? తెలుసుకుందాం. తమిళ పంచకావ్యాలలో ఒకటి.. తమిళ మహాకవి ఇళంగో వడిగళ్ క్రీ.శ. రెండవ శతాబ్దంలో రాసిన కావ్యం ‘శిలప్పాదిగారం’. దీనిలో కణ్ణగి కథ ఉంటుంది. ఆమె చోళులలో గొప్ప రాజైన కరికాళ చోళుని కాలంలో పుహార్ పట్టణంలో ఉండే ఒక వ్యాపారస్తుని కూతురు. కోమలన్ అనే వ్యాపారస్థునితో కణ్ణగి వివాహం జరిగింది. ఆమె యుద్ధాలు చేసి ఎవ్వరినీ భయబ్రాంతులకు గురి చేసిందేమీ లేదు. ఇల్లే ప్రపంచంగా భావించిన ఓ సాధారణ ఇల్లాలు. ఆమె భర్త కోవలన్.. మాధవి అనే నర్తికిని ఇష్టపడి ఇంటినీ, వ్యాపారాన్ని వదిలి ఆమె దగ్గరే ఉంటూ ఆస్తులన్నీ ఆమెకే ధారాదత్తం చేశాడు. చివరకు కణ్ణగి ఒంటిపై ఉన్న నగలను సైతం తీసుకెళ్లి మాధివికి ఇచ్చేశాడు. కూతురు పుట్టేనాటికి ఏమీ మిగల్చలేదు.

ఫలించని ఎదురుచూపులు..

ఇంత జరుగుతున్నా కణ్ణగి మౌనం వహించింది. భర్త మారతాడనే ఆలోచనలోనే ఉంది. మరోవైపు కోవలన్ ఆస్తులన్నీ లాగేసుకున్నాక అతని దగ్గర ఏమీ లేదని మాధవి తల్లికి అర్థమైంది. దీంతో అతడిని వదిలించుకోమని కూతురికి సలహా ఇచ్చింది. కానీ మాధవి సైతం కోవలన్‌ను ఇష్టపడటంతో వదుకునేందుకు ఇష్టపడలేదు. కణ్ణగి ఎదురు చూపులు ఫలించలేదు. కొన్నాళ్లకి మాధవితో కోవలన్‌కు గొడవ జరగడంతో అతనికి తన భార్యను కష్టపెట్టిన విషయం అర్థమవుతుంది. ఏడుస్తూ కణ్ణగి దగ్గరకు రాగా.. తనకు ఇచ్చేందుకు తన దగ్గర ఏమీ లేదని.. తన కాలికి ఉన్న బంగారు కడియాన్ని తీసి ఇచ్చింది. కాలి కడియంతో వ్యాపారం చేస్తానంటూ మధురైకి కణ్ణగిని తీసుకుని బయలుదేరుతాడు. మాధవి సైతం తిరిగి వచ్చి కోవలన్‌కు కబురు పెడుతుంది. కానీ కోవలన్.. కణ్ణగిని విడిచి వెళ్లడు.

రాజభవనానికి కణ్ణగి..

మధురైలోని ఒక జైన సన్యాసిని ఆశ్రమంలో కోవలన్, కణ్ణగి దంపతులు కొన్నాళ్ళు ఉంటాడు. వ్యాపార నిమిత్తం కణ్ణగి ఇచ్చిన కడియాన్ని అమ్మేందుకు ఒక నగల వ్యాపారి దగ్గరికి కోవలన్ వెళ్లగా.. సరిగ్గా అప్పుడే... మధురై రాజ్యానికి రాజైన నెడుంజెళియన్ భార్య కడియం చోరీ అవుతుంది. అది కోవలన్ దగ్గర ఉన్న కడియంలాగే ఉండటంతో ఆ నగల వ్యాపారి రాజభటులకి ఫిర్యాదు చేస్తాడు. దొంగ దొరికాడనే మాట వినగానే ఏమాత్రం విచారణ చేయకుండా నెడుంజెళియన్ మహారాజు దొంగని చంపేయమని ఆదేశిస్తాడు. రాజు ఇచ్చిన ఆదేశం ప్రకారం సైనికులు కోవలన్ తల నరికేస్తారు. పూజకి వెళ్లి వస్తున్న కణ్ణగి భర్తను చంపేశారన్న వార్త తెలుస్తుంది. తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేక కోపంతో తన కాలికి ఉన్న రెండవ కడియాన్ని తీసుకుని రాజభవనానికి వెళ్లింది. కణ్ణగి ఏడుస్తూ వెళ్లడంతో ఆ విషయాన్ని భటులు రాజుకు చెప్పారు.

అయినా చల్లారని కణ్ణగి కోపం..

ఆమెని తీసుకురమ్మని నెడుంజెళియన్ మహారాజు చెప్పడంతో భటులు ఆమెను రాజు వద్దకు తీసుకెళతారు. కోపంతో వచ్చే కణ్ణగిని చూడగానే ఏదో తప్పు జరిగిందని నెడుంజెళియన్‌కు అర్థమైపోయింది. ఏం కష్టం వచ్చిందని ఆమెను నెడుంజెళియన్ అడగ్గా... "నా భర్తని, నువ్వు అన్యాయంగా చంపించావంటూ ఆగ్రహంతో మాట్లాడుతున్న ఆమెను చూశాక అందరిలోనూ భయం. ఆమె భర్త దొంగిలించాడు కాబట్టే మరణ శిక్ష విధించానని రాజు చెప్పడంతో తన చేతిలో ఉన్న రెండో కడియాన్ని కణ్ణగా రాజుకు చూపించింది. తన భార్య కడియం, అదీ వేరని రాజుకు అర్థమవుతుంది. విచారణ జరపకుండా శిక్ష విధించడంపై మహారాజునే నిలదీసింది. తప్పుడు తీర్పు ఇచ్చిన బాధతో నెడుంజెళియన్ గుండె ఆగి మరణించగా.. అతని భార్య సైతం భర్తతో పాటే మరణిస్తుంది. అయినా కూడా కణ్ణగి కోపం చల్లారలేదు. అన్యాయంగా ఒక మనిషిని చంపిన ఆ రాజ్యం మంటల్లో కాలిపోవాలని శపించడంతో తగలబడిపోతున్న మధురై నగరాన్ని కాపాడేందుకు సాక్షాత్తూ మధురమీనాక్షి అమ్మవారే వస్తుంది.

కరుణానిధి సైతం విగ్రహానికి ఎదురుగా వెళ్లేవారు కారట..

కోపాన్ని తగ్గించుకోమని.. స్వర్గంలో నీ భర్తని కలుస్తావని చెప్పింది. మీనాక్షి అమ్మవారు చెప్పినట్టుగానే కణ్ణగి స్వర్గానికి పోతుంది. ఇదీ కణ్ణగి కథ. అసలు ఈ కథకు ముఖ్యమంత్రులకు ఏంటి సంబంధం? అనే సందేహం వస్తోంది కదా.. అది కూడా తెలుసుకుందాం. ఇది చదువుతుంటే ఏదో ఫిక్షనల్ స్టోరీ చదివినట్టుగా ఉంటుంది. కానీ తప్పు చేసిన వాడు రాజైనా సరే ఎదిరించాలని చెప్పిన కణ్ణగిని తమిళులు పూజిస్తుంటారు. మహారాజును సైతం తప్పు చేశాడని నిలదీసింది కాబట్టి కణ్ణగి విగ్రహాన్ని చూస్తే ముఖ్యమంత్రులు సైతం భయపడిపోతారు. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ విగ్రహానికి ఎదురుగా వెళ్లకుండా మరో దారి నుంచి అసెంబ్లీలోకి వెళ్లేవారని టాక్. వాస్తవానికి కరుణానిధి నాస్తికుడు పైగా ఆయనకు ఎలాంటి సెంటిమెంట్స్ అనేవి ఉండవు. అలాంటి వ్యక్తే ఆ విత్రహానికి భయపడిపోయారని టాక్. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీ ముందున్న ఆ విగ్రహం తనకు ఎలాంటి ముప్పు తెచ్చిపెడుతుందోనని.. అధికారం ఎక్కడ చేజారిపోతుందోనని భయపడి 2001లో అక్కడి నుంచి తీసేయించిందని రూమర్. ఆ తరువాత ఆ విగ్రహాన్ని 2026లో మెరీనా బీచ్ దగ్గర నిలబెట్టారు. ఇక్కడే కాకుండా శ్రీలంకలోనూ కణ్ణగి అమ్మాళి పేరిట పూజలు నిర్వహిస్తారు.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 28, 2026 9:58 AM