Kavitha: ‘ఇడుపు కాయితం’లో నీ ఎంట్రీ ఏందక్కా.. పవన్‌కేం సంబంధమని లాగుతున్నావ్?
ఇదంతా ఒక ఎత్తైతే ఈ యవ్వారంలోకి తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క ఎంటరయ్యారు. అయితే అయ్యారుపో.. మధ్యలోకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లాగారు.
‘ఇడుపు కాయితం’ టైటిల్ గురించి పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. నటుడు ప్రియదర్శి, నాగదుర్గ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా టైటిట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి చిత్రంపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. దీని చుట్టూ విమర్శలు, రచ్చతో సినిమాకైతే ప్రమోషన్ పరంగా మేలే జరుగుతోంది. ఈసినిమా నిర్మాత బన్నీ వాసు సైతం టైటిల్ మార్చే ప్రసక్తే లేదని తేల్చేశారు. ఇదంతా ఒక ఎత్తైతే ఈ యవ్వారంలోకి తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క ఎంటరయ్యారు. అయితే అయ్యారుపో.. మధ్యలోకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లాగారు. అసలు ఆయనకేం సంబంధం? ఆయననెందుకు లాగుతున్నారనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది.
వెకిలి ప్రయత్నాలు మానాలి..
‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్ వ్యవహారంపై కవిత స్పందించారు. ‘ఇడుపు కాయితం’ అంటే అర్థం కావడం లేదంటూ కొంతమంది విపరీతంగా ట్రోల్ చేయడంపై తెలంగాణ వ్యక్తిగా.. తెలంగాణ నాయకురాలిగా ఆగ్రహం వ్యక్తం చేయడం సరైనదే కానీ మధ్యలోకి పవన్ కల్యాణ్ పేరును తీసుకురావడమే బాగోలేదు. మన భాష, యాస మీద అవహేళన చేసినందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందని.. ఇకనైనా ఇలాంటి వెకిలి ప్రయత్నాలు మానుకోవాలని, ఒకరి భాషను, ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకోవాలని హితవు పలకడం వరకూ ఓకే కానీ.. ‘ఇడుపు కాయితం’ పేరుకు అర్థం కావలసిన వాళ్లు... పోయి సినిమా యాక్టర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను అడగాలంటూ వ్యంగ్యంగా మాట్లాడటమే అతిగా అనిపిస్తోంది. ఆ టైటిల్ అర్థం పవన్ కచ్చితంగా చెప్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం అస్సలు బాగోలేదు.
లిక్కర్ స్కాం అంటే ఏమిటంటే..
ప్రపంచంలో ఏం జరిగినా దానిలోకి పవన్‌ను లాగుతారా? పోనీ ఆ విషయం అటుంచుదాం. రేపటి రోజున ఎవరైనా లిక్కర్ స్కాం అంటే ఏమిటంటే.. కవితక్కను అడగాలని నెటిజన్లు, జనసేన క్యాడర్ అంటున్నారు. అడగమంటారా? చెరపకురా చెడేవు అంటారు పెద్దలు. ఎందుకు రాళ్లేయాలి.. తిరిగి వేయించుకోవాలి? సంబంధం లేని వారిని లాగి వారి పర్సనల్ లైఫ్ గురించి ప్రస్తావిస్తే.. ప్రతి ఒక్కరికీ ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది కదా. ఈ చిన్న లాజిక్ మరిచిపోతే ఎలా? అని నెటిజన్లు కవితను ప్రశ్నిస్తున్నారు. సమాధానం ఏం చెబుతారు? భాష, యాసను ఎవరు కించపరిచినా ఊరుకోవద్దు. తెలంగాణ బిడ్డగా అది మీ కర్తవ్యమే కానీ దానిలోకి వేరొకరిని లాగే రైట్ ఎవరిచ్చారు? పవన్ ఏమైనా తెలంగాణ భాష, యాసను అవమానించారా? ఎందుకు ఆయన ప్రస్తావన? నిత్యం వార్తల్లో ఉండాలంటే.. ఏదో ఒక టాపిక్ గురించి మీడియా ముఖంగా మాట్లాడాలి. కానీ వ్యక్తిగత జీవితాల గురించి కాదు.
ప్రజావాణి చీదిరాల