Politics

YS Jagan: జగన్ కంచుకోటలో కూటమి మాస్టర్ స్ట్రోక్.. ‘స్మార్ట్ కిచెన్’తో వైసీపీ డిఫెన్స్‌లోకి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ‘స్మార్ట్ కిచెన్’ అనే పదం కేవలం మధ్యాహ్న భోజన పథకానికే పరిమితం కాలేదు. అది అధికార–ప్రతిపక్షాల మధ్య కొత్త రాజకీయ సమరానికి కేంద్రబిందువుగా మారింది.

YS Jagan: జగన్ కంచుకోటలో కూటమి మాస్టర్ స్ట్రోక్.. ‘స్మార్ట్ కిచెన్’తో వైసీపీ డిఫెన్స్‌లోకి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ‘స్మార్ట్ కిచెన్’ అనే పదం కేవలం మధ్యాహ్న భోజన పథకానికే పరిమితం కాలేదు. అది అధికార–ప్రతిపక్షాల మధ్య కొత్త రాజకీయ సమరానికి కేంద్రబిందువుగా మారింది. పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలనే ప్రభుత్వ లక్ష్యంపై ఒకవైపు ప్రశంసలు వస్తుంటే.. మరోవైపు వేలాది మంది మధ్యాహ్న భోజన కార్మికుల భవిష్యత్తుపై ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ఈ వివాదానికి అసలు కేంద్రం ఎక్కడంటే... జగన్ సొంత జిల్లా కడప.

కూటమి ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ విధానాన్ని మొదట కడప జిల్లాలో అమలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తర్వాత అదే జిల్లాలో మరో 33 స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం మరింత ఆసక్తి రేపింది. ప్రభుత్వ వాదన ప్రకారం ఇవి విద్యార్థులకు పరిశుభ్రమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించడంతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాయి.

జగన్ ఆరోపణలు... ప్రభుత్వ కౌంటర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రం స్మార్ట్ కిచెన్ల పేరుతో సుమారు 85 వేల మంది మధ్యాహ్న భోజన కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతుందని ఆరోపించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, ప్రస్తుతం పనిచేస్తున్న వారితో పాటు మహిళా సంఘాల సభ్యులకు కూడా అవకాశాలు కల్పిస్తున్నామని, ఉద్యోగాలు తొలగించే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. జగన్ విమర్శల నేపథ్యంలో టీడీపీ నేతలు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను మూసివేసిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఉద్యోగాలు కోల్పోయిన వారి గురించి మాట్లాడని వైసీపీ ఇప్పుడు స్మార్ట్ కిచెన్లపై ఆందోళన వ్యక్తం చేయడం రాజకీయ అవకాశవాదమని విమర్శిస్తున్నారు.

మారుతున్న రాజకీయ సమీకరణాలు?

కడపను వైఎస్ కుటుంబానికి కంచుకోటగా భావిస్తారు. అలాంటి జిల్లాలోనే ప్రభుత్వం వరుసగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం రాజకీయంగా కీలకంగా మారింది. ఈ పథకం విజయవంతమైతే ప్రభుత్వానికి ప్రజల్లో మరింత మద్దతు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు ప్రజలను ఎంతవరకు ప్రభావితం చేస్తాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. కడప జిల్లాలో స్మార్ట్ కిచెన్ల విధానాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. పైగా దీనిని మరింత విస్తరించాలని యోచిస్తున్నారు. ఇది కాస్తా జగన్‌కు ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ స్మార్ట్ కిచెన్ల ద్వారా పిల్లలకు మంచి ఆహారాన్ని అందించాలని యోచిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వానికి ప్లస్ కానుంది. పైగా సొంత జిల్లాలోనే గతంలో ఓ ఎన్నిక సమయంలో కనీసం డిపాజిట్ కూడా రాకుండా చేసింది టీడీపీ. మరి ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ చేపడితే ఇంకేమైనా ఉందా? మొత్తానికే మునిగిపోయే అవకాశాలెక్కువ. కడప జిల్లాలో ఇలాంటి కార్యక్రమాల కారణంగా తన పార్టీ పూర్తిగా డౌన్ ఫాల్ అవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు. పైగా ఇదిలా కొనసాగితే రేపు తన స్థానానికే ఇబ్బంది కలిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే జగన్ అంతలా ఆందోళన చెందుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.

సంక్షేమమా? రాజకీయ అస్త్రమా?

జగన్.. స్మార్ట్ కిచెన్ల విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. 85 వేల మధ్యాహ్న భోజన కార్మికులను స్మార్ట్‌ కిచెన్‌ల పేరుతో వీధిపాలు చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. అసలు నిజంగానే తీసేస్తున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. స్మార్ట్ కిచెన్ల నిర్వహణ ద్వారా ఇప్పుడున్న వారికి తోడుగా.. స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు కూడా ఉపాధి దొరుకుతోందని మంత్రి లోకేష్ వివరించారు. మొత్తంగా చూస్తే.. ఒకవైపు విద్యార్థులకు మెరుగైన ఆహారం, మహిళలకు ఉపాధి కల్పించే పథకమని ప్రభుత్వం చెబుతుంటే... మరోవైపు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ వివాదంలో ప్రజలు ఏ వాదనను నమ్ముతారన్నదే రానున్న రోజుల్లో అసలు పరీక్ష కానుంది. ముఖ్యంగా కడపలో ఈ పథకం రాజకీయంగా ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 29, 2026 6:40 AM