Entertainment

ఎన్టీఆర్ సినిమా ఆపకుంటే మీకు సినిమా చూపిస్తాం..

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో అనౌన్స్ అయినప్పటి నుంచి పెద్ద ఎత్తు రచ్చ నడుస్తోంది. అది చినికి చినికి గాలివానగా మారింది. ఈ సినిమా ఆలోచననే మైండ్ నుంచి తీసేయాలని లేదంటే మీకు సినిమా చూపిస్తామని..

ఎన్టీఆర్ సినిమా ఆపకుంటే మీకు సినిమా చూపిస్తాం..

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో అనౌన్స్ అయినప్పటి నుంచి పెద్ద ఎత్తు రచ్చ నడుస్తోంది. అది చినికి చినికి గాలివానగా మారింది. ఈ సినిమా ఆలోచననే మైండ్ నుంచి తీసేయాలని లేదంటే మీకు సినిమా చూపిస్తామని తమిళ ప్రజలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఎన్‌టీకే పార్టీ అధినేత సీమాన్ సైతం ఈ సినిమాను తక్షణమే నిలిపివేయాలంటూ హెచ్చరించారు. దీనికి ప్రధాన కారణం.. తమిళ ప్రజల ఆరాధ్య దైవం మురుగన్. అసలే అక్కడి వారంతా ప్రాంతం, భాష పట్ల అమితమైన అభిమానాన్ని చూపిస్తారు. అలాగే తమిళనాడును ‘భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని’ అని.. ‘ఆలయాల భూమి’గా పేర్కొంటారు. అక్కడి వారంతా మురుగన్‌ను తమ ఆరాధ్యదైవంగా భావిస్తారు.

తమ ఆరాధ్యదైవాన్ని ఉత్తర భారత దైవంగా చూపించడం పట్ల తమిళ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే ఉత్తరాది వారంటే పెద్దగా దక్షిణాది వారు ఇష్టపడరు. పైగా ఉత్తరాది వారికి దక్షిణాది వారంటే చిన్నచూపు అనే భావన కూడా ఉంది. అందుకే తమ ఆరాధ్యదైవమైన మురుగన్‌ను ఉత్తరాది దైవంగా చూపిస్తారా? అని తమిళవాసులు ఫైర అవుతున్నారు. పురాణాలను వక్రీకరించి ఇష్టానుసారంగా సినిమాలు తీస్తే ఊరుకునేది లేదని.. సినిమాను ఆపకుంటే ఆందోళన చేస్తామంటూ సెంథమిళన్ సీమాన్ వార్నింగ్ ఇచ్చారు. అసలు వివాదం ఎక్కడ ప్రారంభమైందంటే.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాలో సుబ్రహ్మణ్య స్వామి నేపథ్యాన్ని కథగా ఎంచుకుని సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు.

ఈ పోస్టర్ గురించి నిర్మాత నాగవంశీ చెబుతూ.. ‘ఉత్తరాదిలో పుట్టి దక్షిణాదిలో ఆరాధ్య దైవంగా సుబ్రహ్మణ్యస్వామి పూజలందుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. దీనిపై తమిళనాడు భగ్గుమంది. తమ దైవమైన మురుగన్‌ను ఉత్తరాదిలో పుట్టాడని ఎలా అంటారంటూ మండిపడుతున్నారు. శివపార్వతుల తనయుడైన చిన్న కుమారుడే.. మురుగన్. ఆయన కార్తికేయ, సుబ్రహ్మణ్య స్వామిగా కూడా భక్తులు పూజిస్తుంటారు. సుబ్రహ్మణ్య స్వామి జన్మ స్థలంపై హిందూ పురాణాల్లో అనేక కథనాలు ఉన్నాయి. ఆయన శివుని మూడవ కంటి నుంచి వెలువడిన నిప్పురవ్వల నుంచి గంగానదిలో జన్మించి, తమిళనాడులోని తిరుచెందూర్ పవిత్ర కొండలపై పెరిగాడని దక్షిణ భారతదేశ ప్రజల నమ్మకం. ఉత్తరాదివారు.. ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పట్టణమైన రుద్రప్రయాగ్‌ను కార్తికేయుడు జన్మించిన ఖచ్చితమైన భూలోక ప్రదేశంగా చెబుతారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 6, 2026 4:50 AM