కేతన్ అగర్వాల్ హత్య కేసు.. ఇంతకు మించిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఉండదేమో..!
మహారాష్ట్ర పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు.. ఇంతకు మించిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లోనూ చూడలేమేమో. రోజుకో కొత్త విషయం. ప్రతిదీ ఆసక్తికరమే. ఊహించని ట్విస్ట్‌లు, టర్న్‌లు..
మహారాష్ట్ర పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు.. ఇంతకు మించిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లోనూ చూడలేమేమో. రోజుకో కొత్త విషయం. ప్రతిదీ ఆసక్తికరమే. ఊహించని ట్విస్ట్‌లు, టర్న్‌లు.. తాజాగా ఈ కేసులో వెలుగు చూసిన ట్విస్ట్ ఏంటంటే.. నిందితురాలు సియా గోయల్ హత్యకు దాదాపు నెల రోజుల ముందే తన స్నేహితురాలికి ఈ పెళ్లి జరగదని స్నాప్‌చాట్‌లో మెసేజ్ చేసిందట. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో కేతన్ హత్యకు చాలా కాలం ముందే కుట్ర పన్నిందని.. దానికి ఈ మెసేజ్ సాక్ష్యమని అధికారులు భావిస్తున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. సియా గోయల్ తన స్నేహితురాలికి మే నెలలో స్నాప్‌చాట్‌లో ఒక మెసేజ్ చేసింది. నవంబరులో ఉదయ్‌పూర్‌లో జరగాల్సిన వివాహానికి టికెట్లు బుక్ చేయడానికి ఆధార్ కార్డ్ కాపీ పంపాలని మెసేజ్‌లో పేర్కొంది. 'పెళ్లికి టికెట్లు బుక్ చేయడం కోసం నీ ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫొటోలు పంపించు. ఈ పెళ్లి ఎలాగూ జరగదు కానీ అయినా కూడా పంపించు.' అని సియా మెసేజ్ చేసింది. అప్పటికే కేతన్ కుటుంబం- బంధువులు, స్నేహితులు, అతిథుల పేర్లు, ఆధార్ వివరాలు సేకరిస్తుండగా.. సియా తరఫున బంధువుల వివరాలు కూడా అడిగినట్లు పోలీసులు చెప్పారు.
ఇక ఈ స్నాప్‌చాట్ మెసేజ్ విషయమై సియా స్నేహితురాలిని పోలీసులు విచారించనున్నట్టుగా తెలుస్తోంది. సియా స్నేహితురాల్ని విచారించి- కేతన్ హత్య గురించి ముందే తెలుసా?, సియా పెళ్లి జరగదని ఎందుకు చెప్పింది? హత్య ప్లాన్ గురించి ఎప్పుడైనా చెప్పిందా? వంటి విషయాలపై సమాచారం సేకరించనున్నట్టు సమాచారం. ఇప్పటికే సియాను పుణెలోని లుల్లానగర్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే హత్య ప్లాన్‌కు సంబంధించిన రిహార్సల్స్ జరిగాయని పోలీసులు భావిస్తన్నారు. అంతకు ముందు రోజు సియా ప్రియుడు చేతన్ చౌదరిని లోహ్‌గడ్ కోటకు తీసుకెళ్లి కేతన్ బరువుతో సమానమైన డమ్మీ సహాయంతో సీన్ రీక్రియేట్ చేశారు.
కేతన్ ఇంట మరో విషాదం..
కేతన్ అగర్వాల్ మరణం నుంచి ఆ కుటుంబం తేరుకోక ముందే ఆ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. కేతన్ అగర్వాల్ తాత దేవీచంద్ అగర్వాల్ (71) శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల ప్రకారం కేతన్ మరణం ఆయనను తీవ్రంగా కలచివేసిందట. తీవ్ర మనోవేదనతో కొద్ది రోజులుగా దేవీచంద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం గుండెపోటుతో కన్నుమూశారు.