Entertainment

గర్వం కాదు.. గెలుపే ఆన్సర్.. ఇన్‌స్పైరింగ్ కిరణ్ అబ్బవరం లైఫ్ స్టోరీ..!

డెస్టినీ అనేది మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుందో చెప్పలేం. ‘బస్టాండ్‌లో బఠానీలు అమ్ముకునేందుకు కూడా పనికి రావు. నువ్వు హీరో ఏంటిరా?’ ఇలాంటి మాటలన్నింటినీ అధిగమించి ఓ వ్యక్తి హీరోగా మారి.. మరికొందరు నటులకు లైఫ్ ఇస్తున్న శక్తిగా మారారు

గర్వం కాదు.. గెలుపే ఆన్సర్.. ఇన్‌స్పైరింగ్ కిరణ్ అబ్బవరం లైఫ్ స్టోరీ..!

డెస్టినీ అనేది మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుందో చెప్పలేం. ‘బస్టాండ్‌లో బఠానీలు అమ్ముకునేందుకు కూడా పనికి రావు. నువ్వు హీరో ఏంటిరా?’ ఇలాంటి మాటలన్నింటినీ అధిగమించి ఓ వ్యక్తి హీరోగా మారి.. మరికొందరు నటులకు లైఫ్ ఇస్తున్న శక్తిగా మారారు. ఆయనే కిరణ్ అబ్బవరం. లైఫ్‌లో కొన్ని సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవాలి లేదంటే ఆ జీవితం ‘అసమర్థుని జీవయాత్ర’ అవుతుంది. అలా తనకు జీవితంలో ఎదురైన ప్రతి సంఘటన నుంచి లెస్సన్ నేర్చుకున్నారు కాబట్టే జీవితంలో కిరణ్ సక్సెస్ అయ్యారు.

20 - 30 ఏళ్ల వయసు క్రూషియల్. ఆ సమయంలో కష్టపడిన వారు జీవితంలో చాలా మంచి పొజిషన్‌లో ఉంటారనే ఫిలాసఫీని ఒంటబట్టించుకుని మరీ జీవితంలో అడుగులు వేశారు. ఇంటర్ తర్వాత కిరణ్ అబ్బవరం 100 కేజీలు ఉండేవారట. బీటెక్‌లో జాయిన్ అవగానే ఓ అమ్మాయికి ‘ఐలవ్ యూ’ చెబితే ఆ అమ్మాయి పది రోజుల పాటు కాలేజ్ వైపు తిరిగి చూడలేదట. అప్పుడు తన గురించి తనకు అర్థమైందట. అంతే స్లిమ్ అవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేశారట. అదొక లెస్సన్‌గా తీసుకుని చూడగానే ఆకట్టుకునేలా తనను తాను కిరణ్ మార్చేసుకున్నారు.

సాధారణ విషయమా?

కాలేజ్‌లో ఎందుకూ పనికిరాడని లెక్చరర్లు అన్న వ్యక్తే కిరణ్ అబ్బవరం. క్యాంపస్ సెలక్షన్స్‌లో మొట్టమొదట జాబ్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. విచిత్రమేంటంటే.. తనకు జాబ్ వచ్చిన విషయం తెలుసుకుని ముందుగా ఆశ్చర్యపోయింది కూడా కిరణ్ అబ్బవరమే. పేరులోనే వరం ఉండటమో.. లేదంటే.. పుట్టుకతోనే లక్‌ను వెంటబెట్టుకుని జన్మించారేమో తెలియదు కానీ ప్రతిదీ ఆయనకు బాగా కలిసొచ్చింది. అలాగని కష్టపడలేదని కాదు. కష్టానికి లక్‌ కూడా తోడైందని. రూ.70 వేల జీతం అంటే సాధారణ విషయమా? కానీ అది ఆయనకు సంతృప్తినివ్వలేదు. మనసంతా సినిమాతో నిండిపోతే.. వేరే ఉద్యోగాన్ని మనసెలా చేయనిస్తుంది? అందుకే మెల్లగా షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ ప్రారంభించారు. మూడు షార్ట్ ఫిలిమ్స్ చేయగానే సినిమా అవకాశం తలుపుతట్టింది.

రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసి..

వాస్తవానికి వేరొకరైతే అవకాశం రావడమే అదృష్టమనుకుని అన్నీటితో అడ్జస్ట్ అయ్యి సినిమా చేసేవారే. కానీ కిరణ్ మాత్రం రెండు రోజులు షూట్‌కి వెళ్లిన మీదట తనకు అది సరికాదనిపించి రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసి మరీ ఆ సినిమా నుంచి సైడ్ అయిపోయారు. ఇలా చేస్తే ఇండస్ట్రీలో తిరిగి అడుగు పెట్టలేవన్నా.. ఎవరు ఏం చెప్పినా మనసుకు విరుద్ధంగా వెళ్లలేదు. తాత్కాలిక ప్రయోజనాలను ఆశించలేదు. అదే ఆయనను ఇండస్ట్రీలో చాలా ఎత్తులో నిలబెట్టింది. ఇక ఆ తరువాత ‘రాజావారు.. రాణిగారు’ కోసం సర్వశక్తులు ఒడ్డారు. ఆ సమయంలోనే 24 క్రాఫ్ట్‌లపై ఆయన అవగాహన పెంచుకున్నారు. ఆ సినిమాతో కిరణ్ అబ్బవరం గురించి ఇండస్ట్రీకే కాదు. తెలుగు ప్రజలందరికీ తెలిసింది. ఇక నెక్ట్స్ తనే స్వయంగా కథ రాసుకుని మరీ రంగంలోకి దిగారు.

నువ్వు హీరో ఏంటిరా?

ఆయన స్వయంగా రాసుకున్న కథ ‘ఎస్ఆర్ కల్యాణమండపం’. ఈ సినిమా కిరణ్ అబ్బవరానికి రెండో చిత్రమే అయినా కూడా ఊహించని అప్లాజ్‌ను అందుకున్నారు. సినిమా హాళ్ల బయట హౌస్‌ఫుల్ బోర్డులు.. హాల్ లోపల కేకలు, విజిల్స్, పేపర్లు చింపేయడం.. ఇంతకు మించిన అదృష్టం ఓ నటుడికి ఏం కావాలి? ఒకప్పుడు అంటే కాలేజ్ డేస్‌లో ఎవరైనా మూవీ టికెట్స్ కోసం సంప్రదిస్తే గర్వంగా ఫీలైన ఓ యువకుడు.. ‘నువ్వు హీరో ఏంటిరా?’ అనిపించుకున్న కిరణ్ అబ్బవరం రెండో సినిమాతోనే యూ ఆర్ ది గ్రేట్ హీరో అనిపించుకుంటుంటే ఎలా ఉంటుంది? పది సినిమాల తర్వాత రావల్సిన క్రేజ్ రెండో సినిమాకే చూస్తే.. వేరొకరైతే గర్వంతో ఊగిపోయేవారేమో.. తనంతటి వాడు లేడన్నట్టుగా బిహేవ్ చేసేవారేమో.. కానీ కిరణ్ మాత్రం తన జీవితంలో మరచిపోలేని ఫ్రైడేగా దానిని గుర్తుపెట్టుకున్నారు. ఆ అభిమానాన్ని చెదిరిపోనివ్వకుండా నిగర్వంగా ముందుకు సాగారు. ఎన్నో సినిమాలు.. మరెన్నో సక్సెస్‌లు.. నాడెలా ఉన్నారో.. నేడు అలాగే ఉన్నారు. సక్సెస్ ఆనందాన్ని తప్ప ఆ వ్యక్తికి గర్వానివ్వలేదు. ఎందరికో అవకాశం కల్పించే శక్తిలా మారినా అదే చెరగని చిరునవ్వు. ఇది కిరణ్ అబ్బవరం ఇన్‌స్పైరింగ్ లైఫ్ స్టోరీ. ఇక మున్ముందు కూడా ఇలాగే ఎన్నో విజయాలను తన జీవితంలో అందుకోవాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్‌డే కిరణ్ అబ్బవరం.

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 15, 2026 5:24 AM