పార్లమెంట్‌లో నంబర్ గేమ్.. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం ఎలాగంటే..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముందు మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై బీజేపీ కసరత్తు నిర్వహిస్తోంది. జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను దృష్టిలో ఉంచుకుని..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముందు మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై బీజేపీ కసరత్తు నిర్వహిస్తోంది. జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను దృష్టిలో ఉంచుకుని, మహిళా రిజర్వేషన్‌ను 2029 నుంచే అమలు చేసేలా రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు, ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను సుమారు 850 వరకు పెంచే నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) బిల్లును ఆమోదింపజేయడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండింట మూడొంతుల మెజారిటీ సాధించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇదే బిల్లు ఏప్రిల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో లోక్‌సభలో ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వం డీఎంకేతో చర్చలు జరుపుతోంది. బిల్లుకు అనుకూలంగా ఓటు వేయకపోయినా, కనీసం ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ప్రభుత్వం ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే డీఎంకే ఇప్పటి వరకూ తన వైఖరిపై తుది నిర్ణయం తీసుకోలేదు.
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం..
ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ విజయ్ నేతృత్వంలోని టీవీకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో, లోక్‌సభలో కాంగ్రెస్ బెంచీలకు వేరుగా కూర్చోవాలని డీఎంకే ఇప్పటికే కోరింది. జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే డిలిమిటేషన్ చేస్తే, జనాభా నియంత్రణలో విజయం సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని డీఎంకే గతం నుంచే వాదిస్తోంది. డీఎంకే వర్గాల సమాచారం ప్రకారం, ప్రభుత్వం ఈ అంశంపై "మధ్యేమార్గం" కోసం సంప్రదింపులు జరుపుతోంది. ఒక సీనియర్ డీఎంకే నేత మాట్లాడుతూ.."మా ఆవేదనను బీజేపీకి వివరించాం. ప్రభుత్వం వాటిని సానుకూలంగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఆశాభావంతో ఉన్నాం" అని చెప్పారు.
రిస్క్ తీసుకోం..
డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి కూడా ఈ చర్చలను ధృవీకరిస్తూ.. "తమిళనాడు ప్రయోజనాలు తప్పకుండా కాపాడాలి. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు శిక్ష పడే పరిస్థితిని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం" అని తెలిపారు. విపక్ష ఎంపీలతోనూ బీజేపీ చర్చలు జరుపుతోంది. బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం, డీఎంకేతో పాటు సమాజ్‌వాదీ పార్టీ (SP), కాంగ్రెస్‌కు చెందిన కొందరు ఎంపీలతో కూడా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఒక సీనియర్ బీజేపీ నేత మాట్లాడుతూ.. "అవసరమైన సంఖ్య ఫిక్స్ అయ్యే వరకూ బిల్లును తొందరపడి ప్రవేశపెట్టం. ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు" అని అన్నారు. అలాగే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (NCP)తో కూడా బీజేపీ చర్చలు జరుపుతున్నప్పటికీ, గత అనుభవాల కారణంగా ఆ పార్టీపై పూర్తిగా నమ్మకం లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
విజయ్ విమర్శలు..
గత శుక్రవారం కరూర్‌లో జరిగిన సభలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ మాట్లాడుతూ, డిలిమిటేషన్ బిల్లు దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుందని, కేంద్ర నిధుల్లో తమిళనాడుకు వచ్చే వాటాను కూడా తగ్గిస్తుందని ఆరోపించారు. ఒక ప్రతిపక్ష నేత అభిప్రాయం ప్రకారం.. ఈ అంశంపై డీఎంకే తన వైఖరిని మార్చితే, అది విజయ్‌కు పెద్ద రాజకీయ ఆయుధంగా మారే అవకాశం ఉంది.
ప్రభుత్వ లెక్కలు..
ఏప్రిల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026 లోక్‌సభలో ఆమోదం పొందలేదు.
సభలో హాజరైన సభ్యులు: 528
బిల్లుకు అనుకూలంగా ఓట్లు: 298
వ్యతిరేకంగా ఓట్లు: 230
డీఎంకేకు చెందిన 22 మంది లోక్‌సభ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉంటే, మిగతా సభ్యులందరూ ఓటు వేసిన పరిస్థితిలో బిల్లును ఆమోదించేందుకు ప్రభుత్వానికి 346 ఓట్లు అవసరమవుతాయని బీజేపీ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఆ సంఖ్య తమకు పెద్ద కష్టమేమీ కాదని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
రాజ్యసభలో పరిస్థితి ఏంటంటే..
ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి 114 మంది సభ్యులు ఉన్నారు. జూలై 24న పశ్చిమ బెంగాల్‌లో జరిగే మూడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని భావిస్తుండటంతో ఆ సంఖ్య 117కు చేరే అవకాశం ఉంది. దీంతో 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీఏ బలం 155కు పెరుగుతుంది. రెండు మూడొంతుల మెజారిటీకి అవసరమైన 164 స్థానాలకు ఇంకా 9 సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది.