Politics

భారతదేశ ప్రైవేట్ స్పేస్ రివల్యూషన్ వెనుక ఆ ఇద్దరు..!

ఎక్కువ ఖర్చు, దీర్ఘకాల నిరీక్షణ కారణంగా వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగం చాలా మందికి అందని ద్రాక్షగా ఉండేది. అయితే, మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు ఇద్దరు ఈ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో ఒక సైలెంట్ రివల్యూషన్‌కి శ్రీకారం చుట్టారు.

భారతదేశ ప్రైవేట్ స్పేస్ రివల్యూషన్ వెనుక ఆ ఇద్దరు..!

సుమారు 100–120 మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బంది రాజీనామా చేయడం లేదా స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకోవడంతో ఇస్రో (ISRO) హాట్ టాపిక్‌గా మారింది. అసలు రాజీనామాలకు కారణం.. ఇస్రో ప్రైవేటైజేషన్‌గా తెలుస్తోంది. యూ.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ (URSC), బెంగళూరు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), తిరువనంతపురం నుంచి ఈ రాజీనామాలు ఎక్కువగా జరిగాయి. ఈ రాజీనామాలు ముఖ్యంగా గగనయాన్, చంద్రయాన్, భారీ ప్రయోగ వాహనాల వంటి జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టులపై పనిచేస్తున్న బృందాలను ప్రభావితం చేశాయని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అంతరిక్ష శాఖ (Department of Space - DoS) ఉద్యోగుల రాజీనామాల ఆమోదంపై కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది.

రాజీనామాలకు కారణాలేమిటి?

పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం:

ప్రైవేట్ అంతరిక్ష రంగంలో అధిక వేతనాలు

స్టాక్ ఆప్షన్లు, మెరుగైన కెరీర్ అవకాశాలు

పని విధానంలో ఎక్కువ స్వేచ్ఛ

అధిక పనిభారం

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య వేతన వ్యత్యాసం

వంటి కారణాల వల్ల ఇస్రో ఉద్యోగులు ప్రైవేట్ సంస్థల వైపు ఆకర్షితులవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

సైలెంట్ రివల్యూషన్..

గత 63 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వ అణుశక్తి ఏకాధిపత్యానికి ఈ ప్రైవేటైజేషన్ ముగింపు పలకనుంది. ఇకపై అణుశక్తి రంగంలో ప్రైవేట్ సంస్థలకు కూడా అవకాశం లభించనుంది. శాంతి (SHANTI) చట్టం అమలుతో భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థలు అణుశక్తి రంగంలోకి అడుగుపెడుతున్నాయి. భారతదేశంలో దశాబ్దాల పాటు అంతరిక్ష పరిశోధన పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) పరిధిలోనే ఉండేది. ఎక్కువ ఖర్చు, దీర్ఘకాల నిరీక్షణ కారణంగా వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగం చాలా మందికి అందని ద్రాక్షగా ఉండేది. అయితే, మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు ఇద్దరు ఈ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో ఒక సైలెంట్ రివల్యూషన్‌కి శ్రీకారం చుట్టారు.

వెయ్యికి పైగా నిపుణులు..

2018లో పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా హైదరాబాద్‌లో స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) సంస్థను స్థాపించారు. ఉపగ్రహాలను ప్రయోగించడం కూడా ఒక వాణిజ్య విమాన టికెట్ బుక్ చేసుకున్నంత సులభంగా, అందుబాటు ధరలో ఉండాలనే ఒక లక్ష్యంతో వారు ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం పవన్ కుమార్ చందన సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా, నాగ భరత్ డాకా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వెయ్యికి పైగా నిపుణులతో కూడిన బృందాన్ని నడిపిస్తూ, భారత అంతరిక్ష రంగంలోని సాంప్రదాయ అనుభవాన్ని స్టార్టప్ చురుకుదనంతో సమన్వయం చేస్తున్నారు.

విజయవంతంగా తొలి ప్రైవేట్ రాకెట్ ఇంజిన్..

2022లో 'మిషన్ ప్రారంభ్' (Mission Prarambh) ద్వారా విక్రమ్-ఎస్ (Vikram-S) రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించారు. ఇది భారతదేశంలో పూర్తిగా ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి రాకెట్. ఈ విజయంతో స్వదేశీ ప్రైవేట్ కంపెనీలు కూడా అత్యాధునిక అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేసి విజయవంతంగా ప్రయోగించగలవని నిరూపించారు. అంతకుముందే, 2020లో రామన్-1 (Raman-1) పేరుతో భారత తొలి ప్రైవేట్ రాకెట్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించారు. అనంతరం 2021లో ధవన్-1 (Dhawan-1) క్రయోజెనిక్ ఇంజిన్‌ను కూడా విజయవంతంగా పరీక్షించి మరో మైలురాయిని చేరుకున్నారు. తాజాగా తమ ప్రధాన ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 (Vikram-1) కు సంబంధించిన కీలక పరీక్షలను కూడా విజయవంతంగా పూర్తి చేశారు.

యూనికార్న్ స్టార్టప్‌గా..

ఈ సాంకేతిక విజయాలు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి. GIC, Temasek వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి 160 మిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టుబడులను సమీకరించిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రస్తుతం 1.1 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన యూనికార్న్ స్టార్టప్‌గా ఎదిగింది. భారత ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సంస్థల కోసం తెరవడంతో, పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా భారతదేశాన్ని తక్కువ ఖర్చుతో ఉపగ్రహాల ప్రయోగంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి కృషి భారత అంతరిక్ష రంగానికే కాకుండా ప్రపంచ అంతరిక్ష పోటీలో కూడా కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 18, 2026 7:08 AM