Venkataramaiah Gari Taluka Review: పిల్లలే ప్రాణంగా బతికిన ఓ తండ్రి కథ
‘వెంకట్రామయ్య గారి తాలుకా’ సినిమా ట్రైలర్ చూస్తే.. ఫస్ట్ ‘పిల్లలే ప్రాణంగా బతికిన ఓ తండ్రి కథ’ అనే క్యాప్షన్ వస్తుంది. వాస్తవానికి ఇది చూసిన వారందరికీ ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే విషయం అర్థమవుతుంది.
‘వెంకట్రామయ్య గారి తాలుకా’ సినిమా ట్రైలర్ చూస్తే.. ఫస్ట్ ‘పిల్లలే ప్రాణంగా బతికిన ఓ తండ్రి కథ’ అనే క్యాప్షన్ వస్తుంది. వాస్తవానికి ఇది చూసిన వారందరికీ ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే విషయం అర్థమవుతుంది. తండ్రి అనేది చాలా పెద్ద ఎమోషన్. మరి ఆ ఎమోషన్‌ను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారా? సినిమా ఎలా ఉంది? తెలుసుకుందాం.
కథేంటంటే..
వెంకట్రామయ్య - సీత (మురళీధర్ గౌడ్, సుధ) దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. వ్యవసాయం చేస్తూ జీవిస్తూ ఉంటారు. పొలం, పిల్లలే వారికి ప్రాణం. ఒక రైతు ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లి చేయడమంటే మాటలా? ఇద్దరు ఆడపిల్లల కోసం తనకున్న ఐదెకరాల్లో రెండు ఎకరాల పొలం అమ్మేస్తాడు. కొడుకు తనకు రైల్వే జాబ్ వస్తుంది. రూ.20 లక్షలు కట్టాలంటే మరో ఎకరం అమ్మేస్తాడు. ఇక చిన్న కూతురు లత (దివిజ) తను ప్రేమించిన రాజు (దినేష్)ను పెళ్లి చేసుకుంటానంటుంది. కానీ రాజు తల్లి మహా గయ్యాళి కావడంతో సీత తన కూతురును రాజుకు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. కానీ తను ఇష్టపడిన వ్యక్తితో కూతురి వివాహం చేయాలనుకున్న వెంకట్రామయ్య.. భార్యకు నచ్చజెప్పి వివాహం జరిపిస్తాడు. అయితే సీత భయపడిందంతా జరుగుతుంది. అత్తవారింట లత ఎన్నో కష్టాలు పడుతూ ఉంటుంది. మరోవైపు వెంకట్రామయ్య కొడుకు మురళి సైతం ఓ అమ్మాయిని వివాహం చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. పిల్లలంతా వివాహాలవడంతో ఆడపిల్లలు అత్తవారిళ్లకు.. కొడుకు ఉద్యోగం కోసం సిటీకి వెళతాడు. ఇక ఉన్న ఒక ఎకరంతో ఎలాగైనా బతుకుదామనుకుంటే అనుకోని సంఘటన. ఉన్న ఎకరం పొలం అమ్మినా కూడా ప్రయోజనం ఉండదు. అక్కడి నుంచి వెంకట్రామయ్యకు కష్టాలు ప్రారంభమవుతాయి.
సినిమా ఎలా ఉందంటే..
1992లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయనే ప్రధాన పాత్రలో నటించిన ‘సూరిగాడు’ చిత్రం వచ్చింది. ఆ సినిమా కూడా ఒక తండ్రి కథే. అప్పట్లో అది బ్లాక్ బస్టర్ హిట్. కథ వేరైనా కూడా ఇది కూడా ఆ స్థాయి ఉన్న ఓ తండ్రి కథే. నలుగురు పిల్లలున్నా.. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాడు. అదే తల్లిదండ్రులు తరువాతి కాలంలో పిల్లలకు భారంగా ఎందుకు మారుతున్నారనేదే కథ. తొలి అర్థ భాగమంతా.. వెంకట్రామయ్య తన పొలాన్ని అపురూపంగా చూసుకోవడం.. పొలాన్ని పరువుగానూ.. గౌరవంగానూ భావించడం.. పిల్లల కోసం దాన్ని అమ్ముకోవల్సి రావడం.. ఆ తరుణంలో ఆయన పడే బాధ, ఆయనకు ఆయన భార్య సీత అండగా నిలవడం వంటి సన్నివేశాలుంటాయి. ఇక సెకండాఫ్‌లో కంప్లీట్‌గా వెంకట్రామయ్య చుట్టూనే కథ నడుస్తుంది. ప్రతి ఒక్కరికీ వయసుతో సంబంధం లేకుండా సెకండాఫ్ చూస్తున్నప్పుడు తన తండ్రి గుర్తొస్తాడు. ఇక క్లైమాక్స్‌లో ప్రతి ఒక్కరి హృదయం బరువెక్కుతుంది. కళ్ల నిండా నీళ్లతో బయటకు వస్తారు. పల్లెటూరి కథలు ఇటీవలి కాలంలో వచ్చినా కూడా లవ్ స్టోరీకే పరిమితమవుతున్నాయి. ఒక కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీ అనేది రావడం లేదు. ఈ చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీ.
ఎవరెలా నటించారంటే..
ఈ చిత్రానికి హీరో మురళీధర్ గౌడ్. ప్రతి సన్నివేశంలోనూ ఆయన ఒక తండ్రిగా నటించలేదు.. జీవించారు. ఆయన తప్ప మరొకరిని ఊహించలేం. ఇక సుధ గురించి చెప్పేదేముంది? అద్భుతమైన నటి. తల్లిగా చాలా సహజంగా నటించారు. దివిజ, దినేష్ ఇద్దరూ కూడా చాలా బాగా నటించారు. ఇక మిగిలిన నటీనటులంతా కూడా చాలా సహజంగా వారి పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు.
టెక్నికల్ పరంగా..
ముందుగా దర్శకుడు సతీష్ ఆవల గురించి చెప్పాలి. వాస్తవానికి ఇదొక సినిమా ఏమీ కాదు. ప్రతి గ్రామంలోనూ.. ఇలాంటి రైతు, తండ్రి తప్పనిసరిగా ఉంటాడు. కానీ ఆయన కథను తెరపై చూపించేటప్పుడు ఎక్కడా తడబడకుండా అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా ఎమోషన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. ఎడిటింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సింది. ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీతలా అనిపించింది. మ్యూజిక్ విషయానికి వస్తే పర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి.
ఫైనల్‌గా.. ‘వెంకట్రామయ్య గారి తాలుకా’ ఓ ఫీల్ గుడ్ మూవీ
రేటింగ్: 3.25/5
ప్రజావాణి చీదిరాల