నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సంచలనం.. కేవలం రూ.5 లక్షలకే 111 ప్రశ్నలు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుపై దర్యాప్తు నిర్వహిస్తున్న సీబీఐ కీలక విషయాలను ప్రత్యేక కోర్టు ముందుంచింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుపై దర్యాప్తు నిర్వహిస్తున్న సీబీఐ కీలక విషయాలను ప్రత్యేక కోర్టు ముందుంచింది. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు శివరాజ్ రఘునాథ్ మోటేగావ్‌కర్ నుంచి పేపర్ లీక్ అయినట్టుగా తెలిపింది. శివరాజ్ రఘునాథ్ పరీక్షకు ముందే కెమిస్ట్రీ క్వశ్చన్స్ లీక్ చేసేందుకుగానూ రూ. 5లక్షలు అందుకున్నాడని తెలిపింది. ఆ రూ.5 లక్షలు ముట్టజెప్పింది మరెవరో కాదు.. పేపర్ తయారీ కమిటీలో ఉన్న పీవీ కులకర్ణి. కులకర్ణి నిర్వహించిన కోచింగ్ తరగతులకు మోటేగావ్‌కర్ కుమారుడు హాజరయ్యాడట. అలా మోటేగావ్‌కర్‌తో కులకర్ణికి పరిచయం ఏర్పడింది. కోచింగ్ వద్దే కులకర్ణికి శివరాజ్ ఈ ప్రశ్నలు అందించినట్లుగా సీబీఐ తెలిపింది.
మోటేగావ్‌కర్ ఫోన్లో ప్రశ్నలకు సంబంధించి 36 ఫొటోలు ఉన్నట్టు సీబీఐ గుర్తించింది. ఈ 36 ఫొటోల్లో మొత్తంగా కెమిస్ట్రీకి సంబంధించిన 132 ప్రశ్నలు ఉన్నాయని వెల్లడించింది. ఈ ప్రశ్నలన్నింటిలో 111 ప్రశ్నలు నీట్ (యూజీ) కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) రూపొందించిన యూజీ 2026 మాస్టర్ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో సరిగ్గా సరిపోయాయని కోర్టుకు సీబీఐ వెల్లడించింది. మే 3న జరిగిన నీట్ పరీక్షకు దాదాపు 10 రోజుల ముందు ఈ ఫొటోలు తీసినట్లుగా సీబీఐ గుర్తించింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. ఈ కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారందరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షను రద్దు చేసి.. అనంతరం జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించారు.