O..! Sukumari Review: ప్రేక్షకులను ఐశ్వర్య రాజేష్ మూవీ అలరించిందా?
‘సంక్రాంతికి వస్తున్నాం’తో ఐశ్వర్య రాజేష్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. ఆమె సినిమా వస్తోందంటేనే అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి.
‘సంక్రాంతికి వస్తున్నాం’తో ఐశ్వర్య రాజేష్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. ఆమె సినిమా వస్తోందంటేనే అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి. ఇక తిరువీర్ విషయానికి వస్తే వరుస హిట్స్‌తో దూసుకెళుతున్నాడు. వీరిద్దరూ జంటగా చేసిన చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను అలరించిందా? తెలుసుకుందాం.
కథేంటంటే..
తెలంగాణలోని ఓ గ్రామంలో జరిగే కథే ‘ఓ సుకుమారి’. దామిని(ఐశ్వర్య రాజేశ్)కి చిన్నప్పటి నుంచి ఒక విచిత్రమైన సమస్య ఉంటుంది. ఆ సమస్య ఏంటంటే.. ఆమెను ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఆమెకున్న సమస్యతో పాటు ఆమె చేసే అల్లరి కారణంగా ఊరి వాళ్లంతా ఇబ్బంది పడుతుంటారు. రఈ క్రమంలోనే ఆమెకు ఎలాగైనా పెళ్లి చేసి ఊరి నుంచి పంపించేయాలనుకుంటారు. ఇక దామిని వాళ్ల పక్క ఊరిలో నివసించే యాదగిరి మహా పిసినారి. ఊరికి సర్పంచ్ అవ్వాలనేది అతని కల. అది కూడా కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా. అతని తాత ఓ వీలునామా రాస్తాడు. దాని ప్రకారం తన ఇద్దరి మనవళ్లలో ఎవరు ముందుగా మగబిడ్డను కంటారో వాళ్లకు తన 80 ఎకరాల ఆస్తి దక్కుతుంది. ఆస్తి కోసం యాదగిరి పెళ్లికి సిద్ధమవుతాడు. దామినిని చూసి ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఊరి వాళ్లంతా దామిని సమస్యను దాచేసి యాదగిరితో పెళ్లి చేస్తారు. ఆ తరువాత ఏం జరిగింది? దామిని కారణంగా యాదగిరి ఎలాంటి సమస్యను ఎదుర్కొన్నాడు? దామిని తన సమస్యను అధిగమించిందా? లేదా? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
కాన్సెప్ట్ అయితే మంచిదే. దానిని ప్రెజెంట్ చేసే తీరులోనే లోపం ఉంది. ముఖ్యంగా ఒక మంచి కాన్సెప్ట్ చుట్టూ అల్లిన కథ చాలా పేలవంగా ఉంది. హీరోయిన్‌ను ఎవరైనా టచ్ చేస్తే విద్యుత్ షాక్ తగలడమనేదొక్కటే కొత్తది. అంతకు మించి సినిమాలో ఏమీ లేదు. రొటీన్ కథ. దానిని సరికొత్తగా అందించే యత్నం కూడా దర్శకుడు చేయలేదు. ఐశ్వర్య రాజేష్, తిరువీర్ నటన తప్ప 'ఓ సుకుమారి' సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలేవీ లేవు. వాస్తవానికి ఒక గ్రామంలో ఎవరినైనా ముట్టుకుంటే షాక్ తగులుతుంది అంటే చుట్టు పక్కల ఊళ్లన్నింటికీ క్షణాల్లో పాకి హాట్ టాపిక్ అవుతుంది. కానీ పక్క ఊరిలో ఉన్న హీరోకి మాత్రం ఆ విషయం తెలియదు. ఏమాత్రం కొత్తదనం లేని కథ, బలవంతంగా చొప్పించిన కామెడీ, చిరాకు తెప్పించే సన్నివేశాలతో ఈ చిత్రం సాగుతుంది. క్లైమాక్స్ సైతం అస్సలు ఏమాత్రం కనెక్ట్ కాదు.
ఎవరెలా చేశారంటే..
సుకుమారిగా ఐశ్వర్య రాజేష్ తన పాత్రలో జీవించింది. యాక్షన్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించింది. ఇక తిరువీర్ గురించి చెప్పేదేముంది. అద్భుతంగా నటిస్తాడు. సుకుమారిని వివాహం చేసుకోవడం.. ఆ తరువాతి పరిణామాల్లో అతని నటన మెప్పిస్తుంది. చిత్రంలో విష్ణు ఓయి, ఝాన్సీ, ఆమని, మురళీధర్ గౌడ్, శ్రీనివాస్ గవిరెడ్డి వంటి నటులను అయితే తీసుకున్నారు కానీ వారిని దర్శకుడు వినియోగించుకోలేకపోయారు.
టెక్నికల్ పరంగా..
ఒక పాయింట్ మినహా మిగిలిన కథంతా బలహీనమే. వినూత్న పాయింట్ తీసుకున్న భరత్ దర్శన్ దాని చుట్టూ బలమైన కథను అల్లలేకపోయారు. డైరెక్షన్ చాలా పేలవంగా ఉంది. ముఖ్యంగా ఎడిటింగ్ సైతం చాలా పేలవం. మ్యూజిక్ పర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగానే ఉన్నాయి.
మొత్తంగా.. ఏమాత్రం ఆకట్టుకోని ‘ఓ సుకుమారి’
రేటింగ్: 2/5