Prabhas: ముగిసిన అజ్ఞాతం.. ఇక తిరుగుబాటే...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అజ్ఞాతం ముగిసిందట. తిరుగుబాటు స్టార్ట్ చేస్తాడట. తానే ఒక సైన్యంలా మారి మరీ తిరుగుబాటు చేస్తాడట. ప్రభాస్ ఏంటి? అజ్ఞాతంలో ఉండటమేంటి? అంటారా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అజ్ఞాతం ముగిసిందట. తిరుగుబాటు స్టార్ట్ చేస్తాడట. తానే ఒక సైన్యంలా మారి మరీ తిరుగుబాటు చేస్తాడట. ప్రభాస్ ఏంటి? అజ్ఞాతంలో ఉండటమేంటి? అంటారా? ‘ఫౌజీ’ మేకర్స్ అదే చెప్పారు మరి. అలా ఉంటేనే ఇంట్రస్టింగ్‌గా ఉంటుందనుకున్నారో ఏమో కానీ 'అజ్ఞాతపర్వం ముగిసింది. తిరుగుబాటు ప్రారంభమవుతుంది' అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఫౌజీ' నుంచి ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. అసలే ‘రాజాసాబ్’ నిరుత్సాహ పరచడంతో ఈ సినిమాపైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ‘ఫౌజీ’ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ నుంచి రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.

ఓ ఇంట్రస్టింగ్ పోస్టర్‌తో విడుదల డేట్‌ను మేకర్స్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఈ సినిమా పిరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని మేకర్స్ అయితే పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చేశారు. ఇక మేకర్స్ షేర్ చేసిన పోస్టర్ విషయానికి వస్తే.. యుద్ధ వాతావరణంతో ఉన్న ప్రదేశం.. గుట్టలుగా పడి ఉన్న మృతదేహాలు.. వాటి మధ్య బండరాయి మీద ప్రభాస్ చాలా పవర్‌ఫుల్‌గా కూర్చొని ఉన్నాడు. ప్రభాస్ ఒంటి మీద చొక్కా కూడా లేదు. దేహమంతా రక్తంతో నిండిపోయింది. జంధ్యం ధరించి, చేతిలో తుపాకీని పట్టుకుని మరీ కనిపిస్తున్నారు. పోస్టర్ ప్రకారం చూస్తే ఈ సినిమాలో ప్రభాస్ ఒక యోధుడిగా కనిపించనున్నట్టు అయితే తెలుస్తోంది. అయితే జంధ్యం ఏంటన్నదే తెలియకుండా ఉంది. చాలా కాలం తర్వాత వింటేజ్ లుక్‌లో ప్రభాస్ ఈ ఫౌజీలో కనిపించనున్నట్లు పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక డిసెంబర్ 3న 'ఫౌజీ' సినిమా విడుదల కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఇక ఆ పోస్టర్‌పై మేకర్స్'అజ్ఞాతపర్వం ముగిసింది. తిరుగుబాటు ప్రారంభమవుతుంది' అని రాసుకొచ్చారు. అదే విధంగా రిలీజ్ పోస్టర్‌పై ఒంటరిగా పోరాడే దళం (A Battalion Who Fights Alone) అని రాసి ఉంది. మొత్తంగా చూస్తే ప్రభాస్ తానే ఒక సైన్యంగా మారి పోరాడనున్నాడా? లేదంటే ఏదైనా దళానికి నాయకుడా? అనేది అర్థం కాకుండా ఉంది. ఏదేమైనా ఈ పోస్టర్‌తో సినిమాపై అంచనాలను బీభత్సంగా పెంచేశారు. దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ మేకర్స్ ఎలాంటి అప్‌డేట్ కూడా ఇవ్వలేదు. ఈ సినిమా స్టోరీ రాసేందుకే హను రాఘవపూడికి ఏడాది సమయం పట్టిందట. గతంలో ఆయనే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బంగాలీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.