కేతన్ అగర్వాల్ హత్య కేసులో షాకింగ్ విషయాలు.. కీలకంగా సీసీ టీవీ ఫుటేజ్..
మహారాష్ట్రలోని పుణె వద్ద మరణించిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. తనను ఫోటోలు తీస్తూ లోయలో పడి మృతి చెందాడంటూ తొలుత కేతన్ పెళ్లాడబోయే యువతి సియా గోయెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహారాష్ట్రలోని పుణె వద్ద మరణించిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. తనను ఫోటోలు తీస్తూ లోయలో పడి మృతి చెందాడంటూ తొలుత కేతన్ పెళ్లాడబోయే యువతి సియా గోయెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆ తరువాత పోలీసులు విచారణ చేపట్టాక సీన్ మొత్తం మారిపోయింది. అది ప్రమాదం కావాలని.. స్కెచ్ వేసి మరీ చేసిన హత్య అని తేలింది. పొంతన లేని సమాధానాలతో పోలీసులకు సియా అడ్డంగా దొరికిపోయింది. ఈ కేసులో నిందితులైన సియా గోయల్ (20)ను, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22)ని అరెస్టు చేశారు.
రెండు సార్లు ఫెయిల్..
ఈ నెల 18న కేతన్ లోహగఢ్ కోట వద్ద 400 అడుగుల లోతు లోయలో పడి ప్రాణాలు కోల్పోయారు. తొలుత ప్రమాదవశాత్తు పడిపోయాడనుకుని దీనిని ఒక సాధారణ కేసు మాదిరిగానే చూశారంతా. సియా గోయల్ సైతం.. లోనావాలాకు తన పుట్టినరోజు సందర్భంగా ట్రెక్కింగ్‌కు వచ్చామని, కేతన్ ఫొటోలు తీస్తూ హోరు గాలికి పట్టుతప్పి లోయలో పడిపోయాడని పోలీసులకు తెలిపింది. కానీ విచారణలో మాత్రం క్లారిటీగా సమాధానాలు ఇవ్వలేక అడ్డంగా దొరికిపోయింది. సియా, తన ప్రియుడు చేతన్‌తో కలిసి కేతన్‌ను లోయలోకి తోసేసి ప్రమాదంగా చిత్రీకరించినట్టు పోలీసుల విచారణలో తేలింది. సియాకు చేతన్ చౌదరి అనే వ్యక్తితో దీపావళి వేడుకల్లో పరిచయమైంది. అది కాస్తా ఆ తరువాతగా ప్రేమగా మారింది. వాస్తవానికి గతంలోనూ రెండు సార్లు కేతన్ హత్యకు ప్లాన్ చేశారు. కానీ ఫెయిల్ అయ్యింది.
హుడీ ధరించడంతో..
తొలిసారిగా కేతన్ అగర్వాల్ హత్యకు కుట్ర మే 31న లోహాబాద్ సందర్శన సమయంలో జరిగింది. అప్పుడు మిస్ అయ్యింది. ఆ తరువాత జూన్ 14న కేతన్.. కోట అంచుపై కూర్చొని ఉండగా దానిపై నుంచి తోసేయాలని యత్నించింది. అది కూడా మిస్ అయ్యింది. అప్పుడు పాము కనిపించిందంటూ కేకలు పెడుతూ విషయాన్ని డైవర్ట్ చేసింది. ఫైనల్‌గా జూన్ 18న పక్కా ప్రణాళికతో తన ప్రియుడు చేతన్‌తో కలిసి సియా.. కేతన్ అడ్డు తొలగించుకుంది. తాజాగా లోహగడ్ కోట వద్ద సీసీ టీవీని పోలీసులు పరిశీలించగా.. షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. హుడీ ధరించిన ఓ వ్యక్తి సియా, కేతన్‌ను వెంబడిస్తున్నట్టుగా సీసీ టీవీ ఫుటేజ్‌లో కనిపించింది. ఆ ఫుటేజీ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేయగా.. ఆ హుడీ ధరించిన వ్యక్తిని నిందితుడు చేతన్ చౌదరి అని తేలింది. లోహగడ్ కోట వద్ద సుమారు 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండగా.. ఓ వ్యక్తి (చేతన్ చౌదరి) హుడీ ధరించడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో అతడి కదలికలు, సియా గోయల్ ఫోన్ డేటా ఆధారంగా కేతన్ అగర్వాల్‌ది హత్యేనేని పోలీసులు నిర్దారణకు వచ్చారు.
కేతన్ తల్లి అడ్డుకుందట..
ఈ వివాహం సియాకు ఏమాత్రం ఇష్టం లేదట. పెళ్లిని ఏడాది పాటు వాయిదా వేసేందుకు వీలుందా? అని కేతన్ బాబాయిని సియా అడిగిందట. నవంబర్‌లో ఉదయ్‌పుర్‌లోని ఒక ప్యాలెస్‌లో కేతన్, సియాల వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కేతన్‌ను సియా లోహగడ్ కోటకు తీసుకెళ్లేందుకు పలుమార్లు యత్నించిందట. మే 31న కేతన్‌ను సియా లోహగడ్ కోటకు తీసుకెళ్లింది. అలాగే జూన్ 4న కూడా అక్కడికి వెళ్లాలని ఆమె మళ్లీ పట్టుబట్టిందట. అయితే కేతన్ తల్లి రెండోసారి అతడిని లోహగడ్ కోటకు వెళ్లనివ్వలేదని పోలీసులకు అతని బాబాయి చెప్పారు.