Anil Ravipudi: దర్శకుడు అనిల్ రావిపూడికి అంతకు మించి ఏమీ రాదా?
దర్శకుడు అనిల్ రావిపూడి గురించి చెప్పేదేముంది? ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న దర్శకుల్లో ఒకరు. కామెడీకి కింగ్. జంధ్యాల తర్వాత ఆ స్థాయిలో మంచి కామెడీ ఎంటర్‌టైనర్స్‌ను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
దర్శకుడు అనిల్ రావిపూడి గురించి చెప్పేదేముంది? ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న దర్శకుల్లో ఒకరు. కామెడీకి కింగ్. జంధ్యాల తర్వాత ఆ స్థాయిలో మంచి కామెడీ ఎంటర్‌టైనర్స్‌ను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రమోషన్స్ కోసం కూడా ఆయనకు ఏ పీఆర్‌ఓలు అక్కర్లేదు. తనే స్వయంగా డిజైన్ చేసిన ప్రమోషనల్ వీడియోలతో తన సినిమాను జనాల్లోకి తీసుకెళుతుంటారు. అలాంటి అనిల్ రావిపూడికి కామెడీకి మించి మరేం రాదా? అన్న చర్చ ప్రస్తుతం నెట్టింట జోరుగా సాగుతోంది. అదేంటి? అది ఎంతమేర సమంజసం తెలుసుకుందాం.
ఈ తరం కామెడీ స్పెషలిస్ట్..
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత క్రేజ్ ఉన్న దర్శకుల జాబితాలో ముందువరుసలో నిలిచే పేరు అనిల్ రావిపూడి. వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ప్రేక్షకులను నవ్వించడంలో ఓ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే వినోదమే ప్రధాన ఆయుధమని నమ్మే దర్శకుల్లో అనిల్ రావిపూడి ముందుంటారు. అందుకే చాలా మంది ఆయనను "ఈ తరం కామెడీ స్పెషలిస్ట్"గా అభివర్ణిస్తుంటారు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో స్వచ్ఛమైన హాస్యానికి ప్రతీకగా నిలిచిన జంద్యాల తర్వాత ఆ స్థాయిలో కుటుంబమంతా కలిసి ఆస్వాదించే కామెడీ ఎంటర్‌టైనర్లను అందిస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడినే అని అభిమానులు చెప్పుకుంటుంటారు. ఆయన సినిమాల్లో కథ ఎంత ముఖ్యమో, హాస్యం అంతకంటే ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఆసక్తి పెంచడంలో దిట్ట..
అయితే అనిల్ రావిపూడి ప్రత్యేకత కేవలం దర్శకత్వానికే పరిమితం కాదు. సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా ఆయనదైన శైలి ఉంటుంది. సాధారణంగా స్టార్ దర్శకులు, నిర్మాతలు పీఆర్ బృందాలపై ఆధారపడుతుంటే, అనిల్ మాత్రం తన సినిమాల ప్రచారాన్ని సరికొత్తగా ప్లాన్ చేస్తారు. తానే స్వయంగా ఆలోచించిన కాన్సెప్ట్ వీడియోలు, ఫన్నీ ప్రమోషనల్ కంటెంట్, సోషల్ మీడియా క్యాంపెయిన్లతో సినిమాపై ఆసక్తిని పెంచడంలో ఆయన దిట్ట. ప్రేక్షకులతో నేరుగా కనెక్ట్ అయ్యే ఈ విధానం ఆయన సినిమాలకు అదనపు బలంగా మారింది. అయితే ఈ విజయాల మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. "అనిల్ రావిపూడికి కామెడీకి మించి మరేం రాదా?" అనే ప్రశ్న కొందరి నుంచి ఉత్పన్నమవుతోంది. దానికి ప్రధాన కారణం ఆయన ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాల్లో దాదాపు అన్నింటిలోనూ కామెడీ ప్రధాన ఆకర్షణగా ఉండటమే. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా ఉన్నా చివరికి ప్రేక్షకులు గుర్తుంచుకునేది ఆయన అందించిన వినోదమే.
ఎమోషనల్ డ్రామా..
మరోవైపు ఆయన అభిమానులు మాత్రం ఈ విమర్శలను కొట్టిపారేస్తున్నారు. ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లేది ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. ఆ లక్ష్యాన్ని వంద శాతం నెరవేర్చుతున్న దర్శకుడిని ఒకే జానర్‌కు పరిమితం చేయడం సరైంది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ఆయన సినిమాల్లో కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, హీరోయిజం వంటి అంశాలు కూడా సమర్థవంతంగా ఉంటాయని గుర్తుచేస్తున్నారు. అయితే దర్శకుడిగా తన పరిధిని మరింత విస్తరించుకోవాలంటే భవిష్యత్తులో పూర్తిస్థాయి ఎమోషనల్ డ్రామా, థ్రిల్లర్ లేదా సీరియస్ సబ్జెక్ట్‌ను అనిల్ రావిపూడి ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. కామెడీతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఆయన, ఆ జానర్‌కు బయట కూడా తన ముద్ర వేయగలరా అనే ప్రశ్నకు సమాధానం రాబోయే ప్రాజెక్టులే ఇవ్వాలి. "నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వకపోవడం ఒక రోగం" అని పెద్దలు ఎప్పుడో చెప్పారు.
నవ్వించడమొక యోగం..
మనస్ఫూర్తిగా హాయిగా నవ్వడమనేది భోగం అవడంతో పాటు మనసు గాయపడితే అదొక గొప్ప మెడిసిన్. అలాంటి కామెడీని అందించేవారిని అందించనివ్వాలి. అందరికీ ఆ యోగం అనేది సాధ్యం కాదు. నవ్వించడమనేది సాధారణ విషయం కాదు. అలాంటి పని చేస్తున్న వారిని ఎందుకు విమర్శించాలి? అనేది చాలా మంది వాదన. అనిల్ రావిపూడి చిత్రాలకు వెళితే పెట్టిన డబ్బులు వృథా కాదు అనిపిస్తాయి. అదే కదా మనకు కూడా కావాల్సింది. ప్రస్తుతం మాత్రం ఒక విషయం స్పష్టంగా చెప్పొచ్చు. ప్రేక్షకులను నవ్వించడం చాలా కష్టం. ఆ కష్టమైన పనిని వరుసగా విజయవంతంగా చేస్తూ, తన సినిమాలకు తానే బ్రాండ్‌గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి. కామెడీ ఆయన బలం. కానీ అదే ఆయన పరిమితి కాదని నిరూపించే అవకాశం కోసం ఇప్పుడు సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. చిరుతో ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. వచ్చే సంక్రాంతికి విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్‌రామ్‌లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.