Sunitha Krishnan: ప్రతీ ఒక్క బాధితురాలికి రిహాబిలిటేషన్ అనేది ప్రాథమిక హక్కు
ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటి వరకు 32, 400 మంది అమ్మాయిలని రెస్క్యూ చేసినట్టు వెల్లడించారు. అయితే వీరిలో చాలా మంది ఈ సమాజం, పోలీసులు, ఇతర వ్యవస్థల ద్వారా మరింతగా బాధ పడుతూనే ఉన్నారని... దానిని భరించలేక మళ్లీ ఆ అంధకారంలోకి వెళ్లారన్నారు.
మహిళల అక్రమ రవాణా మీద, మహిళలను వ్యభిచార కూపంలోంచి బయటకు తీసుకు వచ్చేందుకు కొంతకాలంగా ప్రజ్వల సంస్థ పోరాడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రజ్వల సంస్థ ఫౌండర్, పద్మశ్రీ గ్రహీత సునీతా కృష్ణన్ మీడియాకు ‘విక్టిమ్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ చట్టం’ గురించి.. అలాగే తమ సంస్థ ద్వారా చేసిన పోరాటం, ఉద్యమం గురించి కూడా వివరించారు.
సునీతా కృష్ణన్ మాట్లాడుతూ.. ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటి వరకు 32, 400 మంది అమ్మాయిలని రెస్క్యూ చేసినట్టు వెల్లడించారు. అయితే వీరిలో చాలా మంది ఈ సమాజం, పోలీసులు, ఇతర వ్యవస్థల ద్వారా మరింతగా బాధ పడుతూనే ఉన్నారని... దానిని భరించలేక మళ్లీ ఆ అంధకారంలోకి వెళ్లారన్నారు. విక్టిమ్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ అనే చట్టం రావాలని తాము పోరాడబోమని.. గత 22 ఏళ్లుగా నిరంతరంగా పోరాటం చేశామన్నారు. ఎట్టకేలకు గత వారం చరిత్రాత్మక తీర్పు వచ్చిందని సునీత తెలిపారు. అయితే ఈ తీర్పు పట్ల మీడియాకి కూడా సరిగ్గా అర్థం కాలేదని.. తమ పోరాటాన్ని అపహాస్యం చేసినట్టుగా అనిపిస్తోందన్నారు. అందుకే మేం ఈ చట్టం గురించి స్పష్టంగా చెప్పేందుకు మీడియా ముందుకు వచ్చామని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇది విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ అని.. పార్లమెంట్ ఆమోదించిన తరువాత చట్టంగా మారుతుందని సునీతా కృష్ణన్ తెలిపారు. ఇందులో మూడు విషయాలు క్లియర్‌గా ఉంటాయని.. ఆర్టికల్ 21, 23 ప్రకారం.. ప్రతీ ఒక్క బాధితురాలికి రిహాబిలిటేషన్ అనేది ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. అమ్మాయిని సరుకులా అమ్మకూడదని.. గౌరవప్రదంగా, అర్థవంతంగా బతికేలా వనరులు కల్పించడం అనే అంశాలు ముఖ్యంగా ఉంటాయన్నారు. ప్రతీ దశలోనూ అంటే పునరావాసం కావాలా? రిహాబిలిటేషన్ సెంటర్‌కి రావడం అంగీకారమేనా? ఇలా ప్రతీ సారి అమ్మాయి కన్సంట్ తీసుకోవాలన్నారు.
మన రాష్ట్రంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ (AHTU) యూనిట్ ఉంది కానీ వీళ్లకి ఎలాంటి అధికారాలు ఉండవని సునీతా కృష్ణన్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రొటెక్షన్ ప్లాన్‌లో ప్రతీ పోలీస్ స్టేషన్‌లో ఓ యూనిట్‌ను పెట్టమని ఉంటుందని.. రెస్క్యూ నుంచి రీహాబిలిటేషన్ వరకు ప్రతీదీ అకౌంటబిలిటీ ఉండాలన్నారు. రెస్క్యూ సమయంలో పోలీసులు తప్పుగా బిహేవ్ చేస్తే కేసు కూడా ఫైల్ చేయవచ్చన్నారు. విక్టిమ్‌కి ఒక లాయర్ ఉండాలని.. రైట్ టు లీగల్ రిప్రెజెంటేషన్ అనేది కూడా ఉంటుందన్నారు. ఇది అడల్ట్ విక్టిమ్ ఆఫ్ సెక్స్ ట్రాఫికింగ్ అని చెప్పుకోవచ్చన్నారు. బాధితురాలికి నష్టపరిహారం అనే తీర్పు ఇంత వరకు రాలేదని.. ఇలాంటి ఓ తీర్పు రావడం దేశంలో ఇదే మొదటి సారి అని పేర్కొన్నారు.
కోర్ట్ కొన్ని రికమండేషన్స్ కూడా చేసిందని... అక్రమ రవాణా పైన సమగ్రమైన చట్టం తీసుకురావాలని సునీతా కృష్ణన్ పేర్కొన్నారు. టెక్నాలజీ ద్వారా జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్‌ను అడ్డుకోవడానికి ఏం చెయ్యాలని ప్రభుత్వం ఆలోచించాలని చెప్పిందన్నారు. వ్యభిచారం స్వేచ్చగా చేస్తున్న వారిలో.. బలవంతంగా చేస్తున్న వారున్నారన్నారు.. వీటి డెఫినిషన్ క్లియర్‌గా చెప్పాలని అన్నదన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో అందరిని బాధితురాలుగా చూడాలని... నేరస్తులుగా చూడకూడదని సునీతా కృష్ణన్ తెలిపారు.