Gold: ఇండియన్స్ గోల్డ్ మోజు.. ఆర్థిక లోటుకు కారణమా?
ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఒక ప్రకటన చేశారు. అదేంటంటే.. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను నిలిపివేయమని. ఆయన ఎందుకలా అన్నారు? దాని వెనుక కారణమేంటనేది చూద్దాం. ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే.. దిగుమతి చేసుకునే దేశాలలో భారతదేశం ఒకటి.
ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఒక ప్రకటన చేశారు. అదేంటంటే.. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను నిలిపివేయమని. ఆయన ఎందుకలా అన్నారు? దాని వెనుక కారణమేంటనేది చూద్దాం. ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే.. దిగుమతి చేసుకునే దేశాలలో భారతదేశం ఒకటి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. మన దేశం ఏటా సుమారు 700–800 టన్నుల బంగారాన్ని వినియోగిస్తోంది. కానీ దేశీయంగా కేవలం 1–2 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. దీంతో మన దేశం తన సరఫరాలో 90 శాతం కంటే ఎక్కువ దిగుమతులపైనే ఆధారపడి ఉంది. అనేక ఇతర వస్తువులతో పోలిస్తే.. బంగారం దిగుమతులు పారిశ్రామిక ఉత్పత్తికి పెద్దగా ప్రత్యక్షంగా సహకరించవు. వీటికి పెద్ద మొత్తంలో డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే భారతదేశ కరెంట్ ఖాతా లోటు అనేది విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని పెంచుతోంది. ముడి చమురు ధరలు పెరిగినప్పుడు ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. దీనికి కారణం భారతదేశం ఇప్పటికే తన చమురు అవసరాలలో దాదాపు 85% దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. పశ్చిమ ఆసియా సంఘర్షణ కారణంగా ఇంధనం, ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దిగుమతి బిల్లును పెంచే అవసరం లేని దిగుమతులను నియంత్రించడంపై పాలసీ మేకర్స్ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. భారతదేశ మొత్తం దిగుమతుల బిల్లులో బంగారం వాటా దాదాపు 9 శాతం. ఇది ప్రధాన దిగుమతి కేటగిరీలో క్రూడ్ ఆయిల్ తర్వాత రెండవ స్థానంలో ఉంది. కాబట్టి దిగుమతి బిల్లును పెంచే దిగుమతులను నియంత్రించడంలో భాగంగానే భారత్ బంగారంపై దృష్టి సారిస్తోంది.