Trikala Movie Review: మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్ ‘త్రికాల’ ఎలా ఉందంటే..
కర్మ సిద్ధాంతం, పునర్జన్మ, తాంత్రిక శక్తులు, మానసిక భయం, మానవ భావోద్వేగాలతో సినిమా చేయడమంటే ఒక సరికొత్త ప్రయోగానికి తెరదీయడమే. అలాంటి ప్రయోగంతో రూపొందిన చిత్రమే ‘త్రికాల’.
కర్మ సిద్ధాంతం, పునర్జన్మ, తాంత్రిక శక్తులు, మానసిక భయం, మానవ భావోద్వేగాలతో సినిమా చేయడమంటే ఒక సరికొత్త ప్రయోగానికి తెరదీయడమే. అలాంటి ప్రయోగంతో రూపొందిన చిత్రమే ‘త్రికాల’. ఎ స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అనే ట్యాగ్‌లైన్‌తో తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరహా మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. మణి తెల్లగూటి తెరకెక్కించిన ఈ సినిమా ఒక విజువల్ వండర్ అని మేకర్స్ ప్రమోషన్స్ సమయంలో చెప్పుకొచ్చారు. సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? చూద్దాం.
కథేంటంటే..
“కుమారి ఖండం” అనే ఒక పౌరాణిక భూభాగంలో శతాబ్దాల క్రితం ఈ చిత్ర కథ ప్రారంభమవుతుంది. అక్కడి అత్యంత శక్తివంతమైన తాంత్రిక గ్రంథాలు, ప్రాచీన సాంకేతిక రహస్యాలను అసురుల చేతికి చిక్కకుండా రహస్య ప్రదేశంలో మునులు దాచిపెడతారు. వాటిని జాగ్రత్తగా కాపాడేందుకు “శక్తి ఏథా” అనే దైవిక ఆయుధాన్ని సృష్టించి, దానిని వీరరాజు త్రికాల వర్మకు అప్పగిస్తారు. అసుర శక్తులపై పోరాడుతూ త్రికాల వర్మ మరణిస్తాడు. మునులు అతని ఆత్మను ఒక మాయా అండంలో బంధించి.. కలియుగంలో ప్రపంచానికి భారీ ముప్పు వచ్చినప్పుడు ఆ ఆత్మ మళ్లీ మేల్కొంటుందని వారు చెబుతారు. కట్ చేస్తే.. మూవీ ప్రస్తుతానికి వస్తుంది. శివ (మాస్టర్ మహేంద్రన్) అనే యువకుడు అదృశ్యమైన తన ప్రేయసి నిధి (సాహితి) కోసం నగరానికి వస్తాడు. అతని దగ్గర ఒక ఫోన్ ఉంటుంది. దానికి దుష్టశక్తి ఆవహించి ఉంటుంది. ఈ క్రమంలో అతనికి వైతరణ్ (అజయ్) అనే విచిత్రమైన వ్యక్తి గురించి తెలుస్తుంది. సూర్యరశ్మిని తట్టుకోలేని ‘పోర్ఫిరియా’ వ్యాధితో వైతరణ్ బాధపడుతూ ఉంటాడు. నిజానికి పునర్జన్మ ఎత్తిన త్రికాలవర్మ.. కుటుంబ సంఘర్షణలు, మానసిక వేదనలతో అతను తన తండ్రిని, పినతల్లి (ఆమని)ని హత్య చేసి ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ అతని ఆత్మ ఒక భయానక బంగ్లాలోనే సంచరిస్తూ ఉంటుంది. సైకియాట్రిస్ట్ మాయ (శ్రద్ధా దాస్) ఆ ఇంట్లో అనూహ్యంగా చిక్కుకుంటుంది. మరోవైపు అసుర రాజు తిరిగి భూమిపై ఆధిపత్యం సాధించేందుకు మేల్కొంటాడు. అప్పుడు దర్వాడి తాంత్రిక తెగ ఏం చేసింది? అసుర రాజును ఎలా అడ్డుకుంది? శివకు ఈ కథతో ఉన్న అసలు సంబంధం ఏమిటి? అనేదే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
ఈ సినిమాకు కాన్సెప్టే చాలా చాలా స్ట్రాంగ్. కర్మ సిద్ధాంతాన్ని కేవలం డైలాగ్స్ రూపంలో కాకుండా, పాత్రల మానసిక స్థితి, వారి గతం, పునర్జన్మల ద్వారా చూపించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పౌరాణికాన్ని ఆధునిక ప్రపంచంతో మిళితం చేసిన తీరు అద్భుతంగా అనిపిస్తుంది. ‘త్రికాల’లో ప్రతి షాట్‌కు ఒక ప్రత్యేకమైన “డార్క్ విజువల్ లాంగ్వేజ్” ఉంది. ఎక్కడా కూడా సినిమా బోర్ అనిపించదు. సినిమాలో దాదాపుగా అన్ని అంశాలను జాగ్రత్తగా డీల్ చేశారు. దీంతో సినిమా చాలా ఆసక్తికరంగా సాగింది. మైథాలజీ, తాంత్రిక శక్తులు, సైకాలజికల్ హారర్ అంశాలను ఒకే ప్రపంచంగా చూపించేందుకు మణి తెల్లగూటి ఎంచుకున్న ఫ్రేమింగ్ స్టైల్ ప్రత్యేకంగా నిలుస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే నీడలు, ఖాళీ కారిడార్లు, మసక వెలుతురు, నెమ్మదిగా కదిలే కెమెరా కూడా సినిమాపై ఉత్కంఠత, ఆసక్తి పెంచుతూ ఉంటుంది. దర్శకుడి విజన్ వల్లే ఈ సినిమా ఒక “డార్క్ మిస్టిక్ యూనివర్స్”లా అనిపిస్తుంది.
ఎవరెలా నటించారంటే..
వైతరణ్‌గా అజయ్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు ఈయనే స్పెషల్ అట్రాక్షన్. సూర్యకాంతిని తట్టుకోలేని ఒక మనిషి, మానసిక ఒత్తిడి, అంతర్మథనం, భయం, దుష్టశక్తి మధ్య చిక్కుకున్న పాత్రగా అజయ్ అద్భుతంగా కనిపించాడు. అతని కోసం ప్రత్యేకంగా రూపొందించిన మాస్క్‌లు, కాస్ట్యూమ్స్, డార్క్ విజువల్ ట్రీట్‌మెంట్ చాలా కొత్తగా ఉన్నాయి. హీరో మాస్టర్ మహేంద్రన్ ఈ సినిమాలో చాలా నేచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అమాయకత్వం, ప్రేమ, భయం, భావోద్వేగం.. ఇలా విభిన్నమైన ఎమోషన్స్‌ను చాలా ఈజ్‌తో చూపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ వైపు వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన బాగా కనెక్ట్ అవుతుంది. శ్రద్ధా దాస్ ఈ సినిమాకు మరో హైలైట్. తన పాత్రలో గ్లామర్ కంటే మిస్టరీ ఎక్కువగా కనిపిస్తుంది. సైకియాట్రిస్ట్ పాత్రలో చాలా కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు స్పెషల్ డార్క్ టోన్ తీసుకొచ్చింది. ముఖ్యంగా హారర్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. సీనియర్ నటి ఆమని పాత్ర కూడా సినిమాకు కీలకం. తల్లితనంతో పాటు భయం, బాధ, అనుమానం వంటి భావోద్వేగాలను చాలా సహజంగా చూపించింది. ఆమె పాత్ర కథలో ఎమోషనల్ వెయిట్‌ను పెంచుతుంది. ఆమని నట
టెక్నికల్ పరంగా..
ముఖ్యంగా ఈ సినిమా విషయానికి వస్తే దర్శకుడు మణి తెల్లగూటి గురించి చెప్పాలి. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో ఆయన ప్రతిభ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమా కథను రాసుకున్నప్పటి నుంచే ప్రతి ఫ్రేమ్‌ను విజువల్‌గా డిజైన్ చేసినట్టు సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఎడిటింగ్ విషయంలోనూ చాలా శ్రద్ధ కనబరిచినట్టుగా తెలుస్తోంది. సాధారణ కమర్షియల్ కట్‌లకు బదులుగా, సౌండ్ డిజైన్, విజువల్ రిథమ్‌కు ప్రాధాన్యం ఇచ్చే సినిమాటిక్ కటింగ్ విధానం వాడినట్లు తెలుస్తోంది. అందుకే ట్రైలర్‌లోని ప్రతి షాట్ థియేటర్లలో ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, భారీ సెట్లు లేకపోయినా, ఫ్రేమ్ కంపోజిషన్, డిజిటల్ ఎక్స్‌టెన్షన్స్, CGI బ్యాక్‌డ్రాప్స్ ద్వారా గ్రాండ్ విజువల్ స్కేల్ తీసుకురావడం దర్శకుడి ప్రధాన బలం. సమకాలీన తెలుగు సినిమాలో సరికొత్త విజువల్ స్టైల్‌ను తీసుకొస్తున్న సినిమాటోగ్రాఫర్లలో పవన్ చెన్నా ఒకరు.
‘త్రికాల’లో పవన్ చెన్నా విజువల్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పౌరాణిక ప్రపంచం, చీకటి బంగ్లాలు, తాంత్రిక శక్తులు, ఆధ్యాత్మిక యుద్ధాలను చూపించేందుకు ఆయన వాడిన లైటింగ్ స్టైల్ అద్భుతంగా ఉంది. డార్క్ ఇంక్-బ్లాక్ టోన్స్ మధ్య గోల్డెన్ లైట్ బీమ్స్ ఉపయోగించడం వల్ల సినిమాలో ఒక మిస్టిక్ ఫీల్ వచ్చింది. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వరం అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలం. మెయిన్ హైలైట్ గా నిలిచి సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది. హారర్ మూవీస్‌కు బీజీఎం ప్రాణం. అలాంటి బీజీఎంను అద్భుతంగా ఇచ్చారు. కొన్ని సీన్లలో మ్యూజిక్ కంటే సౌండ్ డిజైన్‌నే ఎక్కువగా ఉపయోగించడం మరింతా ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంది. వీఎఫ్ఎక్స్ చాల రిచ్‌గా మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళతాయి. నిర్మాత రాధికా శ్రీనివాస్ ఈ సినిమాను చాలా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు. స్క్రీన్‌పై ప్రతి ఫ్రేమ్‌లోనూ క్వాలిటీ కనిపించేలా ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించిన తీరు స్పష్టంగా తెలుస్తోంది.
ఫైనల్‌గా చెప్పాలంటే.. ‘త్రికాల’ ప్రేక్షకులను మరచిపోలేని అనుభూతినిస్తుంది.
రేటింగ్: 3/5