others

RBI: పెరుగుతున్న కరెన్సీ ముద్రణ ఖర్చు.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం

పెరుగుతున్న కరెన్సీ ముద్రణ ఖర్చులను తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. నోట్ల మన్నికను మెరుగుపరచడంలో భాగంగా ఆర్‌బీఐ పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

RBI: పెరుగుతున్న కరెన్సీ ముద్రణ ఖర్చు.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం

పెరుగుతున్న కరెన్సీ ముద్రణ ఖర్చులను తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. నోట్ల మన్నికను మెరుగుపరచడంలో భాగంగా ఆర్‌బీఐ పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీనికోసం ఒక లిమిటెడ్ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. అయితే ఇది ప్రస్తుతం బీభత్సంగా చెలామణిలో ఉన్న రూ.10, రూ.20 డినామినేషన్లతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం డిజిటల్ ట్రాన్సక్షన్స్ పెరిగినా కూడా ఆర్థిక వ్యవస్థలో నగదు చెలామణి అనేది పెరుగుతూనే ఉంది.

భారీ పెరుగుదల..

2026 మార్చి చివరి నాటికి, చలామణిలో ఉన్న కరెన్సీ విలువ రూ. 41.23 ట్రిలియన్లకు చేరుకుంది. ఇది ఒక సంవత్సరం క్రితం ఉన్న రూ. 36.86 ట్రిలియన్ల కన్నా 11.8% ఎక్కువ. 2025 ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ ముద్రణ కోసం ఆర్‌బీఐ రూ. 6,372.8 కోట్లు ఖర్చు చేసింది. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసిన రూ. 5,101.4 కోట్ల కన్నా చాలా ఎక్కువ. ముద్రణ ఖర్చులలో ఈ భారీ పెరుగుదల అనేది పాలిమర్ నోట్లపై ఆసక్తిని పునరుద్ధరించింది. ఆర్‌బీఐ తక్కువ నోట్లను ముద్రించి, అధిక విలువ గల కరెన్సీపై ఎక్కువ దృష్టి సారించడంతో, 2026 ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ ముద్రణ ఖర్చులు 23.5% తగ్గి రూ. 4,875.2 కోట్లకు పడిపోయాయి.

ఆ నోట్ల వినియోగమే అత్యధికం..

ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో పాతబడిపోయిన నోట్లను చలామణి నుంచి తొలగించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే 2025 ఆర్థిక సంవత్సరంలో 23.8 బిలియన్ల నోట్లను ఉపసంహరించి, ధ్వంసం చేశారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 12.3% అధికం. ఇందులో రూ. 500, రూ. 100 నోట్ల వినియోగమే అత్యధికంగా ఉంది. 60కి పైగా దేశాలు పాలిమర్ నోట్లను పూర్తిగా లేదా పాక్షికంగా తమ ద్రవ్య వ్యవస్థలలో ప్రవేశపెట్టాయి.

తొలి దేశం ఆస్ట్రేలియా..

1988లో పాలిమర్ పది-డాలర్ల నోటును జారీ చేసిన తొలి దేశం ఆస్ట్రేలియా. అప్పటి నుంచి ప్లాస్టిక్ కరెన్సీని స్వీకరించిన ఇతర దేశాలలో కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, రొమేనియా, న్యూజిలాండ్, వియత్నాం ఉన్నాయి. 1998లో పాలిమర్ నోటును ప్రవేశపెట్టిన మొదటి యూరోపియన్ దేశం రొమేనియా కాగా, 2011లో కెనడా దానిని ఫాలో అయ్యింది.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 1, 2026 4:51 PM