others

Peddi Review: ‘పెద్ది’ ప్రేక్షకులను అలరిస్తుంది?

‘పెద్ది’ ట్రైలర్‌కు మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. అదేమిటని తాజాగా ఇంటర్వ్యూలో బుచ్చిబాబు సానను అడిగితే.. ట్రైలర్ మిశ్రమ స్పందన వచ్చిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పారు. మరి బుచ్చిబాబుది కాన్ఫ్‌డెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?

Peddi Review: ‘పెద్ది’ ప్రేక్షకులను అలరిస్తుంది?

చిత్రం: పెద్ది

విడుదల: 04-06-2026

నటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బొమ్మన్ ఇరానీ, సత్య తదితరులు

మ్యూజిక్: ఏఆర్ రెహమాన్

ఎడిటర్: నవీన్ నూలి

దర్శకుడు: బుచ్చిబాబు సాన

నిర్మాత: వెంకట సతీష్ కిలారు

రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పెద్ది’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రమోషన్స్‌ను బీభత్సంగా నిర్వహించి బాగా సినిమాకు హైప్ ఇచ్చేశారు. తొలుత గ్లింప్స్ వదిలినప్పుడు అది చూసిన అభిమానులు బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నారు. ‘పెద్ది’ ట్రైలర్‌కు మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. అదేమిటని తాజాగా ఇంటర్వ్యూలో బుచ్చిబాబు సానను అడిగితే.. ట్రైలర్ మిశ్రమ స్పందన వచ్చిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పారు. మరి బుచ్చిబాబుది కాన్ఫ్‌డెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా? అనేది చిత్ర యూనిట్ మాత్రం సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది. ఇంతకీ మూవీ ఎలా ఉంది? చూద్దాం.

కథేంటంటే..

2016 ఒలింపిక్స్ క్రీడలు ముగింపు తర్వాత నుంచి ఈ కథ మొదలవుతుంది. కోల్‌కతా నుంచి విజయనగరం మీదుగా కొండ కింద ఊరికి బొమ్మన్ ఇరాని సాగించే ప్రయాణంతో అసలు కథ ప్రారంభమవుతుంది. చాలా మంది నోట ‘పెద్ది’ మాట విన్న బొమ్మన్ ఇరాని ఆశ్చర్యపోతారు. అసలు ఆ పెద్ది ఎవరో తెలుసుకోవాలని అనుకుంటారు. అప్పుడు పెద్ది ఇంట్రడక్షన్.. బొబ్బిలి వర్సెస్ విజయనగరం టీంల మధ్య పోటీ. క్రికెట్ కూలీగా పెద్దిని విజయనగరం టీం ఆక్షన్‌లో గెలుచుకుంటుంది. పెద్ది ప్రతి బాల్‌ను బౌండరీకి తరలిస్తూ అతను క్రికెట్‌లో ఎంత గొప్ప ప్లేయరో తెలియజెబుతాడు. పెద్ది ఉండే ఊరికి ఒక పేరంటూ ఉండదు. కొండ కింద ఉంటుంది కాబట్టి కొండ కింద ఊరుగా పిలుచుకుంటారు. కనీసం గుర్తింపునకు సైతం నోచుకోని గ్రామమది. 1800 మంది నివసిస్తుంటారు కానీ అదెక్కడుందో కూడా పాలకులకు తెలియదు. వారికి ఓటు హక్కు లేకపోవడం కూడా ఎవరూ దానిని పట్టించుకోకపోవడానికి మరో కారణం. ఆ గ్రామానికి వెళ్లాలంటే ఒకరోజు కేటాయించుకోవాల్సిందే. ఆ ఊరిప్రజలంతా కొండల్లో పడి.. వాగులు దాటుకుంటూ వెళ్లి బెల్లం బట్టీలో పని చేస్తుంటారు. వారికి కేవలం రోజు కూలి రూ.10 మాత్రమే. ఇక తమ ఊరిలో కనీసం ట్రైన్ ఆగితేనన్న జనాల కష్టాలు పోతాయని భావించే అప్పలసూరి (జగపతిబాబు) దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. మరి చివరకు అప్పలసూరి కల నెరవేరిందా? అప్పలసూరి ప్రయత్నానికి పెద్ది నుంచి ఎలాంటి సహకారం అందింది? క్రికెటర్ అయిన పెద్ది.. రెజ్లర్‌గా.. అథ్లెట్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

గుర్తింపే ఆత్మగౌరవంగా భావించి ఓ యువకుడు సాగించే పోరాటమే పెద్ది. కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. పాత్రల పరిచయం. కొండకింద ఊరి పరిస్థితి. అప్పలసూరి పోరాటం.. కూలిగా పెద్ది ఎదుర్కొనే అవమానాలతో సాగుతుంది. వాస్తవానికి ఫస్ట హాఫ్ చాలా బాగుంటుంది. క్రికెటర్ అయిన పెద్ది.. రెజ్లింగ్ దిశగా అడుగులు వేయడం.. ఆపై అథ్లెట్ అవడం వంటి అంశాలను చూపించారు. ఇప్పటి వరకూ మనం చూసిన స్పోర్ట్స్ డ్రామాలన్నీ ఏదో ఒక ఆట ఆధారంగా తెరకెక్కినవే. కానీ ఇది మాత్రం మూడు గేమ్‌లతో ముడిపడింది. అదే సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పాలి. క్రికెటర్‌గా రామ్ చరణ్ కొట్టే షాట్స్ క్రికెట్ చరిత్రలోనే ఇప్పటి వరకూ ఎవరూ కొట్టలేదు. మరీ అంత సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడం అతిగా అనిపించింది. నేచురల్‌గా సినిమా తీస్తూ అతిని జోడించారు. సినిమాలో హీరో ఊరు, వారి స్థితిని ఒకరకంగా చెప్పాలంటే దరిద్రాన్ని ఎక్కువగా చూపించారు. కేవలం సినిమా చివరిలోనే ఒక మంచి మూమెంట్‌తో ఎండ్ చేశారు. ఏదైనా ఒక గేమ్‌ను నమ్ముకుని సినిమా తీసి ఉంటే వంక పెట్టాల్సి వచ్చేది కాదేమో కానీ మూడు గేమ్‌లు ఆడించి సినిమా సక్సెస్‌కు గండి కొట్టేశారేమో అనిపిస్తుంది. పైగా 1800 మంది ఓటర్లుంటే ఏ ఎమ్మెల్యే అయినా లైట్ తీసుకుని వెళ్లిపోతాడా? సినిమాలో ఇలాంటివి లేకుంటే బాగుండేది.

ఎవరెలా నటించారంటే..

పెద్ది సినిమా రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. రామ్ చరణ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. డ్యాన్స్‌లు.. యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే అతని కష్టం మనకు తెలుస్తోంది. ఇక జాన్వీకపూర్ విషయానికి వస్తే ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్ర. వెండితెరపై కాసేపే కనిపిస్తుంది. దాదాపుగా సెకండ్ హాఫ్‌లో అయితే కనిపించదు. ఇక జగపతిబాబు అయితే తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఇక ఈ చిత్రంలో కీలక పాత్ర అంటే శివరాజ్ కుమార్. అద్భుతంగా నటించారు. పెద్దిని అద్భుతమైన రెజ్లర్‌గా తీర్చిదిద్దే గురువు గౌర్ నాయుడు పాత్రలో ఆయన మెప్పించారు. ఇతర పాత్రల్లో నటించిన వారంతా తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు.

టెక్నికల్ పరంగా..

బుచ్చిబాబు సాన కథను ఒకే ఆటతో రాసుకుని దానిని వినూత్నంగా తీర్చిదిద్ది ఉంటే చాలా బాగుండేది. ఆయన కథే పెద్ద మైనస్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గురించి చెప్పేదేముంది? అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఎడిటింగ్ విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా తగినట్టుగా ఉన్నాయి.

ఫైనల్‌గా.. పెద్ది ఫస్ట్‌హాఫ్ మెప్పిస్తుంది.. సెకండ్ హాఫ్ మాత్రం దాదాపుగా నచ్చదు.

రేటింగ్: 2.75/5

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 4, 2026 3:14 AM