Isakapatnam Review: ఐశ్వర్య రాజేష్ పిరియాడిక్ డ్రామా మెప్పిస్తుందా?
ఐశ్వర్య రాజేష్‌కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. అలాగే అద్భుతమైన కంటెంట్ అందిస్తుండటంతో అమెజాన్ ప్రైమ్‌కు కూడా ఆదరణ చాలా ఎక్కువ. వీరిద్దరి కాంబోలో రూపొందినదే ‘ఇసకపట్నం’.
సిరీస్ టైటిల్: ఇసకపట్నం
విడుదల: 02-07-2026
ఓటీటీ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్
నటీనటులు: ఐశ్వర్య రాజేశ్, సముద్రఖని, రాజీవ్ కనకాల, సునీల్, నరేష్ అగస్త్య, సుధాకర్ కోమాకుల, బెనర్జీ, రాజా చెంబోలు, జ్వాలా కోటి తదితరులు
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
కథ: ప్రశాంత్ రగతి
ఎడిటర్, దర్శకత్వం: గ్యారీ బీహెచ్
నిర్మాతలు: రాహుల్ తమడ, సందీప్ రెడ్డి బొర్ర
ఐశ్వర్య రాజేష్‌కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. అలాగే అద్భుతమైన కంటెంట్ అందిస్తుండటంతో అమెజాన్ ప్రైమ్‌కు కూడా ఆదరణ చాలా ఎక్కువ. వీరిద్దరి కాంబోలో రూపొందినదే ‘ఇసకపట్నం’. పైగా సముద్రఖని వంటి నటుడు కూడా దీనికి తోడవడంతో అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఏడు ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ వెబ్‌సిరీస్ ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? తెలుసుకుందాం.
కథేంటంటే..
ఇసకపట్నం అనేది 1980, 1990 టైం పీరియడ్‌లో జరిగే కథ. నాయుడు (సముద్రఖని).. భార్యాకూతురితో కలిసి బతుకుదెరువు కోసం ఇసకపట్నం పోర్ట్ ఏరియాకు వెళతాడు. ఆ ప్రాంతంలో సిన్నరావు( రాజీవ్ కనకాల) అనే లోకల్ లీడర్ ఉంటాడు. చాలా మంచివాడు. మత్సకారులకు అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. ఊహించని పరిస్థితుల్లో సిన్నరావుని నాయుడు హత్య చేసి పోర్ట్ ఏరియానంతా తన ఆధీనంలోకి తెచ్చుకుని డాన్‌గా మారతాడు. అక్కడి నుంచి స్మగ్లింగ్ చేస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి డబ్బు, పరపతి సంపాదిస్తాడు. నాయుడి కూతురే భారతి (ఐశ్వర్య రాజేష్). తండ్రి చేసే అక్రమాలు, రౌడీయిజం వంటివేమీ ఆమెకు నచ్చవు. తండ్రి అక్రమాలకు అడ్డుపడకుండా ఓ ఎన్జీవో ద్వారా పేదలకు సాయం చేస్తూ ఉంటుంది. వ్యాపారంలో నాయుడుతో తలెత్తిన విభేదాల కారణంగా పోతన అనే అనుచరుడు ఆయనకు దూరమై.. అదే ఏరియాలో ధనవంతుడైన ప్రతాప్ వర్మ(రవి వర్మ)తో చేతులు కలుపుతాడు. ఇంతలో అక్కడ ఊహించని ఘటనలు జరగడం.. చిన్నారులు మరణిస్తారు. ఆ తరువాత కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేదే కథ. అసలు భారతికి తను ప్రేమించిన వ్యక్తితో కాకుండా ప్రతాప్ వర్మతో ఎందుకు జరుగుతుంది? ప్రతాప్ వర్మ ఎలా మరణిస్తాడు? తండ్రిపై భారతికి ఉన్న కోపానికి కారణమేంటి? వంటి అంశాలు తెలియాలంటే వెబ్‌సిరీస్ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఇసకపట్నం పోర్ట్ ఏరియాలో జరిగే రౌడీయిజం, మాఫియా, స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సిరీస్‌ను దర్శకుడు తెరకెక్కించాడు. లోకల్ మత్య్సకారులు వర్సెస్ బర్మా నుంచి వచ్చిన మత్స్యకారుల మధ్య ఆధిపత్య పోరుతో ఒక సాధారణ కథలాగే ప్రారంభమవుతుంది. ఆ తరువాత ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఆసక్తికరంగా సాగుతుంది. తొలి రెండు ఎపిసోడ్‌లు కాస్త స్లో నెరేషన్ అయినప్పటికీ పాత్రలను మలిచిన తీరు ఆసక్తిని రేకెత్తిస్తుంది. పోర్టు ఏరియాలో రెండు గ్రూపుల మధ్య జరిగే ఆధిపత్య పోరుగా కథ ప్రారంభమవుతుంది. నాలుగో ఎపిసోడ్ నుంచి కథ స్పీడ్ అందుకుంటుంది. అక్కడి నుంచి ఆసక్తికరంగా నడుస్తుంది. ముఖ్యంగా చివరి వరకూ ఐశ్వర్య రాజేష్ పాత్రను సాదాసీదాగా నడిపించడం కొంతమేర నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. ఆమె పాత్రలోని ట్విస్ట్‌ను ముందుగానే రివీల్ చేసి ఉంటే సిరీస్ మరో రకంగా ఉండేది. తండ్రి ఎత్తులకు పైఎత్తులు వేయడం చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తుంది. పోలీస్ అధికారిగా సునీల్‌ను అయితే తీసుకున్నారు కానీ ఆయన పాత్రకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఒక మైనస్‌గా చెప్పాలి. నరేష్ అగస్త్య ఆటో డ్రైవర్‌గా కనిపిస్తాడు. అతడిని కథలో ఇన్వాల్వ్ చేసిన తీరు మెప్పిస్తుంది. భారతి ప్రియుడిగా సుధాకర్ కొమాకుల కూడా మంచి ప్రాధాన్యమే దక్కింది. కథ చూస్తున్నంత సేపు ఎవరు ఎవరి వైపున్నారనే విషయంలో సందిగ్ధత ఏర్పడుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్‌లు, చివరిలో ఐశ్వర్యకు ఇచ్చిన ఎలివేషన్ బాగుంటుంది.
ఎవరెలా చేశారంటే..
సముద్రఖని గురించి ముందుగా చెప్పాలి. నటించారు అనడం కన్నా జీవించారనడం మేలేమో. తన పాత్రలోని వేరియేషన్స్‌ను అత్యద్భుతంగా చూపించారు. ఇక ఐశ్వర్య రాజేష్ విషయానికి వస్తే చాలా బాగా నటించింది కానీ ఆమె పాత్రలోని పవర్ అనేది చివరి వరకూ రివీల్ చేయకపోవడంతో చివరిలో మాత్రమే ఆమెలోని నట విశ్వరూపాన్ని చూడగలం. సుధాకర్ కొమాకుల కూడా మంచి ప్రాధాన్యమే దక్కింది. ఆయన కూడా చక్కగానే నటించారు. నరేష్ అగస్త్య కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. సునీల్, రాజీవ్ కనకాల, రవివర్మ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ పరంగా..
దర్శకుడు గ్యారీ బీహెచ్ కథను స్లోగా ప్రారంభించినప్పటికీ ఆ తరువాత ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా మలిచారు. అలాగే దాదాపుగా ప్రతి పాత్రకు మంచి ప్రాధాన్యమే ఇచ్చారు. ముఖ్యంగా పోర్ట్ ఏరియాలో జరిగే మాఫియా కథలో తండ్రీకూతుళ్ళ ఆధిపత్యం అంశం కొత్తగా అనిపిస్తుంది. తొలి మూడు ఎపిసోడ్స్‌లో ఎడిటింగ్ విషయంలో శ్రద్ధ.. ఆది నుంచే కథను పరుగులు పెట్టించి ఉంటే వెబ్ సిరీస్ మరో రకంగా ఉండేది. సంగీతం పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు సిరీస్‌కు తగినట్టుగా ఉన్నాయి.
ఫైనల్‌గా.. ట్విస్ట్‌లు, పెర్ఫార్మెన్స్‌ల కోసం ‘ఇసకపట్నం’ చూడవచ్చు.
రేటింగ్: 2.75/5