Bahubali The Torchbearer Review: ఊహాతీత ప్రపంచం వెనుక దాగున్న కష్టం..
‘బాహుబలి’ యుద్ధ నేపథ్యమున్న సినిమా మాత్రమే కాదని.. అసలు ఈ సినిమా చేసేందుకే ఒక యుద్ధం
తెలుగు సినిమా ఘనతను ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. ఒక సీక్వెల్ కోసం ప్రేక్షకులు పెద్ద ఎత్తున చర్చలు నడపడం.. దాని కోసం రెండేళ్ల పాటు ఎదురు చూడటమనేది ఈ సినిమా విషయంలోనే జరిగింది. అంతటి అవుట్‌పుట్ రావడం వెనుక ఎంతమంది కష్టం ఉంటుంది? ఆ కష్టాన్ని తెలియజేయడంతో పాటు చూపించేందుకు చేసిన ప్రయత్నమే ‘బాహుబలి ది టార్చ్ బేరర్’. 4 ఎపిసోడ్‌లుగా వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం.
‘బాహుబలి’ సిరీస్‌ను రూపొందించిన దర్శకధీరుడు రాజమౌళి.. డాక్యుమెంటరీలో ఓ మాట అన్నారు. అదేంటంటే.. ‘బాహుబలి’ యుద్ధ నేపథ్యమున్న సినిమా మాత్రమే కాదని.. అసలు ఈ సినిమా చేసేందుకే ఒక యుద్ధం చేశాం’ అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. నిజమే ఈ డాక్యుమెంటరీ చూస్తుంటే ఆద్యంతం మనకు అలాగే అనిపిస్తుంది. తెరపై కనిపించిన ఓ అద్భుత దృశ్యం.. ఒక ఊహాతీత ప్రపంచం వెనుక ఇంతమంది కష్టం ఉందా? అప్పుడెప్పుడో ఓ మహానుభావుడు చెప్పినట్టుగా.. తాజ్‌మహల్ నిర్మాణం గురించి కాదు.. రాళ్లెత్తిన కూలీల గురించి తెలుసుకోవాలని. ఈ డాక్యుమెంటరీ కూడా అలా రాళ్లెత్తిన కూలీలతో పాటు ప్రతి ఒక్క నటుడు పడిన కష్టాన్ని చూపించింది. కత్తి యుద్ధమంటే రెడీ అనగానే చకచకా తిప్పేసేది కాదు. సాధన కావాలి. మరి దానికోసం ప్రభాస్, రానా ఎంతటి సాధన చేశారో ఈ డాక్యుమెంటరీలో చూపించారు. అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సుబ్బరాజు, తమన్నా తదితరులంతా నాటి విశేషాలను గుర్తు చేసుకున్నారు.
ముఖ్యంగా భావోద్వేగాలకు ‘బాహుబలి ది టార్చ్‌బేరర్‌లో పెద్ద పీట వేశారు. నాలుగు ఎపిసోడ్‌లుగా వచ్చిన ఈ సిరీస్‌లో ప్రతి ఒక్క అంశాన్ని వివరించారు. చివరకు జపాన్‌లో ప్రమోషన్స్, అక్కడి ప్రేక్షకులు తమను రిసీవ్ చేసుకున్న తీరు.. ఏ దేశానికి వెళ్లినా తమకు దక్కిన గౌరవం వంటి విషయాలను అద్భుతంగా నటీనటులతో సహా మేకర్స్ వివరించారు. చివరకు పూరి జగన్నాథ్ సైతం అమెరికాలో రాజమౌళి తన స్నేహితుడని చెప్పి.. ఆయనతో దిగిన ఫోటో చూపించగానే అక్కడి వారు రియాక్ట్ అయిన తీరును వివరించారు. ముఖ్యంగా అసలు ఈ ప్రయాణం ఎలా ఆరంభమైందో వివరించారు. అలాగే బాహుబలి విడుదలైన తొలి రోజున వచ్చిన నెగిటివ్ టాక్.. ఇక మణికొండలో తమ సైట్ అమ్మి నష్టాలను పూడ్చాలనుకోవడం వంటి విషయాలను రాజమౌళి దంపతులు వివరించారు. అలాంటి ఈ చిత్రం ఆ తరువాత పాన్ ఇండియాని షేక్ చేయడం ఆసక్తికరం. ఈ డాక్యుమెంటరీలో బాహుబలికి సంబంధించిన భారీ సెట్లు లేదా విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు సినిమాలో కొన్ని మరపురాని పాత్రలు, బలమైన భావోద్వేగాలను చూడవచ్చు.
ఫైనల్‌గా.. ‘బాహుబలి ది టార్చ్‌బేరర్’ తెలుగు సినీ చరిత్రలో అతి పెద్ద మైలురాయికి నివాళి