Entertainment

Hema Malini: బాబోయ్ ఇల్లా అది.. ఇంద్ర భవనం.. పిక్స్ మీకోసం..

డ్రీమ్ గర్ల్ హేమ మాలిని ఇంటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇల్లా అది ఇంద్ర భవనమని నెటిజన్లు అంటున్నారు. ఇంద్రుడి దేవలోకం ఎలా ఉంటుందో చూడలేదు కానీ.. హేమమాలిని ఇంటిని చూస్తే అర్థమవుతోందని అంతా అంటున్నారు.

Hema Malini: బాబోయ్ ఇల్లా అది.. ఇంద్ర భవనం.. పిక్స్ మీకోసం..

డ్రీమ్ గర్ల్ హేమ మాలిని ఇంటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇల్లా అది ఇంద్ర భవనమని నెటిజన్లు అంటున్నారు. ఇంద్రుడి దేవలోకం ఎలా ఉంటుందో చూడలేదు కానీ.. హేమమాలిని ఇంటిని చూస్తే అర్థమవుతోందని అంతా అంటున్నారు. హేమ మాలిని తలుపులు అభిమానుల కోసం 54 ఏళ్ల తర్వాత తెరుచుకున్నాయి. తెరుచుకున్నాయి అనడం కన్నా ఆమె కూతురు ఈషా డియోల్ తెరిచారు అనడం మేలేమో. ఇంటి విశేషాలు తెలిస్తే అవాక్కవడం ఖాయం. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన హోమ్ టూర్‌లో హేమ మాలినీ చారిత్రక నివాసమైన 'అద్వితీయ' ఇంటి విశేషాలను ఈషా డియోల్ పంచుకుంది.

54 ఏళ్ల చరిత్ర..

ఈషా తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఇంటికి దాదాపు 54 ఏళ్ల చరిత్ర ఉంది. హేమ మాలినీ ముంబైకి వచ్చినప్పటి నుంచి ఇదే ఆమె నివాసం ఇన్నేళ్లుగా ఈ ఇంటికి ప్రత్యేకంగా పేరు లేకుండా "హేమ మాలినీ బంగ్లా"గానే అందరూ పిలిచేవారు. అయితే ఇటీవల ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ ఈ ఇంటికి 'అద్వితీయ' అనే పేరు పెట్టారని ఈషా వెల్లడించింది. 'అద్వితీయ' అంటే ప్రత్యేకమైనది, సాటిలేనిది అనే అర్థం. ఇంట్లోకి అడుగుపెట్టగానే భారతీయ కళా సంస్కృతి ప్రతిచోటా కనిపిస్తుంది. ప్రవేశ ద్వారం వద్ద శాస్త్రీయ నృత్యంలోని వివిధ ముద్రలను ప్రతిబింబించే కాంస్య విగ్రహాలు అలరిస్తాయి. ఇవన్నీ హేమ మాలినీకి ఉన్న నృత్యాభిమానం, భారతీయ సంస్కృతిపై ప్రేమను తెలియజేస్తాయి.

ధర్మేంద్ర–హేమ మాలినీ కోసం ప్రత్యేకంగా..

ఇంట్లోని విశాలమైన లివింగ్ హాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చెక్క ఫ్లోరింగ్‌తో రూపొందించిన ఈ హాల్‌ను డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం ఉపయోగిస్తారు. ఒకేసారి 30 మంది డ్యాన్సర్లు సాధన చేసేంత విశాలంగా ఇది ఉంటుంది. ఇప్పటికీ హేమ మాలినీ ఇక్కడే తరచూ నృత్య సాధన చేస్తారని ఈషా తెలిపింది. ఇంట్లో మరో ప్రత్యేక ఆకర్షణ ధర్మేంద్ర, హేమ మాలినీ కోసం రూపొందించిన అందమైన కూర్చునే ప్రదేశం. ఈ ప్రాంతంలో వారిద్దరి ఫొటోలు ముద్రించిన కుషన్లు, ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేశారు. కుటుంబానికి ఇది ఎంతో భావోద్వేగపూరితమైన ప్రదేశమని ఈషా పేర్కొంది. హేమ మాలినీ ఇంట్లో ఒక ప్రత్యేక ఆఫీస్ గది కూడా ఉంది. ఇందులో అభిమానులు బహుమతిగా ఇచ్చిన వస్తువులు, పెయింటింగ్స్, అరుదైన ఫొటోలు, ఆమె సినిమాలకు సంబంధించిన జ్ఞాపికలు భద్రపరిచారు.

వరదల తర్వాత భారీ మార్పులు

2005లో ముంబైలో వచ్చిన భారీ వరదల కారణంగా ఈ బంగ్లాకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ఇంటిని పూర్తిగా పునర్నిర్మించి ప్రస్తుతం బహుళ అంతస్తుల భవనంగా మార్చారు. ఇప్పుడు హేమ మాలినీ, ఈషా డియోల్, ఆమె సోదరి కుటుంబాలకు విడివిడిగా అంతస్తులు ఉన్నాయి. ఈ ఇంట్లో రెండు వంటగదులు ఉండటం మరో విశేషం. హేమ మాలినీ కోసం ప్రత్యేక కిచెన్ ఉండగా, అందులోకి ఎవరూ వెళ్లరని ఈషా తెలిపింది. హేమ మాలినీ పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకుంటారు. మరోవైపు కుటుంబ సభ్యులు, అతిథులు, ఈషా పిల్లలు మాంసాహారం తింటారు. అందుకే వారికి వేరే కిచెన్ ఏర్పాటు చేశారు.

ఇల్లు కాదు.. జ్ఞాపకాల నిలయం

ఈషా డియోల్ మాటల్లో చెప్పాలంటే, 'అద్వితీయ' అనేది కేవలం ఒక ఇల్లు కాదు. తరతరాల కుటుంబ జ్ఞాపకాలను, భారతీయ కళా సంస్కృతిని, కుటుంబ బంధాలను సజీవంగా నిలబెట్టిన ఒక ప్రత్యేకమైన నిలయం. ఈ హోమ్ టూర్ ద్వారా హేమ మాలినీ కుటుంబ జీవితం, వారి అభిరుచులు, సంప్రదాయాల గురించి అభిమానులకు అరుదైన సమాచారం తెలిసింది.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 27, 2026 4:10 AM