Telangana Politics: తండ్రీ వర్సెస్ కూతురు.. తెలంగాణలో టీ20ని మించిన సిరీస్..
కేసీఆర్ వర్సెస్ కవిత నడుస్తోంది ప్రస్తుతం. ఆసక్తికరంగా తండ్రీ, కూతుళ్ల మెయిన్ ప్రత్యర్థి సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి ముక్కోణపు సిరీస్‌ను ఏ మ్యాచ్‌లోనూ చూడలేం. టీ 20 అయినా ఇంతటి ఆసక్తిని రేకెత్తిస్తుందో లేదో..
తెలంగాణలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఎక్కడైనా తండ్రికి కూతురే క్వీన్. కూతురికి కూడా తండ్రే హీరే. కానీ తెలంగాణలో రాజకీయాలు తండ్రీకూతుళ్లను ఒకరికొకరు విలన్స్‌గా మార్చేశాయి. నిన్న మొన్నటి వరకూ తెలంగాణ రాజకీయాల్లో అంత ఊపు లేదు కానీ ఒక్కసారిగా కేసీఆర్ రీఎంట్రీ ఇవ్వడం.. అదే సమయంలో కల్వకుంట్ల కవిత తన పార్టీని ప్రకటించేందుకు ముహూర్తాన్ని సిద్ధం చేయడం చకచకా జరిగిపోయాయి. పార్టీనైతే ప్రకటించారు కానీ కవిత నిలబడగలరా?
నిన్న మొన్నటి వరకూ తెలంగాణ రాజకీయాలు కాస్త చప్పగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే కేసీఆర్ ఎంట్రీ ఇచ్చారో ఆసక్తికరంగా మారాయి. తండ్రిపై కవిత చేసిన వ్యాఖ్యలు సైతం మరింత ఆసక్తిని రేకెత్తించాయి. కేసీఆర్ వర్సెస్ కవిత నడుస్తోంది ప్రస్తుతం. ఆసక్తికరంగా తండ్రీ, కూతుళ్ల మెయిన్ ప్రత్యర్థి సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి ముక్కోణపు సిరీస్‌ను ఏ మ్యాచ్‌లోనూ చూడలేం. టీ 20 అయినా ఇంతటి ఆసక్తిని రేకెత్తిస్తుందో లేదో..
సోషల్ మీడియా అంతటా ఆయన మాటలే..
తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరం అని చెప్పేందుకు తండ్రీ, కూతుళ్లు మాత్రమే కారణం కాదు. ఇక్కడ అందరూ మాటల మాంత్రికులే. కేసీఆర్ మాట్లాడుతుంటే శత్రువు సైతం శ్రద్ధగా వింటారు. మరి కవిత ఏమైనా తక్కువా? అంటే ఆమె కూడా అంతే.. తండ్రి అంతటి స్థాయిలో మాట్లాడలేకున్నా.. ఆమె కూడా మెప్పిస్తారు. ఇక రేవంత్ రెడ్డి గురించి చెప్పనక్కర్లే. కేసీఆర్‌కు ఏమాత్రం తీసిపోరు. వాస్తవానికి ఇలాంటి రాజకీయ నేతలు దేశంలో చాలా అరుదు. ఏ రాష్ట్రంలోనైనా ఎవరో ఒకరు మాత్రమే మాటలతో ఆకట్టుకునేలా ఉంటారు. అది అధికారపక్ష నేత కావొచ్చు.. లేదంటే ప్రతిపక్ష నేత కావొచ్చు. కానీ తెలంగాణలో అలా అలవోకగా మాటలను తూటాల మాదిరిగా వదిలేస్తుంటారు. మొన్నటికి మొన్న జగిత్యాలలో కేసీఆర్ సభ పెట్టారు. ఆయన వ్యవసాయం చేశారో లేదో తెలియదు కానీ.. మాటలను మాత్రం జనాల మనసుల్లో బలంగా నాటారు. సోషల్ మీడియా అంతా ఆయన మాటలే హోరెత్తుతున్నాయి.
యువత పరిస్థితేంటి?
రేవంత్‌కు వేసిన కౌంటర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. అదే సభను ఉద్దేశించి కల్వకుంట్ల కవిత.. తండ్రికి ఇచ్చిన కౌంటర్ ఉందే ఎవరైనా వావ్ అనాల్సిందే. జగిత్యాల బిఆర్ఎస్ సభలో 75 ఏళ్ల జీవన్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకుంటూ ఆయనకు 25 ఏళ్ల వయసు తగ్గిందని కేసీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై కవిత స్పందిస్తూ.. 75 ఏళ్ల కురువృద్ధులే నవ యువకులైతే, వారే తెలంగాణకు దిక్కంటే.. మరి రాష్ట్రంలోని యువత పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వారంతా చచ్చిపోయారా? అని ఆమె నిలదీశారు. తెలంగాణలో యువతకు కొరత లేదని, కానీ పార్టీలే వారికి అవకాశాలు ఇవ్వడం లేదని.. తన కొత్త పార్టీలో యువ రక్తానికి ఎలాంటి లోటూ రానివ్వమని తెలిపారు. యువతకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. తండ్రికి కౌంటర్ ఇస్తూనే యువతకు ప్రాధాన్యమిస్తామని ఆమె ప్రకటించారు. రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న యువతకు ఇదో తీపి కబురుగానే చెప్పవచ్చు.
కూతురిని బలి చేశారా?
వాస్తవానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం మహిళలకు ప్రాధాన్యమివ్వలేదు. చివరకు కేసీఆర్.. తన కూతురుకు కూడా ప్రాధాన్యమివ్వలేదు. వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ పార్టీ నుంచి కవితను అయితే సస్పెండ్ చేశారు. చివరకు ఆమె పూర్తిగా కుటుంబానికే దూరమయ్యారు. ఏదిఏమైనా కూతురిని తండ్రి అంత త్వరగా వదులుకోరు. అది కూడా కొడుకు కోసం అసలే వదులుకోరు కానీ కేసీఆర్ మాత్రం కొడుకు కోసం కూతురు బలి చేశారన్న ఆరోపణ ఉంది. ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ కూతురే తండ్రికి గట్టి ప్రత్యర్థిగా మారింది. ఇక మరోవైపు ప్రస్తుతానికైతే తెలంగాణలో బీజేపీ ఉందా? లేదా? అన్నట్టుగా ఉంది పరిస్థితి. కేంద్ర మంత్రి పదవులు ఇవ్వనప్పుడే కాస్త తెలంగాణలో బీజేపీ నేతలు గట్టిగా పని చేశారు. ఎప్పుడైతే కేంద్రమంత్రి పదవులు వచ్చాయో.. వారు హస్తినకు పరిమితమయ్యారు. పదవులు అనుభవిస్తున్న వారే సైలెంట్ అయితే మనకెందుకులే అనుకున్నారో ఏమో కానీ ఇతర బీజేపీ నేతలు సైతం కేవలం ప్రెస్‌మీట్లకు పరిమితమవుతున్నారు. స్ట్రాంగ్ పోరాటమైతే లేదు.
పిట్ట కథలు.. ఉట్టి కథలకు చెక్..
మొత్తానికి ఇప్పటి వరకూ చూస్తే.. కవితక్క తన వంతు పోరాటమైతే గట్టిగానే చేస్తున్నారు. తన పార్టీని ప్రకటించిన తరువాత మరింత స్ట్రాంగ్‌గా దూసుకెళ్లే అవకాశం లేకపోలేదు. మొత్తానికి తెలంగాణలో అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ స్థాయిని ఇప్పటికిప్పుడు కవిత ప్రకటించబోయే కొత్త పార్టీ సాధించలేకపోయినా.. ఓపికగా పోరాట పటిమను సాధిస్తే మాత్రం కాంగ్రెస్ పిట్ట కథలు, బీఆర్ఎస్ ఉట్టి కథలకు చెక్ పెట్టే అవకాశం లేకపోలేదు. ఏప్రిల్ 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో 50 వేల మందితో ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంటోంది. మరి ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది మున్ముందు చూడాలి. ఏదిఏమైనా ఆల్ ది బెస్ట్ కల్వకుంట్ల కవిత.
ప్రజావాణి చీదిరాల