YS Jaganmohan Reddy: మారిన జగన్.. మార్పు మంచికేనా?
రాజకీయాల్లో ఒక్కో అడుగూ ఆచి తూచి వేయాలంటారు. గుడ్డెద్దు చేలో పడిన చందంగా ఎలా పడితే అలా అడుగులు వేస్తూ పోతే దెబ్బవుతుంది. ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది.
రాజకీయాల్లో ఒక్కో అడుగూ ఆచి తూచి వేయాలంటారు. గుడ్డెద్దు చేలో పడిన చందంగా ఎలా పడితే అలా అడుగులు వేస్తూ పోతే దెబ్బవుతుంది. ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఒక్కో అడుగూ ఆయన చాలా జాగ్రత్తగా వేస్తున్నట్టుగా ఆయన ట్వీట్లు చెబుతున్నాయి.
ఇటీవల ఏపీ రాజధానిపై ‘మావిగన్’ అంటూ నానా హంగామా చేసి వైఎస్ జగన్ బాగా ట్రోల్ అయ్యారు. ఇక ఇప్పుడు ఆయన తీరు మారిపోయిందేమో అన్నట్టుగా ఆయన వ్యవహారశైలి ఉంది. మార్పు మంచికే గానీ అది ఎంత కాలం ఉంటుందో తెలియని పరిస్థితి. ఒకవేళ ఇది కొనసాగిందంటే మాత్రం జగన్‌కు ప్రస్తుతమున్న పరిస్థితులు కాస్త మారే అవకాశం ఉంది. లేదంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
అధికార పక్షమా? విపక్షమా?
అసలు విషయంలోకి వెళితే.. మావిగన్ విషయంలో జరిగిన రచ్చో.. మరొకటో కానీ జగన్‌లో మార్పు అయితే తీసుకొచ్చిందనే టాక్ ప్రస్తుతం ఏపీలో గట్టిగా నడుస్తోంది. దీనికి కారణం.. జగన్ చేసిన ట్వీట్లు. అవి మూడు చాలా ఆసక్తికరమైనవి. ఒకటి అయితే పెద్దగా చర్చించుకోవల్సింది కాదులే కానీ మిగిలిన రెండు మాత్రం ఆశ్చర్యానికే ఆశ్చర్యం వేసే ట్వీట్లు. ఇక మొదటి ట్వీట్ విషయానికి వస్తే.. మోదీ ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. ఆ బిల్లుకి వైసీపీ మద్దతిచ్చింది. జగన్ ఆది నుంచి అధికారంలో ఉన్నా.. లేకున్నా మోదీ ప్రభుత్వానికి మద్దతుగానే నిలిచారు. దీనికి కారణం ఆయన కేసులేనని చెబుతారు. ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షానికి మద్దతు ఇవ్వడంతో జగన్ సోదరి వైఎస్ షర్మిలారెడ్డి సైతం ఆయనను ఏకిపారేశారు. అయితే జగన్ అంతటితో ఆగారా? బిల్లు వీగినందుకు కారణమైన పార్టీలన్నింటినీ ట్విటర్ వేదికగా విమర్శించారు. అసలీయన అధికార పక్షమా? విపక్షమా? ఎవరికీ అర్థం కాకుండా ఉంది.
క్షణాల్లో వైరల్..
ఇక రెండవ ట్వీట్ అత్యంత ఆసక్తికరం.. అదేంటంటే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తాజాగా సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయమై జగన్ ట్వీట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారారు. పవన్‌ను నిన్న మొన్నటి వరకూ నానా రకాలుగా తూలనాడిన జగన్.. తొలిసారిగా పవన్ ఆరోగ్యం బాగుండాలని తిరిగి వేగంగా కోలుకుని ప్రజా సేవకు అంకితం కావాలని ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. జగన్ ఇలా ట్వీట్ చేశారో లేదో అలా క్షణాల్లో పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది. దానిని చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. వాస్తవానికి పవన్ హెల్త్ బాగుండాలని ఎంతో మంది ట్వీట్ చేశారు కానీ జగన్ చేసిన ట్వీటే సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని షేక్ చేసింది. అసలు ఓ రాజకీయ నాయకుడిగానే పవన్‌ను పరిగణించని జగన్ ఏకంగా.. ఆయన త్వరగా కోలుకుని ప్రజా సేవలో అంకితం కావాలని కోరడం ఆసక్తికరంగా మారింది.
స్ట్రాటజీ మార్చేశారా?
అంతటితో జగన్ ఆగారా? ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి హాట్ టాపిక్‌గా మారారు. ప్రపంచమంతా ట్వీట్ చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు కానీ జగన్ శుభాకాంక్షలు చెప్పడం మాత్రం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురి చేసింది. జన్మదిన శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా.. ఆయన ఆరోగ్యంగా ఉండాలని సైతం జగన్ అభిలషించారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్.. ఇప్పుడు ఇలా ఆయన శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా ఆరోగ్యంగా ఉండాలని కోరడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదంతా చూస్తుంటే జగన్ తన స్ట్రాటజీ మార్చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ తాను అవలంబించిన మార్గం మంచిది కాదని భావించారో.. లేదంటే ఇలా వెళితే జనం దృష్టిలో మరింత దిగజారుతామనుకున్నారో కానీ జగన్ మాత్రం మారిపోయారు.