Politics

KCR: కూతురుతో పార్టీ పెట్టించి టీఆర్ఎస్‌ను కేసీఆర్ నిలబెట్టుకున్నారా?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని అంటారు. అలాంటిది తండ్రీకూతుళ్లే రాజకీయ విరోధులైతే.. ఆ విరోధం ఎంతకాలం.. అసలు ఆ విరోధంలో నిజమెంత? పేరులో ఏముంది? అంటారు కొందరు.. కానీ పేరులోనే ఉన్నదంతా అని చాలా మంది చెబుతారు.

KCR: కూతురుతో పార్టీ పెట్టించి టీఆర్ఎస్‌ను కేసీఆర్ నిలబెట్టుకున్నారా?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని అంటారు. అలాంటిది తండ్రీకూతుళ్లే రాజకీయ విరోధులైతే.. ఆ విరోధం ఎంతకాలం.. అసలు ఆ విరోధంలో నిజమెంత? పేరులో ఏముంది? అంటారు కొందరు.. కానీ పేరులోనే ఉన్నదంతా అని చాలా మంది చెబుతారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత గులాబీ నేతలు ఏం కోల్పోయారో ప్రత్యేకంగా చెప్పాలా?

తెలంగాణ పోరాట సమయంలో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఎవరు ఏ సవాల్ విసిరినా రాజీనామా చేయడం.. తిరిగి పోటీ చేయడం అలా ఎన్ని సార్లు పోటీ చేసినా కూడా గులాబీ నేతలు గెలిచారు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల పాటు అధికారం చెలాయించారు. ఆ సమయంలో కేసీఆర్.. తన పార్టీని జాతీయ స్థాయికి విస్తరించాలనుకున్నారు. కట్ చేస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)ను కాస్తా భారత రాష్ట్ర సమితి (BRS)గా మార్చారు.

తుగ్లక్ గుర్తొచ్చారేమో..

మార్పు మంచికేనంటారు. కానీ గులాబీ బాస్ తీసుకున్న మార్పు నిర్ణయం మాత్రం పార్టీని ముంచేది అయ్యింది. పేరు మార్పుతో పార్టీ పతనం ఆరంభమైంది. ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. తద్వారా పూర్తిగా నేలమట్టమైంది. ఆ తరువాత కేసీఆర్ తన తప్పును గ్రహించారని.. పార్టీకి తిరిగి టీఆర్ఎస్‌గా పేరు మార్చనున్నారంటూ టాక్ నడిచింది. కానీ అది జరగలేదు. ఒకప్పుడు ఢిల్లీ - దౌలతాబాద్.. ఆ తరువాత దౌలతాబాద్ - ఢిల్లీకి రాజధానులను మార్చిన మహ్మద్ బిన్ తుగ్లక్ గుర్తొచ్చారో ఏమో కానీ.. కేసీఆర్ తన నిర్ణయాన్ని విరమించుకున్నారని చర్చ నడిచింది. సీన్ కట్ చేస్తే తాజాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత తన పార్టీ పేరును ప్రకటించారు. అదే టీఆర్ఎస్. అంటే తెలంగాణ రాష్ట్ర సేన.

అదే వాస్తవం..

పార్టీ పేరు ప్రకటించి కవిత అందరికీ షాకిచ్చారు. అంతేకాకుండా పెద్ద చర్చకు కారణమయ్యారు. కొందరు తన తండ్రి కేసీఆర్‌కు కవిత తన పార్టీ పేరుతో షాకిచ్చారు.. గట్టి దెబ్బ కొట్టారంటుంటే.. మరికొందరు మాత్రం వింత వాదనను తెరపైకి తీసుకొచ్చారు. కవిత తన పార్టీ పేరు టీఆర్ఎస్‌గా పెట్టడం చూస్తుంటే దీని వెనుక ఏదో గట్టి స్కెచ్చే ఉందని అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు తర్వాత జరిగిన నష్టాన్ని గ్రహించిన కేసీఆరే కూతురితో స్ట్రాటజికల్‌గా అదే పేరుతో పార్టీ పెట్టించారని అంటున్నారు. పార్టీ ఓటమి తర్వాతే ఇంట్లోని టీ కప్పులో తుఫాన్ చెలరేగిందనే టాక్ నడుస్తోంది. అది వాస్తవం కూడా. కానీ కేసీఆర్.. తన కూతురిని పార్టీ నుంచి గెంటేయించేంత పెద్ద డెసిషన్ తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ఆ దెబ్బకు కవిత కుటుంబాన్ని సైతం వీడారు.

ఓట్లను చీల్చితే..

అక్కడి నుంచి కొంతకాలం పాటు కవిత తన కుటుంబంపై పెద్దగా విమర్శలు గుప్పించలేదు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం తండ్రి, సోదరుడిని కూడా టార్గెట్ చేయడం ఆరంభించారు. ఇదంతా ఒక స్ట్రాటజీ ప్రకారమే జరిగిందని తాజాగా అంటే ఆమె పార్టీ ప్రకటించినప్పటి నుంచి టాక్ నడుస్తోంది. దీనికి రెండు కారణాలున్నాయని అంటున్నారు. ఒకటి తన టీఆర్ఎస్ పార్టీని నిలబెట్టుకోవడం ఒకటైతే.. మరొకటి.. ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం కూడా లేదు కాబట్టి ఈ లోగా కవిత జనాల్లోకి వెళ్లి ఓట్లను చీల్చగలిగితే బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరవచ్చన్న భావన కూడా ఒక కారణం కావొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ స్ట్రాటజీని జనాలతో గట్టిగా నమ్మించేందుకే కవిత అధికార కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ తన పార్టీ ప్రకటన కార్యక్రమంలో బీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారన్న వాదన వినిపిస్తోంది. మరి దీనిలో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 26, 2026 2:20 PM