Entertainment

ట్రాన్స్‌జెండర్, గేల జీవితాలపై తీసిన కోర్ట్ డ్రామా ‘ఎల్‌జీబీటీ’: సునీల్ కుమార్ రెడ్డి

ట్రాన్స్‌జెండర్, గేల జీవితాలపై తీసిన కోర్ట్ డ్రామా ‘ఎల్‌జీబీటీ - ఎ లీగల్ బ్యాటిల్. సామాజిక ఇతివృత్తాల నేపథ్యంలో చిత్రాలను రూపొందించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించారు.

ట్రాన్స్‌జెండర్, గేల జీవితాలపై తీసిన కోర్ట్ డ్రామా ‘ఎల్‌జీబీటీ’: సునీల్ కుమార్ రెడ్డి

ట్రాన్స్‌జెండర్, గేల జీవితాలపై తీసిన కోర్ట్ డ్రామా ‘ఎల్‌జీబీటీ - ఎ లీగల్ బ్యాటిల్. సామాజిక ఇతివృత్తాల నేపథ్యంలో చిత్రాలను రూపొందించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎల్‌బీ శ్రీరామ్, ఎస్తర్ నార్నోన్హ, రాజు ఖేర్, ఆనంద చక్రపాణి, ప్రీతీ నిగమ్‌తో పాటు రియల్ ట్రాన్స్‌జెండర్ యాక్టర్స్ ప్రధాన పాత్రలు పోషించారు. హిమ రాథోడ్ హీరోయిన్‌గా, చంద్రముఖి, లైలా వంటి ప్రముఖ యాక్టివిస్టులు, గే యాక్టివిస్ట్ విష్ణు తేజ చాలా పరిణితితో నటించారు. ఈ సినిమా ఈ నెల 19న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ రోజు హైదరాబాద్‌లో ఈ మూవీ టీమ్ మీడియాతో ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లైలా మాట్లాడుతూ.. తమ హక్కుల కోసం ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నామని.. కానీ సరైన వేదిక ఎక్కడా లభించలేదన్నారు. డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి తమ సమస్యల ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందించడం హ్యాపీగా ఉందన్నారు. తాము నటులము కామని.. కానీ తమ జీవితంలో మేము ఎలా ఉంటామో అలాంటి పాత్రలనే డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ చిత్రంలో తెరకెక్కించారన్నారు. ఈ సినిమాలో తమ నిజ జీవిత పాత్రలనే పోషించినట్టు లైలా తెలిపారు.

గే కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్ విష్ణు మాట్లాడుతూ.. గే కమ్యూనిటీ కోసం దాదాపు 12 ఏళ్లుగా పోరాడుతున్నామన్నారు. మన సినిమాల్లో గే క్యారెక్టర్స్‌ను కామెడీ కోసం ఉపయోగించడం చూశామని.. కానీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌కు వచ్చే అనేక చిత్రాల్లో ఎంతో డెప్త్‌గా గే కమ్యూనిటీ సమస్యలను తెరకెక్కించడం తాను గమనించినట్టుగా పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో గే లైఫ్ మీద ఇన్ డెప్త్ మూవీస్ సీరియస్ అప్రోచ్‌తో వచ్చాయని.. ఆ సినిమాల వల్ల అక్కడి సమాజం గే కమ్యూనిటీని చూసే విధానం మారిపోయిందన్నారు. తెలుగులో ఫస్ట్ టైమ్ అలాంటి ప్రయత్నం డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి చేస్తున్నారని.. ఆయన తమతో ట్రావెల్ చేసి మా జీవితాన్ని దగ్గరగా గమనించారన్నారు.

ట్రాన్స్‌జెండర్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సనా ఖాన్ మాట్లాడుతూ.. మా జీవితాలు ఎలా ఉంటాయనేది చాలా మందికి తెలియదన్నారు. బయట ప్రపంచం చూడని మా జీవిత ప్రయాణాన్ని, మా సమస్యలు, భావోద్వేగాలను ఈ చిత్రంలో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి చూపించారన్నారు. ట్రాన్స్‌‌జెంటర్ ఇన్ స్టాగ్రామ్ యాక్టివిస్ట్ హీరోయిన్ హిమ రాథోడ్ మాట్లాడుతూ.. ఈ మూవీతో మమ్మల్ని సమాజం చూసే తీరు మారుతుందని, తమపై అందరిలో ఉన్న అపోహలు తొలగిపోతాయని ఆశిస్తున్నట్టుగా పేర్కొన్నారు. తాము జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లను నా పాత్ర ద్వారా దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి చూపించారన్నారు.

డైరెక్టర్ పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సమానత్వం ఉందని చెప్పుకునే మన దేశంలో ట్రాన్స్‌జెండర్స్ విషయంలో తీవ్రమైన వివక్ష ఎదురవుతోందన్నారు. ట్రాన్స్‌జెండర్స్ మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయని... కానీ అవి పోలీస్ స్టేషన్లలో కేసులుగా నమోదు కావడం లేదన్నారు. కోర్టుల దాకా వెళ్లి జడ్జిమెంట్ పొంది శిక్షలు పడటం లేదన్నారు. ఇప్పటిదాకా ఒక్క ట్రాన్స్‌జెండర్ కేసు కూడా ఏ కోర్టులోనూ తుది తీర్పు వచ్చి శిక్ష పడలేదని సునీల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదన్నారు. ఫస్ట్ టైమ్ మన సినిమాలోనే ఒక ట్రాన్స్‌జెండర్ కేసులో పూర్తి న్యాయం జరిగినట్లు చూపిస్తున్నామన్నారు. ఈ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని.. అలాగే సీరియస్ ఇష్యూస్ చెబుతున్నామన్నారు. కేవలం మల్టిఫ్లెక్స్‌ల్లో మాత్రమే ఈ నెల 19న మా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామన్నారు. మీ ఆదరణ ఉంటే సింగిల్ స్క్రీన్స్‌లోనూ రిలీజ్ చేస్తామన్నారు. తెలుగు వెర్షన్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో సినిమా ఉంటుందన్నారు. పుణెలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో తమ సినిమాకు బెస్ట్ ఫిలిం అవార్డ్ దక్కిందన్నారు. ఫిలిం ఫెస్టివల్స్‌కు మాత్రమే ఇలాంటి సినిమాలు పరిమితం కావొద్దన్నారు. గే అండ్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ గురించి నేను చేసిన చిత్రమిదని.. సెన్సార్ విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నామని సునీల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 10, 2026 4:43 PM