Kalvakuntla Kavitha: ఫోన్ మాట్లాడాలంటే భయం.. దారుణమైన నిఘా నీడలో బతికాం
ఇసుక దందా మీద ప్రేమతో దళితుల చావులను సైతం చూశామని కవిత అన్నారు. ఫోన్ మాట్లాడాలంటే భయపడ్డామని... దారుణమైన నిఘా నీడలో మనం బతికామన్నారు. మనం అనుకున్న తెలంగాణ రాలేదని.. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నానని పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన పార్టీ పేరు టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన)గా ప్రకటించారు. అనంతరం జరిగిన సభలో కవిత మాట్లాడుతూ.. దాదాపుగా బీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారు. జాగృతి ఆడబిడ్డల చేతిలో కాగడ అయ్యిందని.. మన సంస్కృతి గురించి చెప్పుకోవటానికి బతుకమ్మ వచ్చాక బలం వచ్చిందన్నారు. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం కానీ మనం కలలు కన్న తెలంగాణ మాత్రం రాలేదని కవిత పేర్కొన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పి.. సామాజిక రథ చక్రం విరిగి ముక్కలైందన్నారు. ఏ తరహాలో పనిచేయాలో అలా జరగలేదని చెప్పటానికి బాధగా ఉందన్నారు.
ఆ కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా..
ఇసుక దందా మీద ప్రేమతో దళితుల చావులను సైతం చూశామని కవిత అన్నారు. ఫోన్ మాట్లాడాలంటే భయపడ్డామని... దారుణమైన నిఘా నీడలో మనం బతికామన్నారు. మనం అనుకున్న తెలంగాణ రాలేదని.. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నానని పేర్కొన్నారు. తన తప్పులకు భాగస్వామ్యం ఉందన్న దానికి కేవలం క్షమాపణ చెబితే సరిపోదన్నారు. ఆ తప్పులను దిద్దుకోవటానికి కష్టపడి పనిచేయాలన్నారు. అందుకోసమే మేము తెలంగాణ రాష్ట్ర సేనగా వస్తున్నామన్నారు. పోరాటాలకు రాజకీయ శక్తి, అధికారం ఉంటే ఇంకా బాగా పనిచేయవచ్చన్నారు. అందుకోసమే ఈ పార్టీ మీ ముందుకు వచ్చిందన్నారు.
తెలంగాణ ఆత్మను కోల్పోయింది..
రాజకీయ పార్టీకి రాజకీయ ఆత్మ, అజెండా ఉండాలని కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చిందన్నారు. తెలంగాణలోని మూడు కోట్ల మందికి ఒక అమ్మలాగా పరిణితి చెందాలని అనుకుంటున్నానని.. అమ్మతనంతో పాలన జరిపితే కష్టాలు తీరుతాయన్నారు.
రైతాంగ పోరాటం, ముల్కీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఇలా తెలంగాణలో ఏదో ఒక పోరు సాగుతూనే ఉందన్నారు. బీజేపీకి తెలంగాణ రావడమే ఇష్టం లేదని.. తల్లిని చంపి బిడ్డను తీశారని బీజేపీ పెద్దలు అంటున్నారని అన్నారు. మెడకాయ మీద తలకాయ లేని ఒక ఎంపీ తెలంగాణను భారత్ పాక్ విభజనతో పోల్చుతారని.. అగ్రనాయకత్వం అలా మాట్లాడినా కూడా బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరని విమర్శించారు.