others

ఇంటర్ విద్యార్థులకు నయా రూల్.. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు చుక్కలే..

ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట కేవలం పుస్తకాల్లోని బొమ్మలు చూసి లెస్సన్ నేర్చుకుంటానంటే కుదరదు. తప్పనిసరిగా వారానికి రెండు రోజుల పాటు..

ఇంటర్ విద్యార్థులకు నయా రూల్.. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు చుక్కలే..

ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట కేవలం పుస్తకాల్లోని బొమ్మలు చూసి లెస్సన్ నేర్చుకుంటానంటే కుదరదు. తప్పనిసరిగా వారానికి రెండు రోజుల పాటు ల్యాబ్‌కి అటెండ్ అయ్యి ప్రయోగాలు చేయాల్సిందే. ఇంటర్ బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకోవడానికి ఓ కారణముంది. అదేంటంటే.. సైన్స్ సబ్జెక్టుల్లో విద్యార్థులకు క్షేత్రస్థాయి జ్ఞానాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ల్యాబ్ ప్రయోగాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ర్యాంకులే లక్ష్యంగా కేవలం థియరీ పాఠాలతోనే నెట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే అందిన ఫిర్యాదుల నేపథ్యంలో, ఈ విద్యా సంవత్సరం నుంచే అన్ని కాలేజీల్లో ప్రాక్టికల్స్‌ను ఇంటర్ బోర్డు తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ కూడా త్వరలోనే వెలువడనున్నాయి.

పట్టించుకోని ప్రైవేటు కాలేజీలు..

రాష్ట్రంలో మొత్తంగా 3,339 ఇంటర్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో దాదాపు 7 లక్షల మంది సైన్స్ గ్రూపులకు చెందినవారే. సైన్స్ విద్యార్థులకు వారానికి ఏడు పీరియడ్లు ఉంటే, అందులో ఒక పీరియడ్‌ను ప్రాక్టికల్స్‌కు కేటాయించాల్సి ఉంది. కానీ ఏ ప్రైవేటు కాలేజీ మేనేజ్మెంట్ కూడా దీనిని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సమయాన్నంతా థియరీని విద్యార్థుల మెదళ్లలోకి ఎక్కించేందుకు మాత్రమే వినియోగిస్తున్నారు. దీనికి కారణం ప్రాక్టికల్ మార్కులనేవి వారి చేతిలో ఉండటమే. కొన్ని కాలేజీలు కేవలం సెకండియర్ చివరిలో ప్రాక్టికల్స్ ప్రాక్టీస్ చేయించి సరిపెట్టేవి. కానీ ఇప్పుడు ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. దీంతో కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల అక్రమాలకు చెక్ పడే అవకాశం ఉంది.

ఇంటర్ మార్కులకే కాదు..

ఇక మీదట థియరీ క్లాసులో నేర్చుకున్న అంశాలను అదే వారంలో ల్యాబ్‌లో ప్రయోగం చేయాల్సి ఉంది. దీనికోసం కొత్త షెడ్యూల్ కూడా రూపొందుతోంది. సెక్షన్లు, విద్యార్థుల సంఖ్యను బట్టి వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ల్యాబ్ సెషన్లు ఉండనున్నాయి. ఇంటర్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులకు ఒక గొప్ప వరం కాగా.. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు కంటగింపుగా మారనుంది. స్టూడెంట్లలో బట్టీ విధానం వల్ల కాన్సెప్టులపై ఏమాత్రం అవగాహన ఉండటం లేదు. స్వయంగా ప్రయోగాలు చేస్తే సబ్జెక్టుపై పట్టు పెరుగుతుందనేది నిపుణుల వాదన. ఇది కేవలం ఇంటర్ మార్కులకే పరిమితం కాదు. ఆ తరువాత పోటీ పరీక్షలైన నీట్, జేఈఈ లో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు దోహదపడనుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఇంటర్ కాలేజీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తదితర ల్యాబ్‌లు ఉండాలి. కానీ ప్రైవేటు కాలేజీల్లో ఏవో చిన్న గదులను ల్యాబ్‌లకు కేటాయిస్తున్నాయి. కనీసం ల్యాబ్ సౌకర్యాలు కూడా ఉండటం లేదు. కొన్ని కాలేజీలైతే మరీ దారుణం కనీసం ల్యాబ్ రూమ్ అనేదే ఉండటం లేదు. అలాంటి కాలేజీలపై ఇక మీదట ఇంటర్ బోర్డు ఉక్కుపాదం మోపనుంది.

లైవ్‌లో మానిటర్..

కాలేజీలు బోర్డు రూల్స్ పాటిస్తున్నాయా.. లేదా? అనే విషయంపై ఇంటర్ బోర్డు నిఘా పెట్టనుంది. దీనిని తెలుసుకునేందుకు అధికారులు టెక్నాలజీని వాడనున్నారు. రాష్ట్రంలోని అన్ని ఇంటర్ కాలేజీల సీసీ కెమెరాలను ఇప్పటికే ఇంటర్ బోర్డు కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో లింక్ చేయడం జరిగింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రాక్టికల్స్ జరుగుతున్నాయా.. లేదా? అనేది పరిశీలించనుంది. అలాగే విద్యార్థులు ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తున్నారా? అనే అంశాలను సైతం బోర్డు అధికారులు లైవ్‌లో మానిటర్ చేయనున్నారు. ఒకవేళ సీసీ కెమెరాల్లో ప్రాక్టికల్స్ నిర్వహణ కనిపించకపోయినా కూడా ఉపేక్షించేది లేదు. సంబంధిత కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు బోర్డు సిద్ధమవుతోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన గైడ్‌లైన్స్ వారం, పది రోజుల్లోనే విడుదల కానున్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఇన్నాళ్లకు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల అక్రమాలకు చెక్ పడనుంది. ఏదైనా లోపం ఉందంటే ఆయా కాలేజీలకు ఇంటర్ బోర్డు చుక్కలు చూపించనుంది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 30, 2026 4:23 AM