ఆ 14 వర్షాభావ రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు.. పరిస్థితి దారుణం..
ఈ ఏడాది వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జూలై వస్తున్నా కూడా వాతావరణం అయితే కూల్ అయ్యింది కానీ పట్టుమని పెద్ద వర్షం కురిసిందే లేదు. అందునా తెలుగు రాష్ట్రాలకు ఏమైందో ఏమో కానీ మరింత ఇబ్బందికరంగా తయారైంది.
ఈ ఏడాది వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జూలై వస్తున్నా కూడా వాతావరణం అయితే కూల్ అయ్యింది కానీ పట్టుమని పెద్ద వర్షం కురిసిందే లేదు. అందునా తెలుగు రాష్ట్రాలకు ఏమైందో ఏమో కానీ మరింత ఇబ్బందికరంగా తయారైంది. దేశం మొత్తమ్మీద 14 రాష్ట్రాల్లోవర్షాభావ పరిస్థితులున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ స్వయంగా చెప్పారు. తాజాగా ఢిల్లీలో నిర్వహించిన ‘రాష్ట్రీయ్ వికాస్ గ్రామీణ్ సమ్మేళన్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 14 రాష్ట్రాల్లోని 315 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం చాలా తక్కువగా ఉందన్నారు. వాటిలోని 111 జిల్లాలైతే తీవ్ర క్షామాన్ని ఎదుర్కోవాల్సి ఉందట. ఈ రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండటం విశేషం. తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, యపీ, రాజస్తాన్, కర్నాటక, బీహార్, జార్ఖండ్, పంజాబ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనున్నాయి.
రుతుపవనాలు పుంజుకుంటున్నా..
తప్పనిసరిగా ఆయా రాష్ట్రాలు జల సంరక్షణ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చిన్న చిన్న కుంటలు, చెరువులను కాపాడుకోవాల్సి ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన స్కీం అమలుకు తాను సిద్ధంగా ఉన్నట్లు శివరాజ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే.. రాష్ట్రంలో పలు రోడ్లకు పర్యావరణ అనుమతులు అవసరం ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రితో చర్చించేందుకు తాము సిద్ధమని కేంద్రమంత్రి తెలిపారు. రుతుపవనాలు పుంజుకుంటున్నాయి కానీ వర్షాలనేవి మాత్రం కురవడం లేదు. వారం క్రితం వరకూ ఎక్కడికక్కడే రుతుపవనాలు స్తంభించిపోయాయి. దీంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తీవ్రమైన లోటు ఉంది.
తెలంగాణలో ఆ జిల్లా మరింత దారుణం..
తెలంగాణలో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ ఎల్లో అలర్ట్‌ను కూడా జారీ చేసింది. తీరా చూస్తే తేలికపాటి జల్లులు మినహా ఎక్కడా కూడా భారీ వర్షమనేదే లేదు. ఇక హనుమకొండ జిల్లాలో తీవ్ర అనావృష్టి నెలకొంది. ఈ జిల్లాలో 72 శాతం లోటు వర్షపాతం నమోదవగా.. ఆ తర్వాత వరంగల్( 57 శాతం), సిద్దిపేట(50), మేడ్చల్ మల్కాజ్గిరి(39), నిజామాబాద్ (35), ఆదిలాబాద్ (32), జోగులాంబ గద్వాల్ (30), కరీంనగర్ ( 29), యాదాద్రి భువనగిరి(29), మంచిర్యాల(28), జగిత్యాల(28), జనగామ(27), మెదక్, రాజన్న సిరిసిల్ల (26), వనపర్తి(23), కామారెడ్డి(22 ) జిల్లాల్లో లోటు వర్షపాతం రికార్డయ్యింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.