Bunny Vas: పెద్ద హీరోలే ప్రధాన కారణం.. బన్నీ వాస్ ఫైర్
సినిమా అంటే ఏ ఒక్కరిదో కాదు... దానిపై కొన్ని వందల మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. అది బాగా ఆడితే అందరికీ పేరొస్తుంది. లేదంటే అందరి జీవితాలు ప్రశ్నార్థకమై పోతాయి. ప్రస్తుత తరుణంలో ప్రేక్షకులు థియేటర్ వైపు చూడటమే మానేశారు.
సినిమా అంటే ఏ ఒక్కరిదో కాదు... దానిపై కొన్ని వందల మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. అది బాగా ఆడితే అందరికీ పేరొస్తుంది. లేదంటే అందరి జీవితాలు ప్రశ్నార్థకమై పోతాయి. ప్రస్తుత తరుణంలో ప్రేక్షకులు థియేటర్ వైపు చూడటమే మానేశారు. దీనిపై నిర్మాతలు స్పందించడమే లేదు. అసలు కారణాలేంటో అన్వేషించిన పాపాన పోవడం లేదు. ఇన్నాళ్లకు ఓ నిర్మాత అసలు సమస్యలను గుర్తించారు.
ఆయన మరెవరో కాదు బన్నీ వాస్. ఒకప్పుడు సినిమాపై రూపాయి వచ్చేదని.. కానీ ఇప్పుడు పావలా కోసం పోరాడుతున్నామంటూ కుండ బద్దలు కొట్టేశారు. పెద్ద సినిమాల ఆదాయమైతే రూపాయి నుంచి అర్ధరూపాయికి పడిపోయిందన్నారు. అసలు దీనికి కారణాలేంటి? ఒకప్పుడు రాజభోగం అనుభవించిన సినిమా నేడెందుకు అంతలా కష్టపడుతోంది. వాటన్నింటినీ అద్భుతంగా విశ్లేషించి ట్విటర్ వేదికగా బన్నీవాస్ ఒక పోస్ట్ పెట్టారు.
ప్రేక్షకుల పైనే అధిక భారం..
ఈరోజు సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తుండటాన్ని మనం చూస్తున్నామని... కానీ ఆ కలెక్షన్లు నిజంగా ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కాదని బన్నీవాస్ తేల్చేశారు. ఆ కలెక్షన్స్ అన్నీ కేవలం టికెట్ రేట్లు, ఇతర ధరలు పెరగడం వల్ల వచ్చినవని అర్థం చేసుకోవాలన్నారు. అంటే, సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం తగ్గిపోయిందని.. వచ్చే కొద్దిమంది ప్రేక్షకుల మీదే అధిక భారం వేసి వసూళ్లు పెంచుకుంటున్నామన్నారు. దాన్నే భారీ కలెక్షన్లు అని చెప్పుకోవడం కన్నా పెద్ద తెలివి తక్కువతనం మరొకటి ఉండదని అన్నారు. చిన్న సినిమాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని.. వారి ఆదాయం పావలా స్థాయికి పడిపోయిందన్నారు. ఇప్పుడు ఆ పావలాలో ఎవరు ఎంత తీసుకోవాలి అని మనం కొట్టుకుంటున్నాం కానీ, అసలు మన రూపాయి ఆదాయం ఎందుకు పోయిందనేది మాత్రం ఆలోచించడం లేదన్నారు.
ఇక్కడ నిర్మాతలతో పాటు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు కూడా నష్టపోతున్నారని... ఇందులో ఎలాంటి సందేహమూ లేదని బన్నీ వాస్ అన్నారు. కానీ ఈ పరిస్థితికి అసలు మూలకారణం ఏమిటనేది ఎవరైనా గుర్తించారా? అన్నారు. ఉన్న ఆదాయంలో ఎవరు ఎంత పంచుకోవాలి అని వాదించుకోవడం కంటే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది గుర్తించి దాన్ని సరిచేసుకోవడం ముఖ్యమా కాదా? అని ప్రశ్నించారు. అలాగే తన అభిప్రాయం ప్రకారం దీనికి ప్రధాన కారణాలను సైతం బన్నీ వాస్ వివరించారు.
అసలు కారణాలు..
1. హీరోలు సినిమాలు పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకోవడం సమస్యకు ప్రధాన కారణంగా బన్నీ వాస్ పేర్కొన్నారు. సగటు ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావడంలో హీరోల పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. ఎవరు అవునన్నా, కాదన్నా ఇది నిజమన్నారు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడంలో హీరోల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. అలాంటి ఇండస్ట్రీలో హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మాత్రమే చేస్తే, ప్రేక్షకుడికి సినిమాలపై ఆసక్తి క్రమంగా తగ్గిపోతుందని... దాని ప్రభావం కేవలం పెద్ద సినిమాలపైనే కాదు, చిన్న సినిమాల మీద కూడా పడుతుందన్నారు.
2. సినిమాలను కేవలం 27 రోజుల్లోనే ఓటీటీలో విడుదల చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోతోందని బన్నీ వాస్ పేర్కొన్నారు.
3. ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి కంటెంట్ లేకపోవడంతో పాటు.. “ఇంత ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరమా?” అనే భావన ప్రేక్షకుల్లో రావడం కూడా ఒక కారణమేనన్నారు.
4. మల్టీప్లెక్సుల్లో అధిక క్యాంటీన్ ధరలు కూడా ప్రేక్షకులు తియేటర్ వైపు చూడకపోవడానికి ఒక కారణంగా పేర్కొన్నారు.
ఈ నాలుగు కారణాల్లో మూడు కారణాలు మన చేతిలోనే ఉన్నాయని... కంటెంట్ విషయం మాత్రమే పూర్తిగా మన నియంత్రణలో ఉండదని బన్నీ వాస్ పేర్కొన్నారు. ఈ మూడు అంశాలను సరిచేయకుండా, ఎంత శాతం పంచుకోవాలి అని వాదించుకున్నా ఉపయోగం లేదని తేల్చేశారు. రేపు వచ్చే ఆ పావలా ఆదాయంలో ఎవరు ఎంత తీసుకోవాలి అని కొట్టుకోవడం తప్ప, దాంతో ఎవరికీ నిజమైన లాభం ఉండదని స్పష్టం చేశారు. మూల సమస్యను సరిచేయకుండా, ఇప్పటికే తగ్గిపోయిన ఆదాయం మీదే పోరాడటం వల్ల ఏం లాభం చేకూరుతుందని బన్నీ వాస్ ప్రశ్నించారు.
ప్రజావాణి చీదిరాల