Happy Journey First look: కొన్ని ట్రిప్స్ మన ప్లాన్స్ మారిస్తే.. మరికొన్ని జీవితాన్నే..
హ్యాపీ జర్నీ అనేది కేవలం ఒక ట్రావెల్ కథ మాత్రమే కాదని తెలుస్తోంది. మహిళల భావాలు, అనుబంధాలు, జీవిత మార్పులు, ఆత్మీయతలపై సాగే హృద్యమైన ప్రయాణంగా మేకర్స్ రూపొందిస్తున్నారు.
గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న హార్ట్ వార్మింగ్ ఎమోషనల్ డ్రామా ‘హ్యాపీ జర్నీ’. ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. అభిరామ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహిళా భావోద్వేగాల ఆధారంగా రూపొందుతోంది. బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు పృధ్వీ దండమూడి, వంశీధర్ గౌడ్, రవి శివతేజ పైలా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
చిత్రంలోని ప్రతి పాత్రను ఎంతో సహజంగా, భావోద్వేగాలకు దగ్గరగా తీర్చిదిద్దారు. తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో పారిస్‌లోని ప్రసిద్ధ లూవ్రే పిరమిడ్, ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్, సాఫ్ట్ సన్‌సెట్ కనిపిస్తున్నాయి. ఇక భిన్నతరాలకు చెందిన మహిళలు, కొంతమంది యువకులు కలిసి కనిపిస్తున్నారు. స్నేహం, ఆప్యాయత, జీవితాన్ని ఆస్వాదించే జర్నీగా ఈ సినిమా రూపొందుతోంది. “Some trips change plans… Some change lives (కొన్ని ట్రిప్స్ మన ప్లాన్స్‌ను మారిస్తే.. మరికొన్ని ట్రిప్స్ జీవితాన్ని మర్చేస్తాయి)” అనే ట్యాగ్‌లైన్ లైఫ్ ఎమోషన్స్ చుట్టూ తిరుగుతోందని సూచిస్తోంది.
హ్యాపీ జర్నీ అనేది కేవలం ఒక ట్రావెల్ కథ మాత్రమే కాదని తెలుస్తోంది. మహిళల భావాలు, అనుబంధాలు, జీవిత మార్పులు, ఆత్మీయతలపై సాగే హృద్యమైన ప్రయాణంగా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ ఏడుగురు మహిళలు తమ తమ భావోద్వేగ ప్రపంచాలతో ఈ ప్రయాణంలో అడుగుపెట్టి, ఊహించని మార్పులను ఎక్స్ పీరియన్స్ చేస్తారు. ఈ సినిమాను యూరప్‌లోని పారిస్, మాంట్‌పెలియర్ వంటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు. సినిమాలోని మహిళల భావోద్వేగాలు మన జీవితాలకు దగ్గరగా, సహజంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. పాత్రల మధ్య కెమిస్ట్రీ, సంభాషణలు, ఎమోషన్స్ అన్నీ ఎంతో సహజంగా ఉండనున్నాయి. ఫస్ట్ లుక్‌తోనే ఆసక్తిని పెంచిన ‘హ్యాపీ జర్నీ’ త్వరలోనే థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.