Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’కు జాతీయ అవార్డులు.. మనసుకెంతో సంతృప్తి
యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాణంలో నిహారిక కొణిదెల రూపొందించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ సినిమా 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటుకుంది.
యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాణంలో నిహారిక కొణిదెల రూపొందించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ సినిమా 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటుకుంది. ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం, బెస్ట్ మేకప్ కేటగిరీల్లో ఈ చిత్రం రెండు జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తమ ఆనందాన్ని పంచుకునేందుకు ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో పని చేసిన ప్రతీ ఒక్కరి జర్నీ నాకు తెలుసు. మా చిత్రానికి జాతీయ అవార్డులు రావడంతో మనసు సంతృప్తితో నిండిపోయింది. నా 32 ఏళ్ల జీవితంలో ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకి ఓకే చెప్పడంతో గొప్ప నిర్ణయం. ఇది నా సినిమా, ప్రాణం పెట్టాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. మంచి సినిమా తీసినా కూడా అది ఆడియెన్స్ వరకు తీసుకు వెళ్లగలగాలి. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో అందరి కష్టం ఉంది. మంచి సినిమా తీసినప్పుడు ఇలాంటి ఓ గొప్ప ఫీలింగ్ కలుగుతుందంటే.. నా జీవితంలో ఎప్పుడూ ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లను. యదు వంశీ ఎప్పుడూ నేషనల్ అవార్డ్ వస్తుందని చెబుతూనే ఉండేవారు. కానీ నేను ఒక నేషనల్ అవార్డ్ సినిమా తీయాలని ‘కమిటీ కుర్రోళ్లు’ని నిర్మించలేదు. ఈ జర్నీలో మాత్రం నేను కూడా జాతీయ అవార్డు రావాలని కోరుకున్నాను. 72వ జాతీయ అవార్డుల్లో మేం కూడా ఉండాలని అనుకున్నాను. నా కల నేడు నెరవేరింది. ఆర్టిస్టుల్ని 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లుగా మారేందుకు ఎంతో మేకోవర్ జరిగింది. ఈ జర్నీలో రవి, అక్షయ్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. రవికి నేషనల్ అవార్డ్ రావడం ఆనందంగా ఉంది. మా నాన్న తీసిన ‘రుద్రవీణ’కి మూడు
జాతీయ అవార్డులు వచ్చాయి. మా పెదనాన్న, బాబాయ్ సినిమాకి సేవ చేశారు. నేను కొణిదెల ఫ్యామిలీ నుంచి వచ్చాను.. ఏదో ఒకటి చేశాను అని ఇప్పుడు అనిపిస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాను అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ ఫ్యామిలీలో నేను ఉండేందుకు అర్హురాలిని అని ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలను. చిరంజీవి గారే అందరికీ గర్వకారణం అని నేను ఫీల్ అవుతుంటాను. ఆయనే నన్ను గర్వకారణం అని అనడంతో ఎంతో ఆనందంగా ఉంది. ’‘రుద్రవీణ’కి మీ నాన్న (నాగబాబు) తీసుకున్నారు.. ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావ్.. మాకెంతో గర్వంగా ఉంది’ అని ఆయన అనడం సంతోషాన్నిచ్చింది’ అన్నారు.
దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ నేషనల్ అవార్డ్ కొడుతుందని ముందు నుంచీ అందరికీ చెప్తూనే వచ్చాను. చాలా మంది ఈ మూవీని నిర్మించేందుకు ప్రయత్నించారు. కానీ ఎవ్వరి వల్లా కాలేదు. ఓ కొత్త సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టేందుకు చాలా మంది సాహసించలేదు. కానీ మన్యం రమేష్ నాకు సపోర్ట్ చేశారు. కొత్త వాళ్లతో అంటే ఎవరు మాత్రం ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు. కానీ నేను చెప్పిన ప్రతీ ఒక్క ఆప్షన్‌కి మన్యం రమేష్ గారు, నిహారిక గారు ఓకే చెప్పారు. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ తమ తమ పాత్రల కోసం బరువులు తగ్గారు, పెరిగారు. మేకప్‌కి అవార్డు రావాలని చాలా కోరుకున్నాను. బెస్ట్ ఫిల్మ్ అంటే.. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్, టెక్నిషయన్ బెస్ట్ ఇస్తేనే వస్తుంది. ఎవరెన్ని చెప్పినా కూడా నిహారిక గారు ఒక్క సీన్ కూడా కట్ చేయలేదు. పెట్టిన 9 కోట్ల గురించి నిహారిక గారు ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక్క రూపాయి బిజినెస్ కాకపోయినా ధైర్యంతో నిహారిక గారు అడుగు ముందుకు వేశారు. అలా ప్రారంభమైన ప్రయాణాన్ని ఆమె ఇప్పుడు జాతీయస్థాయిలో నిలబెట్టారు. మీడియా ముందు ఇప్పుడు నేను ఏడ్వలేను (నవ్వుతూ). నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ మాట్లాడుతూ .. ‘మూడేళ్ల క్రితం మా ఈ ప్రయాణం మొదలైంది. వంశీ తన కథను ఎంతో బలంగా నమ్ముతాడు. మాకు వంశీ మీద ఎంతో నమ్మకం ఉంటుంది. మాతో వంశీ చేయబోతోన్న రెండో సినిమా కూడా ఇంతే గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నాను. మా బ్యానర్లో తీసిన సినిమాలు, సిరీస్‌లకు పెట్టిన గ్రూపులన్నీ మాయం అయ్యాయి. కానీ ఈ ‘కమిటీ కుర్రోళ్లు’ గ్రూపు ఇంకా కంటిన్యూ అవుతోంది. మాకు మీడియా ఇలానే మున్ముందు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ మాట్లాడుతూ .. ‘మా సినిమా ఇప్పుడు రిలీజ్ అయినట్టుగా అనిపిస్తోంది. రెండేళ్ల నుంచి ఈ చిత్రం నన్ను వెంటాడుతూనే ఉంది. మన ఈ కథ ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్‌కి వెళ్లాలని కోరుకుంటున్నాను. జాతీయ అవార్డు అనే టార్గెట్‌తో మా వంశీ గ్రూప్ ఫాం చేశారు. ఈ రోజు అది రుజువైంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
కెమెరామెన్ రాజు ఎదురోలు మాట్లాడుతూ .. ‘వంశీ నాకు ఈ కథ ఎప్పుడో చెప్పారు. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత పింక్ ఎలిఫెంట్‌లో వంశీ, నేను కలిసి ఈ మూవీని చేశాం. నిహారిక గారికి, ఫణి గారికి, రమేష్ గారికి ఈ క్రెడిట్ దక్కుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మాకు ఇంత ప్రేమను చూపించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు. ఎడిటర్ అన్వర్ అలీ మాట్లాడుతూ .. ‘వంశీ, నేను కలిసి లాక్డౌన్ తర్వాత క్రికెట్ ఆడే టైంలో కలిశాం. కథ చెప్పిన వెంటనే జాతీయ అవార్డు వస్తుందని వంశీతో అన్నాను. ఇది మాకు చాలా పెద్ద విషయం. మాకు అవకాశం ఇచ్చిన నిహారిక గారికి, ఫణి గారికి, రమేష్ గారికి థాంక్స్. నాకు సపోర్ట్ చేసిన మా టీంకు థాంక్స్’ అని అన్నారు. నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ .. ‘అందరం కలిసి నేషనల్ అవార్డ్స్ ఈవెంట్‌ను లైవ్‌లో చూశాం. ఆ క్షణంలో మేం ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాం. నాకు ఇంత మంచి సినిమాని నిర్మించే అవకాశం ఇచ్చిన నిహారిక గారికి థాంక్స్. మా కోసం యదు వంశీ గొప్ప కథను తీసుకు వచ్చారు. ఇది మా నిజమైన విజయం. ఈ ప్రయాణంలో మాకు సపోర్ట్ చేసిన తెలుగు మీడియాకి, తెలుగు ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.
డైలాగ్ రైటర్ కొండల్ రావు మాట్లాడుతూ ..‘ఐదేళ్ల క్రితం నేను రాసిన కవితల పుస్తకం చూసి యదు వంశీ అన్న నాకు ఈ అవకాశం ఇచ్చారు. కొత్త వాళ్లం ఇలా నేషనల్ అవార్డ్ సాధించడం ఆనందంగా ఉంది. నిహారిక గారికి, వంశీ అన్నకి, ఫణి అన్నకి ఎప్పుడూ రుణపడి ఉంటాం’ అని అన్నారు. డైలాగ్ రైటర్ వెంకట్ సుబాష్ మాట్లాడుతూ ..‘వంశీ అన్న వల్లే సినిమాల్లోకి వచ్చాను. మా ఐదేళ్ల జర్నీ అద్భుతంగా సాగింది. మేం ఎంత రాసినా, ఊహించుకున్నా దానికి ప్రాణం తీసుకు వచ్చింది మాత్రం ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాతలు. ఈ మూవీని మీడియానే జనాల వరకు రీచ్ అయ్యేలా చేసింది. మా ఈ జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’ అని అన్నారు. మేకప్ మెన్ రవి కుమార్ మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ బ్యానర్లో ఎవరు పని చేసినా పీహెచ్‌డీ చేసినట్టు అవుతుంది. కర్త నిహారిక గారు, కర్మ రమేష్ గారు, క్రియ వంశీ గారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
సందీప్ సరోజ్ మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ విడుదలై రెండేళ్లు అవుతున్నా ప్రేమ మాత్రం ఇంకా తగ్గలేదు. కథ విన్న రోజే జాతీయ అవార్డు వస్తుందని ఊహించాం. ఈ సినిమాతో నాకు ఓ పెద్ద ఫ్యామిలీ దొరికింది’ అని అన్నారు. నటుడు ప్రసాద్ బెహరా మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాలో మాకు ఇంత మంచి పాత్రలు ఇచ్చిన వంశీ గారికి, నిహారిక గారికి, ఫణి గారికి థాంక్స్. ఈ చిత్రంలో ప్రతీ ఒక్కరి కష్టం ఉంది’ అని అన్నారు. విషిక మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి జాతీయ అవార్డులు రావడంతో అందరూ ఫోన్స్ చేసి విష్ చేస్తున్నారు. నాకెంతో సంతోషంగా అనిపించింది. ఈ అవార్డులు రావడంతో మా బంధువులు, స్నేహితులు నన్ను చూసే విధానం కూడా మారింది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వంశీ గారికి, నిహారిక గారికి, ఫణి గారికి థాంక్స్’ అని అన్నారు. తేజస్వి మాట్లాడుతూ .. ‘విషిక, నేను కలిసి ఉన్నప్పుడు మాకు ఈ నేషనల్ అవార్డ్ న్యూస్ తెలిసింది. మాకు టార్గెట్ నేషనల్ అవార్డ్ అనే గ్రూపు ఉంది. చివరకు మేం నేషనల్ అవార్డ్ సాధించాం. నేను నటించిన ఫస్ట్ సినిమాకి జాతీయ అవార్డు రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.