Veerabhadruni Rahasyam Review: ‘మర్మదేశం’ సీక్వెల్.. ఈ వారం ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయంటే..
గత వారం దర్శకుడు నాగ ప్రేక్షకులకు కథేంటనేది క్లుప్తంగా వివరించారు. వాస్తవానికి ‘మర్మదేశం’ చూసిన వారికి ఇది దానికి సీక్వెల్ కాబట్టి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. కానీ ప్రస్తుతం ఈ సిరీస్ వారానికి ఐదు ఎపిసోడ్స్ చొప్పున విడుదలవుతోంది
వెబ్‌సిరీస్: వీరభద్రుని రహస్యం
ఓటీటీ ప్లాట్‌ఫాం: జీ5
నటీనటులు: అన్నీ, రఘు కుంచె, రఘు, అభినవ్, కమల్ తూము, అనురాధ తదితరులు
మ్యూజిక్: సుధా శ్రీనివాస్
ఎడిటర్: రాగం సత్య నితీశ్
దర్శకుడు: నాగ
గత వారం దర్శకుడు నాగ ప్రేక్షకులకు కథేంటనేది క్లుప్తంగా వివరించారు. వాస్తవానికి ‘మర్మదేశం’ చూసిన వారికి ఇది దానికి సీక్వెల్ కాబట్టి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. కానీ ప్రస్తుతం ఈ సిరీస్ వారానికి ఐదు ఎపిసోడ్స్ చొప్పున విడుదలవుతోంది కాబట్టి ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. గతవారం.. వీరభద్రపురం, వీరభద్రుడి ఆలయం, పెద్ద గంట, గద్దల గుట్టతో పాటు పాత్రల పరిచయం కూడా దర్శకుడు నాగ చేసేశారు. మరి ఈ వారం ఏం చూపించారో తెలుసుకుందాం.
ఈ వారం ఏం జరిగిందంటే..
ఎపిసోడ్ ప్రారంభమవగానే ముందుగా దాదాపు పది నిమిషాల పాటు 1972లో జరిగిన కథను ప్రతి ఎపిసోడ్‌లోనూ చూపించారు. ఆ సమయంలో యోగానందం తల్లి (అనురాధ) తన చిన్న కొడుకుతో కలిసి చేసిన అకృత్యాలను చూపించారు. ఆ తరవాత 1990వ దశకంలో గత వారం ప్రొఫెసర్ (కమల్) క్యారెక్టర్‌ను సైతం చూపించడం జరిగింది. ఈ వారం అతను హాస్పిటల్‌లో జాయిన్ చేసిన వ్యక్తి మరణించడం.. అతని సంచిలో ఉన్న పుస్తకం, అతని ఇంటికి వెళ్లి ఓ కత్తిని పరిశీలించిన తర్వాత నుంచి ప్రొఫెసర్ వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే వెన్నెల (అన్నీ) క్యారెక్టర్ గురించి తన చెల్లికి కల్పన చెబుతుంది. ఏదైనా అనుకుంటే సాధించే వరకూ వదలదని.. ఓ పిల్లాడి కేసు విషయంలో ఆమె చూపిన చొరవను దీనికి నిదర్శనంగా పేర్కొంటుంది. ఇక వెన్నెల విషయానికి వస్తే.. ఒకవైపు తన తండ్రి గురించి విచారిస్తూనే మరోవైపు గద్దల గుట్టపై ఏం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి ఆమె కనీసం గద్దల గుట్ట విషయమై చిన్న క్లూ అయినా కనిపెట్టగలిగిందా? ఊరిలో దోపిడీలకు పాల్పడుతున్న సెబాస్టియన్ గ్యాంగ్‌ను హతమార్చిందెవరు? వెన్నెల తన తండ్రి గురించి ఏమైనా తెలుసుకుందా? గద్దల గుట్టపై ఆమెపై అటాక్ చేసిందెవరు? వంటి విషయాలను తెలుసుకోవాలంటే ఈ వారం ఎపిసోడ్స్ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
కథ గత ఎపిసోడ్స్ మాదిరిగానే ఎలాంటి హంగామా లేకుండా చాలా సైలెంట్‌గా సాగిపోయింది. ఈ వారం ఎందుకోగానీ సాగదీతలా అనిపించింది. మరీ అంత ఉత్కంఠ కూడా ఏమీ అనిపించలేదు. 60 ఎపిసోడ్స్‌లో పది మాత్రమే చూశాం కాబట్టి దర్శకుడు ప్రేక్షకులను ఇంకా పూర్తి కథలోకి తీసుకెళ్లలేదా? లేదంటే ఇలానే ఉంటుందా? అనేది తెలియడం లేదు. ‘మర్మదేశం’తో కంపారిజనే లేదేమో అనిపిస్తోంది. ‘వీరభద్రుని రహస్యం’లో అంత సీరియస్‌నెస్ లేదా? అనేది తెలియడం లేదు. ప్రొఫెసర్ విషయమైతే ఆసక్తికరంగానే ఉంది. ఆయనెందుకు అలా అయిపోతున్నారు? ఏంటనేది ఇంట్రస్టింగ్. కానీ గద్దల గుట్ట గురించి గత వారం హైప్ అయితే క్రియేట్ చేశారు కానీ ఈ వారం అంత సీన్ లేదేమో అన్నట్టుగా ఉంది. మొత్తంగా గతంలో మర్మదేశం స్థాయి ఉత్కంఠ కల్పించలేక పోతోందేమో అనిపిస్తోంది.
ఎవరెలా చేశారంటే..
రఘు కుంచె ఎప్పటి మాదిరిగానే తన పాత్రలో ఒదిగిపోయారు. తల్లి చేసే అకృత్యాలను అడ్డుకోలేక.. ఎదురు చెప్పలేక సతమతమవుతూ ఉంటాడు. అలాగే గద్దల గుట్టపైకి శవాన్ని తీసుకెళ్లి వదిలేసి వచ్చాక ఆయన ఆవేదన చాలా నేచురల్‌గా చూపించారు. ఇక అన్నీ విషయానికి వస్తే తన పాత్రలో చక్కగా నటిస్తోంది. ఈ వారం రహస్యాల ఛేదనలో లీనమైంది. ఆమె పాత్ర కూడా బాగుంది. ప్రొఫెసర్‌గా నటుడు కమల్, అనురాధ తమ నటనతో మెప్పించారు. ఇతర పాత్రలన్నీ తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు.
టెక్నికల్ పరంగా..
దర్శకుడు నాగకు గతంలో ‘మర్మదేశం’కు దర్శకత్వం వహించిన అనుభవం ఉంది. కానీ ‘వీరభద్రుని రహస్యం’ను అంత సీరియస్‌గా తీసుకోలేదా? అనిపిస్తోంది. వీరభద్రుని ఆలయం చుట్టూ అల్లిన కథలో అంత సీరియస్‌నెస్ లేదేమో అనిపిస్తోంది. బీజీఎం విషయానికి వస్తే సిరీస్‌కి తగ్గట్టుగానే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా.. ‘వీరభద్రుని రహస్యం’ నెమ్మదిగా సాగుతోంది.
రేటింగ్: 2.75/5
ప్రజావాణి చీదిరాల