Entertainment

VasudhevaSutham Review: పురి జగన్నాథుని కథ నేపథ్యంలో తెరకెక్కిన ‘వసుదేవసుతం’ ఎలా ఉందంటే..

మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా తెరకెక్కిన సినిమా ‘వసుదేవసుతం’. కొద్ది రోజుల్లో పురి జగన్నాథుని రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అక్కడి జగన్నాథస్వామి కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే ‘వసుదేవసుతం’.

VasudhevaSutham Review: పురి జగన్నాథుని కథ నేపథ్యంలో తెరకెక్కిన ‘వసుదేవసుతం’ ఎలా ఉందంటే..

చిత్రం: వసుదేవసుతం

విడుదల: 10-07-2026

నటీనటులు: మాస్టర్ మహేంద్రన్, అంబికావాణి, జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఐశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, భద్రం, జబర్ధస్త్ రాంప్రసాద్ తదితరులు

సంగీతం: మణిశర్మ

రచయిత - దర్శకుడు: వైకుంత్ బోను

నిర్మాత: ధనలక్ష్మి బాదర్ల

మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా తెరకెక్కిన సినిమా ‘వసుదేవసుతం’. కొద్ది రోజుల్లో పురి జగన్నాథుని రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అక్కడి జగన్నాథస్వామి కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే ‘వసుదేవసుతం’. వాస్తవానికి ఇదొక అద్భుతమైన కథ. మరి కథను అంతే ఆసక్తికరంగా దర్శకుడు వైకుంత్ బోను చెప్పగలిగారా? సినిమా ఎలా ఉంది? తెలుసుకుందాం.

కథ విషయానికొస్తే..

పురుషోత్తమపురిలో ప్రముఖ వాసుదేవ ఆలయం ఉంటుంది. ఆ ఆలయ చైర్మన్ శర్మ(దువ్వాసి మోహన్)ని హీరా బంధు(మైమ్ గోపి) చంపేస్తాడు. అలాగే ఆ ఊరిలో జరిగిన చైర్మన్ ఎన్నికల్లో తన తండ్రిని హీరా బంధు గెలిపించుకుంటాడు. వాసుదేవుని ఉత్సవాల కోసం హైదరాబాద్‌లో ఉండే కృశవ్(మహేంద్రన్) పురుషోత్తమపురికి వస్తాడు. తన అక్క ప్రేమ పెళ్లికి కృశవ్ సహకరించాడన్న కారణంతో అతని అన్నయ్య అతనితో మాట్లాడటం మానేస్తాడు. మరోవైపు హీరా బంధు మేనకోడలు భువి(అంబికా వాణి) కూడా ఆ ఉత్సవాలకు తన ఫ్రెండ్స్‌తో కలిసి వస్తుంది. కృశవ్‌ని చూడగానే ఆమెకు హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. అలా ఇద్దరూ ప్రేమలో పడతారు. ఈ క్రమంలోనే శర్మ ఏమయ్యాడనే విషయమై కృశవ్ ఆరా తీయడం మొదలు పెడతాడు. అలాగే కోయిరాతల అనే ప్రదేశంలో సైతం ఏముందోనని కనిపెట్టేందుకు కృశవ్ యత్నిస్తూ ఉంటాడు. భువితో ప్రేమాయణం కారణంగా హీరా బంధు మనుషులు అతనిపై దాడి చేస్తారు. అతను హాస్పిటల్ నుంచి బయటకు రాగానే మరోసారి అటాక్ జరుగుతుంది. మరి ఈసారి కూడా అటాక్ చేసింది హీరా బంధు మనుషులేనా? మరొకరా? అసలెందుకు శర్మను హత్య చేయాల్సి వచ్చింది? వాసుదేవ ఆలయంలోని బ్రహ్మ పదార్థం సంగతేంటి? దానిని దక్కించుకునేందుకు యత్నిస్తున్న వారెవరు? వంటి అంశాలను వెండితెరపై చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

‘వసుదేవసుతం’ పేరులోనే ఉంది కదా.. వసుదేవుని కుమారుడు శ్రీకృష్ణుడు. అంటే ఒక ఆధ్యాత్మికతతో ముడిపడిన కథను మోడ్రన్ వేలో చెప్పేందుకు దర్శకుడు వైకుంత్ బోను యత్నించాడు. చెప్పిన విధానం కూడా చాలా బాగుంది. వాస్తవానికి పురి జగన్నాథుని గురించి చెప్పాల్సి వస్తే ఎన్నో ఆసక్తికర విశేషాలున్నాయి. వాటిలో బ్రహ్మ పదార్థం ఒకటి. అంటే శ్రీకృష్ణుడి గుండె ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉంటుందని చెబుతారు. అదే బ్రహ్మ పదార్థం. అలాగే ఆలయం కింద అంతులేని సంపద ఉందని చెబుతారు. ఈ రెండింటినీ దక్కించుకుంటే ప్రపంచాన్ని ఏలవచ్చనే కొందరి కుట్రను కృశవ్ ఎలా భగ్నం చేశాడనేదే కథ. అసలు ఆ కుట్ర పన్నుతోంది ఎవరనేది మరింత ఆసక్తికరం. ఎవరూ గెస్ కూడా చేయలేరు. సినిమా మన ఊహలకు ఏమాత్రం అందదు. కొయిరాతలలో ఏముందనేది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయం, పురుషోత్తమపురిలో హీరాబందు గొడవలు, ఆలయ అధికారం దక్కించుకునేందుకు అతను ఏమాత్రం వెనుకాడకుండా చేసే పనులు, హీరో హీరోయిన్స్ ప్రేమకథతో.. మంచి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. సెకండాఫ్‌లో అసలు కథలోకి తీసుకెళ్లారు. కృశవ్ బావ ఎందుకు మరణించారు? అసలు పురుషోత్తమపురంలో ఏం జరుగుతోంది? వంటి అంశాలతో ఆసక్తికరంగా

ఎవరెలా నటించారంటే..

హీరో మహేంద్రన్ విషయానికి వస్తే తన పాత్రలో ఒదిగిపోయారు. ఆలయాన్ని రక్షించుకునేందుకు పోరాడే వ్యక్తిగా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ అంబికా వాణి చాలా అందంగా కనిపించింది. ఆమె కూడా అద్భుతంగా నటించింది. చాలా కాలం తర్వాత తెలుగు తెరపై ఐశ్వర్య లక్ష్మి కనిపించి మెప్పించారు. ఆమె కూడా చాలా హూందాగా చక్కగా నటించారు. జబర్దస్త్ రాంప్రసాద్ సైతం ఓ కీలక పాత్ర పోషించాడు. అతడి కామెడీ టైమింగ్ చాలా బాగుంది. రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషించారు. తన పాత్రలో జీవించారు. ఇక జాన్ విజయ్, మైమ్‌ గోపి, సురేష్‌ చంద్ర మీనన్, తులసి, టార్జన్, రామరాజు, భద్రం తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.

టెక్నికల్ పరంగా..

దర్శకుడు కథను రాసుకున్న విధానం, దానిని ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఏఐని బాగానే వాడేశారు. కొంచెం యాక్షన్ పార్ట్ విషయంలో శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. ఎడిటింగ్ విషయంలో కత్తెరను వాడాల్సి ఉంది. మ్యూజిక్, బీజీఎం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగానే ఉన్నాయి.

ఫైనల్‌గా.. ‘వసుదేవసుతం’ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చే చిత్రం.

రేటింగ్: 3/5

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 10, 2026 2:24 PM