Entertainment

Lenin Review: ‘లెనిన్’తో అఖిల్ సక్సెస్ అందుకున్నట్టేనా?

అక్కినేని అఖిల్.. ఇండస్ట్రీలో చాలా కాలం పాలు స్ట్రగుల్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మరీ ‘లెనిన్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అక్కినేని నాగార్జున కూడా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి ఉండటంతో సినిమాపై గట్టిగానే ఫోకస్ పెట్టారు.

Lenin Review: ‘లెనిన్’తో అఖిల్ సక్సెస్ అందుకున్నట్టేనా?

చిత్రం: లెనిన్‌

విడుదల: 10-07-2026

నటీనటులు: అఖిల్‌ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, ప్ర‌మోద్ పంజు, శివాజీ, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, ఈశ్వరీరావు తదితరులు

ఎడిటింగ్‌: నవీన్‌ నూలి

నిర్మాత: అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ

రచన, దర్శకత్వం: మురళీ కిషోర్‌ అబ్బూరి

అక్కినేని అఖిల్.. ఇండస్ట్రీలో చాలా కాలం పాలు స్ట్రగుల్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మరీ ‘లెనిన్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అక్కినేని నాగార్జున కూడా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి ఉండటంతో సినిమాపై గట్టిగానే ఫోకస్ పెట్టారు. ఇక ప్రమోషన్స్‌ని సైతం పీక్స్‌కు తీసుకెళ్లారు. మరి అంత కష్టపడి తీసిన ‘లెనిన్’ అఖిల్‌కు హిట్ ఇచ్చిందా? అఖిల్ స్ట్రగుల్‌కు ఫుల్ స్టాప్ పెట్టిందా? తెలుసుకుందాం.

క‌థేంటంటే..

అనాథ అయిన లెనిన్ (అఖిల్‌) చిత్తూరు జిల్లాలోని శ్రీరామాపురం అనే ఊరుకు వస్తాడు. అప్పుడు అక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి. అఖిల్ వెళ్లే సమయానికి శ్రీ రామాపురానికి మరో గ్రామానికి ఆలయంపై జెండా పాతే విషయంలో ఘర్షణ జరుగుతుంటుంది. ఆ జెండా ఎవరో ఒకరు పాతితే కానీ అన్నదానం నిర్వహించలేమని గుడి పూజారి చెప్పడంతో లెనిన్ ఆ పని చేసేస్తాడు. అప్పుడు ఆ ఊరిలో వర్షం పడుతుంది. అప్పుడే ఆ గ్రామంలోని ఓ పెద్దింటి మ‌హిళ (ఈశ్వ‌రీరావు) లెనిన్‌ను చూసి వివరాలడిగి అతడిని చేరదీస్తుంది. తన కుమారుడు వసంత్ (ప్ర‌మోద్ పంజు)తో పాటు లెనిన్‌ను కూడా కొడుకు లాగే చూసుకుంటుంది. వసంత్‌తో లెనిన్ కూడా బాగా కలిసిపోతాడు. వ‌సంత్ పై చదువుల కోసం మద్రాస్ వెళ్ల‌గా, లెనిన్ మాత్రం ఊళ్లోనే ఉంటూ ఆ కుటుంబానికి అన్నీ తానేనన్నట్టుగా మారిపోతాడు. శ్రీరామాపురంలో 18 రోజులపాటు భారతం మెట్ట ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ ఉత్సవాల నిర్వహణ ఎంతో ప‌విత్రంగా జ‌రిగే భార‌తం మెట్ట ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ని సైతం లెనిన్ త‌న భుజాల‌పై వేసుకుంటాడు. ఆ ఉత్సవాల్లోనే భార‌తి (భాగ్య‌శ్రీ బోర్సే)ని కలవడం.. వారిద్దరి మధ్య వీడదీయరాని ప్రేమబంధం ఏర్పడుతుంది. ఆ ఊరికొచ్చిన వ‌సంత్‌.. భారతిని ఇష్టపడతాడు. కానీ భారతి తన ప్రేమ విషయాన్ని వసంత్‌కు చెప్పడంతో తనే స్వ‌యంగా లెనిన్‌, భార‌తి వివాహాన్ని జ‌రిపిస్తాడు. ఆ తరువాత ఆ ఊళ్లో ఉత్స‌వాల ఆఖ‌రి రోజు అనూహ్యంగా ఓ సంఘ‌ట‌న జ‌రుగుతుంది. ఆ ఘటన కథను ఎలాంటి మలుపు తిప్పింది? అసలేంటా ఘటన? లెనిన్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వంటి అంశాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే..

శ్రీరామ‌పురం అనే గ్రామంలో జ‌రిగే కథను మహాభారతంలోని కురుక్షేత్రం సంగ్రామంతో ముడిపెట్టడమనేది ఒకింత ఆసక్తికరమే. ఈ చిత్రంలో లెనిన్ తనను తానే అర్జనుడిలా మలుచుకుని తన వారితో యుద్ధం చేసేందుకు ఎలా సన్నద్ధమయ్యాడనేదే కథ.. కురుక్షేత్రంలో మాదిరిగానే.. ఇక్కడ కూడా పరిస్థితులకు అనుగుణంగా విలన్ పక్షాన చేరే పాత్రలుంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా లెనిన్ శ్రీరామాపురానికి రావడం.. అక్కడి పాత్రల పరిచయం, చిత్తూరు జిల్లాలో జ‌రిగే భార‌తం మెట్ట జాత‌ర నేప‌థ్యంతో కొనసాగుతుంది. సెకండాఫ్‌లో లెనిన్ జైలు నుంచి విడుదలవడం.. అంతకు ముందు కథ ఏం జరిగింది? స్కెచ్ వేసి మరీ తన ప్రత్యర్థులందరినీ ఒక చోట చేర్చడం వంటి పరిణామాలతో కొనసాగుతుంది. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్‌లోనే సినిమా సాగిపోతుంది కానీ ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీత అనిపిస్తుంది. అయినా కూడా.. ఫస్ట్ హాఫ్ ఇంట్రస్టింగ్‌గానే ఉంటుంది. సెకండాఫ్ వచ్చే వరకూ దర్శకుడు కొంత తడబడ్డాడేమో అనిపిస్తుంది. పాత్రల అసలు స్వరూపమంతా సెకండాఫ్‌లోనే బయటపెట్టినా కూడా యాక్షన్ సన్నివేశాలు ఎక్కువవడంతో కొంత విసుగ్గా అనిపిస్తుంది. అలాగే ట్విస్ట్‌లన్నీ మనకు ముందుగానే తెలిసిపోతుంటాయి.

ఎవ‌రెలా చేశారంటే..

అక్కినేని అఖిల్ తన పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. లెనిన్ పాత్ర‌లో చాలా షేడ్స్ ఉంటాయి. ప్రేమ, కోపం, రివెంజ్ వంటివన్నింటినీ కూడా అద్భుతంగా అఖిల్ సమన్వయం చేశాడు. హీరోయిన్ భాగ్య‌శ్రీ బోర్సే పాత్ర ఇంట్రస్టింగ్‌గానే ఉంది కానీ మరింత స్ట్రాంగ్‌గా డిజైన్ చేసి ఉండాల్సిందేమో అనిపిస్తుంది. భాగ్యశ్రీ నటన విషయంలోనూ ఏమాత్రం లోటు చేయలేదు. అద్భుతంగా నటించింది. ఇక సినిమాలో చెప్పుకోదగిన పాత్ర ప్రమోద్ పంజు. టు షేడ్స్ ఉన్న పాత్రను అద్భుతంగా చేశాడు. ఈ సినిమాలో అతనికి మంచి రోల్ దక్కింది. శివాజీ ఎప్పటిలాగే తన పాత్రలో జీవించారు. ఈశ్వరీరావు, బ్ర‌హ్మాజీ, రాంకీ, సునీల్‌, గెట‌ప్ శ్రీను త‌దితరులు అంతా తమ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

టెక్నికల్ పరంగా..

టెక్నికల్ పరంగా సినిమా చాలా బాగుంది. దర్శకుడు మురళీ కిషోర్‌ అబ్బూరి స్క్రిప్ట్‌పై మరింత ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. యాక్షన్ సన్నివేశాలను చాలా బాగా తీర్చిదిద్దారు. ట్విస్ట్‌లన్నీ గెస్ చేసేలాగే ఉంటాయి. ముఖ్యంగా లియోన్ బ్రిట్టో కెమెరా ప‌నిత‌నం గురించి చెప్పుకోవాలి. చాలా బాగా ఆకట్టుకుంది. త‌మ‌న్ సంగీతం, బీజీఎం సినిమాను ఒక మెట్టు ఎక్కించింది. ఎడిటింగ్‌ విషయంలో మాత్రం ఫోకస్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి.

ఫైనల్‌గా.. అఖిల్‌ కెరీర్‌ను ‘లెనిన్’ ఓ మెట్టు ఎక్కించేలాగే ఉంది.

రేటింగ్: 2.75/5

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 10, 2026 1:26 PM