Entertainment

Tollywood Producers: మీరే కాదు.. మేమూ సమస్యల్లోనే ఉన్నాం..

తాము సమస్యల్లో ఉన్నామని.. పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రెస్‌మీట్ నిర్వహించారు. అయితే ‘మీరు మాత్రమే కాదు.. మేము కూడా సమస్యల్లోనే ఉన్నాం’ అంటూ నేడు (బుధవారం) తెలుగు సినీ నిర్మాతలు..

Tollywood Producers: మీరే కాదు.. మేమూ సమస్యల్లోనే ఉన్నాం..

తాము సమస్యల్లో ఉన్నామని.. పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రెస్‌మీట్ నిర్వహించారు. అయితే ‘మీరు మాత్రమే కాదు.. మేము కూడా సమస్యల్లోనే ఉన్నాం’ అంటూ నేడు (బుధవారం) తెలుగు సినీ నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు ప్రెస్‌మీట్ పెట్టి మరీ స్పష్టం చేశారు. ఎగ్జిబిటర్లు ఏకపక్షంగా ప్రెస్‌మీట్ పెట్టారని.. బెదిరించినట్టుగా మాట్లాడారని అది సరికాదన్నారు. ఏదైనా ఉంటే అందరం కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఎగ్జిబిటర్ల సమస్యతో పాటు తమ సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

నిర్మాత యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ.. నిన్న ఎగ్జిబిటర్స్ ప్రెస్ మీట్ నిర్వహించి వారికి అన్యాయం జరుగుతుందని చెప్పారన్నారు. ఈ అంశంపై నిర్మాతల కోణం కూడా అందరికీ తెలియజెప్పాలని.. నిజానిజాలు తెలపాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎగ్జిబిటర్లు తాము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి పర్సెంటేజ్ విధానానికి రావాలని అనుకున్నట్టుగా వెల్లడించారన్నారు. అది ఓకే కానీ, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు సైతం ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసికట్టుగా పనిచేస్తున్నామని... ప్రస్తుతం ఎవరూ సంతోషంగా లేరన్నారు. కానీ, తామొక్కరమే ప్రయోజనం చూసుకొని వెళ్ళిపోతామనడం సరైనది కాదని రవిశంకర్ పేర్కొన్నారు. మూడు సెక్టార్లు కూర్చొని మాట్లాడుకోవాలని.. ఇవి రాత్రికి రాత్రే జరిగిపోవాలంటే జరిగిపోయేవి కావన్నారు. అంతా కలిసి చర్చించుకొని పరిష్కరించుకుందామన్నారు. 'హరి హర వీరమల్లు' విడుదల సమయంలో ఈ సమస్య తెరపైకి వచ్చిందని.. నాటి నుంచి ఎన్నో సినిమాలు విడుదలయ్యాయన్నారు. ఇన్ని సినిమాలకు లేని సమస్య మళ్ళీ ఇప్పుడే ఎందుకు వచ్చిందని రవిశంకర్ ప్రశ్నించారు. ‘పెద్ది’ రూపంలో ఒక మంచి సినిమా వస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు సృష్టించడం సరైనది కాదన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ఎకో సిస్టమ్‌లో ఒకరు బాగోకపోతే ముగ్గురూ బాగోరన్నారు. ప్రెస్‌మీట్ పెట్టి ఎగ్జిబిటర్ల పరిస్థితి బాలేదని చెప్పారు. కానీ, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. కొన్ని నెలల నుంచి చూస్తూనే ఉన్నామని... కంటెంట్ లేక శ్రీరాములు లాంటి థియేటర్‌ను మూసేయాల్సి వచ్చిందని వాళ్ళే చెప్పారన్నారు. ఇక్కడ ఉన్న నిర్మాతలవి 50 శాతానికి పైగా షూటింగ్ అయిపోయిన సినిమాలు కనీసం 25 ఉన్నాయని... వీటిలో చిన్న, పెద్ద అన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే 70-80 శాతం బడ్జెట్ ఖర్చు పెట్టి ఉన్నామన్నారు. ఇలాంటి సమయంలో కొత్త విధానం తీసుకొస్తామంటే అది సబబుగా ఉండదన్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సినిమాల విషయంలో ఆ విధానాన్ని అంగీకరించలేమని... కొత్తగా నిర్మించబోయే సినిమాల విషయంలో ఈ విధానంపై ఆలోచిస్తామని నాగవంశీ తెలిపారు. ఎగ్జిబిటర్ ఎంత ముఖ్యమో, డిస్ట్రిబ్యూటర్ కూడా అంతే ముఖ్యమన్నారు. అలాంటిది డిస్ట్రిబ్యూటర్ ను చంపేసి, ఎగ్జిబిటర్ ను కాపాడాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మెరుగైన వసతులు కల్పిస్తే.. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని నాగవంశీ అన్నారు.

నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. నిన్న ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్ బెదిరించినట్టుగా ఉంది కానీ, కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుందాం అన్నట్టుగా లేదన్నారు. మనంలో మనం ఇలా కొట్టుకోవడం వల్ల లోకువ అయిపోతామన్నారు. సమస్యను పరిష్కరించుకునే దిశగా మనం వెళ్ళట్లేదని... ఈ అంశంపై ఫిల్మ్ ఛాంబర్ తరపు నుంచి కూడా మీటింగ్‌లు జరిగాయన్నాు. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే, అలా ఏక పక్షంగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో తమకు అర్థం కావడం లేదని సాహు గారపాటి అన్నారు. ప్రతిసారీ ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఏదోక ఆటంకం కలిగిద్దామనే ఉద్దేశంతో చేస్తున్నట్టుగా అనిపిస్తోందన్నారు. చాలా సినిమాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకొని, టికెట్ ధరలు పెంచుకున్నామని.. కానీ ఎగ్జిబిటర్లు తమ ప్రెస్‌మీట్‌లో అనుమతి లభించినా, తాము థియేటర్లలో ప్రదర్శించమని అంటున్నారన్నారు. అంటే ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా వెళ్దాం అనుకుంటున్నారో ఏంటో అర్థం కావడం లేదని.. ఇది సరైనది కాదన్నారు. అందరం కూర్చొని మాట్లాడుకొని, నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సాహు గారపాటి అన్నారు.

నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. 20 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎవరు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో అందరికీ తెలుసని... అప్పటి నుంచి ఎగ్జిబిటర్లకు న్యాయం చేయలేనిది ఈరోజు గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు. మొన్న సంక్రాంతి సినిమాలకు కూడా టికెట్ రేట్లు తెచ్చుకున్నారు కదా? అని పేర్కొన్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఇలా మాట్లాడటం ఎంతవరకు సబబని సుధాకర్ చెరకూరి ప్రశ్నించారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 13, 2026 2:50 PM