Nagabandham Review: ‘నాగబంధం’ సక్సెస్ కొట్టిందా?
అభిషేక్ నామా తెరకెక్కించిన ‘నాగబంధం’ చిత్రం నుంచి వచ్చిన పాటలు కావొచ్చు, ట్రైలర్ కావొచ్చు సినిమాపై అంచనాలను పెంచేసింది. విజువల్ గ్రాండియర్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.
చిత్రం: నాగబంధం
విడుదల: 03-07-2026
నటీనటులు: విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మేనన్, దక్ష నగర్కర్, మహేశ్ మంజ్రేకర్, జగపతిబాబు, మురళీ శర్మ తదితరుల
సంగీతం: జునైద్ కుమార్, అభి
సినిమాటోగ్రఫీ: సుందర్ రాజన్ ఎస్
ఎడిటింగ్: ఆర్.సి. ప్రణవ్
నిర్మాత: కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి
దర్శకత్వం: అభిషేక్ నామా
అభిషేక్ నామా తెరకెక్కించిన ‘నాగబంధం’ చిత్రం నుంచి వచ్చిన పాటలు కావొచ్చు, ట్రైలర్ కావొచ్చు సినిమాపై అంచనాలను పెంచేసింది. విజువల్ గ్రాండియర్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అనంత పద్మనాభస్వామి, నాగబంధం వంటి అంశాలు దేశంలోనే సంచలనం రేపాయి. అలాంటి అంశాలతో రూపొందిన చిత్రం కావడంతో అంచనాలు అమాంతం పెరిగాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? చూద్దాం.
కథేంటంటే..
‘నాగబంధం’ సినిమా కథంతా 1756-1962 నేపథ్యంలో జరిగే ఒక పిరియాడిక్ మూవీ. అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ ఈ కథ నడుస్తుంది. పురావస్తు శాస్త్రవేత్త ప్రభాకర్ (జగపతిబాబు) ఆర్కియాలజిస్ట్. తన 30 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రహస్యాలను ఛేదిస్తాడు. కానీ నాగబంధం రహస్యాన్ని ఛేదించడంలో విఫలమవుతాడు. ఈ క్రమంలోనే ఆయన తన ఇద్దరు స్కాలర్లు అబ్దాలి, టెస్లాతో కలిసి హిమాలయాల్లో పరిశోధనలు నిర్వహించి నాగబంధం విముక్తికి సంబంధించిన ఓ రహస్య పుస్తకాన్ని కనుక్కుంటారు. టెస్లా ఆ పుస్తకాన్ని ప్రభుత్వానికి అందజేయాలనుకుంటాడు. అయితే అబ్దాలీ మాత్రం దానిని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. నాగబంధం విముక్తికి శ్రీ రంగనాథ స్వామి నాభిపై అలంకరించిన బ్రహ్మకమలం కీలకమని తెలుసుకుని.. అబ్దాలి దాన్ని చేజిక్కించుకోవాలనుకుంటాడు. మొత్తం బ్రహ్మాండాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటాడు. దీనికోసం కాలవృక్షం బంధనంలో ఉన్న భైరాగి (గరుడ రామ్)తో కలిసి ప్లాన్ చేసి ఎన్నో అరాచకాలకు పాల్పడతారు. వీరి అరాచకాల్లో భాగంగా ఒక గూడెంలో నివసిస్తున్న రుద్ర (విరాట్‌కర్ణ) కుటుంబం మొత్తాన్నీ చంపేస్తారు. అసలు వాళ్లు రుద్ర కుటుంబాన్ని ఎందుకు అంతమొందించారు? దీనికి ప్రతీకారంగా రుద్ర ఏం చేశాడు? శివ ఎవరు? పార్వతి (నభా నటేశ్) పాత్ర ఏమిటి? ఈ అంశాలన్నింటినీ వెండితెరపై వీక్షించాల్సిందే.
ఎలా ఉందంటే...
పురాణాలు, సనాతన ధర్మం ఆధారంగా అభిషేక్ నామా ఒక కథను అల్లుకున్నారు. అయితే దానిని తెరకెక్కించే క్రమంలో పూర్తిగా తడబడ్డారు. లేనిపోని హంగులతో కథను అటకెక్కించేశారు. సినిమా నుంచి వచ్చిన సాంగ్స్‌లో ఉన్నంత గ్రాండియర్ సినిమాలో లేదనే చెప్పాలి. సినిమాకు కథ కానీ.. స్క్రీన్ ప్లే కానీ ఏవీ సెట్ అవలేదు. పైగా ఈ చిత్రానికి పెద్ద మైనస్ నటీనటులే. కనీసం దర్శకుడు నటీనటుల ఎంపిక విషయంలోనూ జాగ్రత్త వహించలేదు. పద్మనాభస్వామి ఆలయం, నాగబంధం అనేవి అత్యంత ఆసక్తికరమైన విషయాలు. అలాంటి అంశాలతో ఈ చిత్రాన్ని కరెక్ట్‌గా తెరకెక్కిస్తే.. సినిమా మరోలా ఉండేది. కానీ కథనం ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో సినిమా ప్రేక్షకులకు ఏమాత్రం ఎక్కలేదు. కథను గాలికి వదిలేసి.. అక్కర్లేని ట్రాక్‌లతో కథను సాగదీయడం సినిమాకు పెద్ద మైనస్. అసలు కొన్ని పాత్రలైతే ఎందుకు ఉన్నాయో కూడా అర్థం కాదు. కనీసం కథతో సంబంధం లేకుండా పాత్రలు వచ్చి పోవడం చూస్తే బలవంతంగా ఇరికించేసినట్టుగా అనిపించింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. హీరోతో హీరోయిన్ ప్రేమలో పడటం కూడా చాలా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. తన వాళ్లను చంపుతున్నంత సేపు హీరో సినిమా చూస్తాడు. వాళ్లు చనిపోయాక మాత్రమే వీరావేశం వచ్చేసి అందరినీ కొడతాడు. అదేదో ముందే చేసి ఉండొచ్చు కదా అని చూసేవారికి అనిపిస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో ప్రతిదీ దారుణమే.
ఎవరెలా చేశారంటే..
విరాట్ కర్ణ రుద్ర పాత్రకు ఏమాత్రం సెట్ అవలేదు. రుద్రగా, సాధువుగా రెండు విభిన్నమైన పాత్రల్లో వేరియేషన్ చూపించేందుకు బాగానే కష్టపడ్డాడు. ఇక నభా నటేష్ సైతం పర్వాలేదనిపించింది. విలన్‌గా రిషబ్ బాగా సెట్ అయ్యాడు. చక్కగా నటించాడు. జగపతిబాబు గురించి చెప్పేదేముంది? అద్భుతంగా నటించారు. ఐశ్వర్య మీనన్ తన నటనతో మెప్పించింది. అనసూయ, మురళీ శర్మ వంటి వారు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్‌గా..
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపించింది. సీజీ వర్క్ ముఖ్యంగా దెబ్బకొట్టడం సినిమాకు మైనస్. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌తో పాటు ప్రతీ సెట్ చాలా బాగుంది. మ్యూజిక్ పరంగా సినిమా అద్భుతంగా ఉంది. నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. వీఎఫ్‌ఎక్స్ సైతం అంతగా ఆకట్టుకోలేదు. ఏఐని వాడటం.. ఎడిటింగ్ వంటివి పెద్ద మైనస్. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ఫైనల్‌గా.. ‘నాగబంధం’ హంగులు తప్ప కథలో పస లేదు.
రేటింగ్: 2.25/5