Entertainment

Rao Bahadur Review: ‘రావు బహదూర్’ సత్యదేవ్‌కు సక్సెస్‌ను అందించిందా?

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘రావు బహదూర్’ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించడంతో పాటు ఇలాంటి కాన్సెప్ట్‌ను మునుపెన్నడూ చూడలేదని చెప్పడంతో అంచనాలు అమాంతం పెరిగాయి.

Rao Bahadur Review: ‘రావు బహదూర్’ సత్యదేవ్‌కు సక్సెస్‌ను అందించిందా?

చిత్రం: రావు బహదూర్‌

విడుదల తేదీ: 03-07-2026

నటీనటులు: సత్యదేవ్, దీపా థామస్, వికాస్‌ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్, ప్రణయ్, కునాల్‌ కౌశిక్, మాస్టర్‌ కిరణ్‌ తదితరులు

సంగీతం: స్మరణ్‌ సాయి

రచన, దర్శకత్వం: వెంకటేశ్‌ మహా

నిర్మాతలు: గోపాలకృష్ణ రెడ్డి చింతా, శరత్‌ చంద్ర, అనురాగ్‌ రెడ్డి

సమర్పణ: మహేశ్‌బాబు, నమ్రత

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘రావు బహదూర్’ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించడంతో పాటు ఇలాంటి కాన్సెప్ట్‌ను మునుపెన్నడూ చూడలేదని చెప్పడంతో అంచనాలు అమాంతం పెరిగాయి. దీనికి తోడు ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’తో సక్సెస్ కొట్టిన కాంబో వెంకటేశ్ మహా, సత్యదేవ్ కాంబోనే ఈ సినిమాను చేయడంతో ఈ సినిమా కూడా చాలా మంచి సక్సెస్ సాధిస్తుందన్న ఆలోచనలో ప్రేక్షకులు ఉన్నారు. అంతేకాకుండా సత్యదేవ్ పుట్టినరోజుకు ఒకరోజు ముందు విడుదలైన ఈ చిత్రం ఆయనకు సక్సెస్‌ను బర్త్ డే గిఫ్ట్‌గా ఇచ్చిందా? తెలుసుకుందాం.

కథేంటంటే..

‘రావు బహదూర్’ కథ 1991లో భువన వంశానికి చెందిన రామప్ప రావు బహదూర్ అలియాస్ రాముడు(సత్యదేవ్)కి లివర్ క్యాన్సర్ అని నిర్ధారణ అవుతుంది. డాక్టర్స్ సైతం బతికించలేమని.. రామప్ప నాలుగు నెలలకు మించి బతకడని రిపోర్ట్ ఇస్తారు. కానీ ఆ రిపోర్ట్ ఇచ్చి ఏడాది దాటిపోయినా కూడా రామప్ప హాయిగా మద్యం సేవిస్తూ జీవించే ఉంటాడు. అది వైద్యులకు సైతం షాకింగ్‌గా అనిపిస్తుంది. తనకు తానే ఏదో ఊహించుకుని.. భయపడిపోతూ ఉంటాడు. నిద్రలో ఏవేవో కలలు వచ్చాయని.. చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మొత్తంగా రామప్ప ఒక మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటాడు. దీనికి కారణం అతని చిన్న కొడుకు కుసుమప్ప. అతను చిన్న వయసులోనే మరణిస్తాడు. కుసుమప్ప నల్లగా ఉండటంతో తన కొడుకు కాదని బాగా అనుమానం పెంచుకుంటాడు. కుసుమప్ప చనిపోయినా కూడా ఆ అనుమానం రామప్ప మనసు నుంచి పోదు. దీంతో సైకలాజికల్‌గా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తన స్నేహితుడు, డాక్టర్ ఆచారి(వికాస్ ముప్పల) ఎంత చెప్పినా కూడా వినడు. మరి రామప్ప సెట్ అయ్యాడా? కుసుమప్ప నిజంగానే రామప్ప కొడుకు కాదా? రామప్ప భార్య భార్య రేణుక (దీపా థామస్) ఎందుకు ఒక గదిలో తలుపులు వేసుకుని కంప్లీట్‌గా ఉండిపోయింది? వంటి విషయాలను వెండితెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే?

కథ ఏదైనా సరే.. ప్రెజెంట్ చేసే విధానమే కీలకం. ఒక్కోసారి కథ లేకున్నా కూడా కామెడీ వంటి అంశాలతో చక్కగా ప్రెజెంట్ చేస్తే ప్రేక్షకుల ఓటు పడిపోతుంది. కథ సరిగా లేకుంటే మాత్రం ఎంత వెరైటీగా సినిమా తీసినా కూడా ఫలితం ఉండదు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. అసలు అదొక సినిమాలా అనిపించదు. స్టేజ్ షోలా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు బీజీఎం కూడా ఉండదు. వినూత్నం అంటే మరీ ఇంత వినూత్నమైతే ఎలా? ఒక చిన్న కాన్సెప్ట్. అనుమానం పెనుభూతంగా మారితే మనిషిని సైకలాజికల్‌గా దహించి వేస్తుంది. అదే చిన్న పాయింట్‌తో ఈ చిత్రం రూపొందింది. దాదాపుగా పాత్రలన్నీ తెలియని మొహాలే కావడం కూడా సినిమాకు మైనస్. ఫస్ట్ హాఫ్ అంతా స్లో నెరేషన్. కథ అక్కడక్కడే నడుస్తుండటంతో ప్రేక్షకుడికి విసుగు అనిపిస్తుంది. ఒకే ఒక్క పాయింట్‌ని పట్టుకుని దాదాపు మూడు గంటలు సాగదీశారు.

ఎవరెలా నటించారంటే..

ప్రధాన పాత్రధారి సత్యదేవ్ వన్ మ్యాన్ షో ఈ సినిమా అని చెప్పాలి. అదరగొట్టేశాడు. చిత్ర విచిత్రమైన క్యారెక్టర్ కాబట్టి ఎప్పటికప్పుడు వేరియేషన్స్ చూపించాలి. అలాంటి వేరియేషన్స్ అన్నీ అద్భుతంగా చూపించాడు. దీపా థామస్ పాత్ర నిడివి తక్కువే అయినా కూడా మెప్పిస్తుంది. ఇక రామప్ప ఇంట్లో పనిమనిషిగా చేసిన మహిళకు మంచి పాత్ర దక్కింది. ఆమె కారణంగా సినిమాలో కామెడీ వర్కవుట్ అయ్యింది. వికాస్ ముప్పలకు సైతం మంచి పాత్ర దక్కింది. ఆయన కూడా అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు.

టెక్నికల్ పరంగా..

డైరెక్టర్ వెంకటేశ్ మహా కథను ఇంకాస్త బెటర్‌గా రాసుకుని ఉంటే బాగుండేది. ఏదో వినూత్నంగా తెరకెక్కించాలనుకుని యత్నించి మొత్తానికే సినిమాను అనాసక్తంగా రూపొందించారు. ఈ సినిమాలో వెంకటేశ్ మహా కూడా కేమియో చేశారు. మ్యాజిక్ విషయానికి వస్తే ఏమాత్రం మెప్పించదు. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి. ఎడిటింగ్ అత్యంత పేలవం.

ఫైనల్‌గా.. ‘రావు బహదూర్’ సత్యదేవ్‌కు గట్టి దెబ్బే..

రేటింగ్: 2.25/5

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 3, 2026 11:22 AM