Entertainment

Transfer Trimurthulu Review: పదేళ్ల తర్వాత వడ్డె నవీన్ హిట్ కొట్టినట్టేనా?

ఒకప్పుడు టాలీవుడ్‌లో ఒక మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వడ్డె నవీన్ సడెన్‌గా ఇండస్ట్రీకి దూరమయ్యారు. పదేళ్ల తర్వాత తిరిగి ఎంట్రీ ఇచ్చారు. వడ్డె నవీన్ నటించి, నిర్మించిన ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Transfer Trimurthulu Review: పదేళ్ల తర్వాత వడ్డె నవీన్ హిట్ కొట్టినట్టేనా?

చిత్రం: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

విడుదల: 19-06-2026

నటీనటులు:వడ్డే నవీన్, రాశీ సింగ్, దేవీ ప్రసాద్, రఘుబాబు, ఆడుకలం నరేన్

మ్యూజిక్: కల్యాణ్ నాయక్

దర్శకుడు: కమల్ తేజ నార్ల

నిర్మాత: వడ్డె నవీన్

ఒకప్పుడు టాలీవుడ్‌లో ఒక మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వడ్డె నవీన్ సడెన్‌గా ఇండస్ట్రీకి దూరమయ్యారు. పదేళ్ల తర్వాత తిరిగి ఎంట్రీ ఇచ్చారు. వడ్డె నవీన్ నటించి, నిర్మించిన ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలను సైతం ఆయనే నిర్వహించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా? పదేళ్ల తర్వాత వడ్డె నవీన్ హిట్ అందుకున్నారా? తెలుసుకుందాం.

కథేంటంటే..

నిజాయితీకి మారుపేరైన కానిస్టేబుల్ త్రిమూర్తులు (వడ్డే నవీన్).. పదే పదే ట్రాన్స్‌ఫర్ అవుతూ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులుగా పేరు తెచ్చుకుంటాడు. లంచాలకు, సిఫార్సులకు లొంగని అతని తత్వం కారణంగా బదిలీలపై బదిలీలు చేయబడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే త్రిమూర్తులు భార్య లక్ష్మి (రాశి సింగ్) కూడా తన భర్త ట్రాన్స్‌ఫర్‌లకు అలవాటు పడిపోతుంది. ఏ క్షణాన ట్రాన్స్‌ఫర్ లెటర్‌తో భర్త ఇంటికి వస్తాడోనని కనీసం ప్యాక్ చేసినా సామాన్లను ఓపెన్ కూడా చేయదు. ఈ క్రమంలోనే సీఎం కమలా దేవి తన కొడుకు సంతోష్ బాబును సీఎంను చేయడం కోసం వేసిన ఓ స్కెచ్‌వేస్తుంది. దానిని ఓసారి త్రిమూర్తులు అనుకోకుండా పాడు చేస్తాడు. అప్పుడు మరోసారి బదిలీ అవుతాడు. ట్రాన్స్‌ఫర్‌లో భాగంగా ఒకప్పుడు తన తండ్రి శ్రీనివాసులు (దేవీ ప్రసాద్) పని చేసిన పోలీస్ స్టేషన్‌‌లోని రికార్డ్ రూంలో డ్యూటీ పడుతుంది. రికార్డులన్నీ పరిశీలిస్తుండగా.. అతనికి తన తండ్రి మరణించిన రోజున గిరిజన యువతి ‘ప్రియమ్మ’ అత్యాచార కేసుకు సంబంధించిన ఫైల్ దొరుకుతుంది. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. అసలు ప్రియమ్మ ఏమైంది? శ్రీనివాసులు మరణానికి కారణమేంటి? కారణాలన్నింటినీ తెలుసుకున్న త్రిమూర్తులు ఏం చేశాడు? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, రాజకీయ ఒత్తిళ్లు, పోలీస్ వ్యవస్థలోని లోపాలను కథాంశంగా వడ్డె నవీన్ రాసుకున్నారు. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కథను రాసుకున్నారు కానీ దాని చుట్టూ అల్లిన కథ అంతగా కనెక్ట్ అవదు. ముఖ్యంగా ఈ సినిమాకు మైనస్ అంటే ఫస్ట్ హాఫ్ అని చెప్పాలి. ఫస్టాఫ్ అంతా త్రిమూర్తులు ట్రాన్స్‌ఫర్స్‌పైనే నడిపించారు తప్ప స్ట్రాంగ్ పాయింట్స్ అనేవి లేవు. సెకండ్ హాఫ్‌‌లో కథలో సీరియస్‌నెస్ అనేది పెరుగుతుంది. ఒక క్రైమ్ చుట్టూ కథ తిరుగుతుంది. సెకండాఫ్ మంచి గ్రిప్పింగ్‌గానే ఉంటుంది. తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం, ప్రియమ్మకు న్యాయం జరిపించడం కోసం హీరో తీసుకునే నిర్ణయాలు.. అన్నీ కూడా ఆకట్టుకుంటాయి. అయితే ఫస్టాఫ్‌ను కూడా బలంగా తీర్చిదిద్ది ఉంటే సినిమా చాలా బాగుండేది. అలాగే ఇన్వెస్టిగేటివ్ పార్ట్‌పై కూడా మరింత ఫోకస్ పెట్టి ఉండాల్సింది.

ఎవరెలా నటించారంటే..

త్రిమూర్తులు పాత్రలో వడ్డె నవీన్ చక్కగా నటించారు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఆయన బాగా ఆకట్టుకున్నారు. రాశి సింగ్ పాత్రకు అంత ప్రాధాన్యమైతే లేదు. ఏదో హీరోకి ఒక ఫ్యామిలీ ఉండాలన్నట్టుగా పెట్టారంతే. కానీ రాశి చక్కగానే నటించారు. దేవీ ప్రసాద్, శిల్పా తులస్కర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

కొత్త దర్శకుడు కమల్ తేజ నార్ల ఫస్ట్ హాఫ్‌ను తెరకెక్కించడంలో తడబడినట్టుగా అనిపించింది. అలాగే ఇన్వెస్టిగేటివ్ పార్ట్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. మ్యూజిక్ పర్వాలేదనిపించింది.

ఫైనల్‌గా.. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సెకండ్ హాఫ్‌లో బాగానే ఆకట్టుకుంటాడు.

రేటింగ్: 2.75/5

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 20, 2026 4:25 AM