Maa Inti Bangaram Review: ‘మా ఇంటి బంగారం’తో సమంత సక్సెస్ కొట్టిందా?
చాలా కాలం పాటు వెండితెరకు దూరంగా ఉన్న ‘శుభం’ నిర్మించి క్యామియో చేసినా కూడా పూర్తి స్థాయిలో కనిపించింది ఇటీవలి కాలంలో కనిపించిందే లేదు. తాజాగా ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
చిత్రం: మా ఇంటి బంగారం
విడుదల: 19-06-2026
నటీనటులు: సమంత, గుల్షన్ దేవయ్య, దిగంత్, మంజూష, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, శ్రీలక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు
మ్యూజిక్: సంతోష్ నారాయణ్
దర్శకత్వం: నందిని రెడ్డి
నిర్మాతలు: రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరు
చాలా కాలం పాటు వెండితెరకు దూరంగా ఉన్న ‘శుభం’ నిర్మించి క్యామియో చేసినా కూడా పూర్తి స్థాయిలో కనిపించింది ఇటీవలి కాలంలో కనిపించిందే లేదు. తాజాగా ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఓ బేబీ’ చిత్రంతో తనకు సక్సెస్‌ను అందించిన దర్శకురాలు నందినీరెడ్డితో కలిసి తిరిగి ఈ సినిమా చేసింది. ఇప్పటికే పాటలు, ఇతర అప్‌డేట్స్‌లో సమంత చేసిన యాక్షన్ సన్నివేశాలన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.
కథేంటంటే..
చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో స్వర్ణ (సమంత) ఓ అనాథాశ్రమానికి చేరుతుంది. అక్కడ స్నేహితురాలు కిరణ్మయి (మంజూష ముక్కవిల్లి)తో కలిసి ఆనందంగా ఉంటుంది. కిరణ్మయిని వేరొకరు దత్తత తీసుకోవడంతో.. స్వర్ణ ఒంటరిదవుతుంది. వార్డెన్ కన్ను స్వర్ణపై పడటంతో ఆమె అక్కడి నుంచి బయటపడుతుంది. ఎన్నో కష్టాలు పడుతూనే పెరుగుతుంది. ఆ తరువాత అనిరుధ్(దిగంత్ మంచాలే)ని ప్రేమ వివాహం చేసుకుంటుంది. ఇంట్లో చెప్పకుండా వివాహం చేసుకోవడంతో అనిరుధ్‌ని అతని కుటుంబం దూరం పెడుతుంది. తన కారణంగా అనిరుధ్‌కి కుటుంబం దూరమవడంతో ఎలాగైనా అనిరుధ్‌ని తన కుటుంబానికి దగ్గర చేయాలని స్వర్ణ భావిస్తుంది. ఈ క్రమంలోనే అనిరుధ్ ఇంట ఓ శుభకార్యం రావడంతో సమంత అత్తారింట్లో అడుగు పెడుతుంది. ఇక ఆ కుటుంబాన్ని ఆకట్టుకోవడం కోసం సమంత సమంత కుటుంబ ఆచారాలు, కట్టుబాట్లను తెలుసుకుని ఆ ప్రకారంగా నడుచుకుంటూ వారందరినీ ఆకట్టుకుంటుంది. ఇంతలోనే సమంతే ఝాన్సీయా కాదా? అని తెలుసుకునేందుకు కొందరు ఆమెను వెంటాడుతుంటారు. ఇంతకీ ఝాన్సీ ఎవరు? స్వర్ణ గతమేంటి? ఝాన్నీని చంపడమే లక్ష్యంగా జీవిస్తున్న కరుణ (గుల్షన్ దేవయ్య) ఎవరు? ఝూన్సీకి అతనికి ఉన్న సంబంధం ఏమిటి? వంటి విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ముఖ్యంగా తల్లిదండ్రలు లేని అనాథ ఆడపిల్లలు సమాజంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటారనేది ఈ చిత్రంలో నందినీ రెడ్డి బాగా హైలైట్ చేశారు. వయసుతో సంబంధం లేకుండా ఆడపిల్ల అయితే చాలనుకునే మగాళ్ల నడుమ ఆడపిల్ల పడే కష్టాలను స్పష్టంగా చూపించారు. కానీ ఫ్యామిలీ డ్రామా విషయానికి వచ్చే సరికి నందినీ రెడ్డి అంతగా ఆకట్టుకునేలా తీయలేకపోయారు. పెళ్లై ఒకింటిది అయిన తర్వాత ఫ్యామిలీని మెప్పించేందుకు సమంత చేసే పనులన్నీ ఏమాత్రం సహజంగా అనిపించవు. చాలా సినిమాటిక్‌గా ఉంటాయి. అయితే సినిమాను ఆరంభించిన తీరు మాత్రం ఆకట్టుకుంటుంది. అలాగే సమంత తన స్నేహితురాలు కిరణ్మయితో కలిసి చేసే సందడి కూడా చాలా బాగుంటుంది. కిరణ్మయి అమాయకత్వంతో చేసే హడావుడి సైతం ఆకట్టుకుంటుంది. కామెడీ పార్ట్‌ను నందినీ రెడ్డి చాలా నేచురల్‌గా చూపించారు. ప్రేక్షకులను కామెడీ పార్ట్ బాగానే ఆకట్టుకుంటుంది. ప్రతి నాయకుడిగా కరుణ బాగా సెట్ అయ్యారు కానీ అతని పాత్రలో అంత డెప్త్ కనిపించలేదు.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమా విషయానికి వస్తే.. సమంత గురించి ముఖ్యంగా చెప్పాలి. ఆమె తన పాత్రలో జీవించేసింది. యాక్షన్ సన్నివేశాల్లోనూ అదరగొట్టింది. ఇక సమంత తర్వాత ముంజూష ముక్కవిల్లి గురించి చెప్పాలి. మంజూషకు ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. అమాయకత్వంతో చేసే సందడి సినిమాకు హైలైట్ అని చెప్పాలి. కరుణ పాత్రలో గుల్షన్ దేవయ్య నటన బాగుంది కానీ ఆయన పాత్రే అంత డెప్త్‌గా డిజైన్ చేయకపోవడంతో విలనిజం అంతగా పండలేదు. సమంత భర్తగా దిగంత్ బాగానే నటించారు. శ్రీముఖి, గౌతమి, శ్రీలక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, శ్రీలక్ష్మి తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ పరంగా..
నందినీ రెడ్డి కథలోని కొన్ని సన్నివేశాలను.. ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించిన సన్నివేశాలను మరింత డెప్త్‌గా రాసుకుని ఉంటే బాగుండేది. బలమైన ఎమోషనల్ సన్నివేశాలను.. స్వర్ణ తన గతాన్ని రివీల్ చేసిన సన్నివేశాలను సింపుల్‌గా తేల్చేయడం కొద్దిగా లోటనే చెప్పాలి. అయితే హాస్య సన్నివేశాలను మాత్రం అద్భుతంగా తెరకెక్కించారు. ఎడిటింగ్ విషయంలో కాస్త కత్తెరకు పని చెప్పాల్సి ఉంది. మ్యాజిక్ విషయానికి సంతోష్ నారాయణన్ సంగీతానికి మంచి మార్కులే పడతాయి. నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి.
చివరిగా: మా ఇంటి బంగారం ప్రేక్షకులకు కొంత మేర కనెక్ట్ అవుతుంది.
రేటింగ్: 2.75/5