Vanda Devullu Review: తల్లీకొడుకుల సెంటిమెంట్ వర్కవుట్ అయ్యిందా?
తల్లీకొడుకుల కథ... ఒక రైతు కథ అంటూ మేకర్స్ ప్రమోషన్స్‌లో ఊదరగొట్టేశారు. చెప్పిన రెండు అంశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేవే. మరి ఆ రెండింటితో సినిమా అంటే ఎలా ఉంటుంది? అంచనాలైతే బాగానే పెరిగాయి.
చిత్రం: వంద దేవుళ్లు
విడుదల: 19-06-2026
నటీనటులు: విజయ్ ఆంటోని, అజయ్ ధీశన్, స్వాసిక, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ తదితరులు
మ్యూజిక్: బాలాజీ శ్రీరామ్
డైరెక్టర్: శశి
ఎడిటర్: హరీష్ యువరాజ్
ప్రొడ్యూసర్: మీరా విజయ్ ఆంటోని
తల్లీకొడుకుల కథ... ఒక రైతు కథ అంటూ మేకర్స్ ప్రమోషన్స్‌లో ఊదరగొట్టేశారు. చెప్పిన రెండు అంశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేవే. మరి ఆ రెండింటితో సినిమా అంటే ఎలా ఉంటుంది? అంచనాలైతే బాగానే పెరిగాయి. అందునా విజయ్ ఆంటోనికి తల్లి సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యింది. అలా చూసినా కూడా ఈ చిత్రం బాగుంటుందని ప్రేక్షకులు భావించారు. మరి వారి అంచనాలకు తగినట్టుగా సినిమా ఉందా? భావోద్వేగాల్లో ప్రేక్షకులను ముంచెత్తిందా? చూద్దాం.
కథేంటంటే..
చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న వాసవి (స్వాసిక) తన కుమారులు భాస్కర్ (అజయ్ ధీశన్), వివేక్ (శక్తి రాజ్)ను చూసుకుంటూ జీవిస్తూ ఉంటుంది. ఆమెకు అండగా నిలిచేవారెవరూ లేకపోవడంతో రెక్కల కష్టంతో పిలల్లను చదివించుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమెను తమ ఇంటి ముందున్న స్కూల్ టీచర్.. రెండో వివాహం చేసుకుంటారా? అని అడగడంతో ఆ సమయానికి తన పిల్లలు అంగీకరిస్తే చేసుకుంటానంటుంది. కానీ పెద్ద కొడుకు భాస్కర్ దానికి అంగీకరించడు. పైగా వివాహానికి ఒప్పుకున్నందుకు తల్లిపై కోపం పెంచుకుంటాడు. ఆ తరువాత కొద్ది రోజులకు రియలైజ్ అయ్యి తనే తల్లికి పెళ్లి చేయాలనుకుంటాడు. అప్పుడు తల్లి ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. తన కొడుకుకు కూడా పెళ్లీడు రావడంతో తను పెళ్లి చేసుకుంటే తన పిల్లలకు పెళ్లి కాదని భావిస్తుంది. కానీ కొడుకులు మాత్రం ఎలాగైనా తల్లికి తోడు తీసుకురావాలనుకుంటారు. ఈ క్రమంలో భాస్కర్, వివేక్ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు? అసలు ఏడుకొండలు (విజయ్ ఆంటోని) పాత్ర ఏంటి ఈ చిత్రంలో వంటి అంశాలను వెండితెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఒక రియల్ స్టోరీ ఆధారంగా రూపొందిన చిత్రమిది. అన్నీ కోల్పోయి.. ఎలాంటి సుఖసంతోషాలకు నోచుకోని తల్లికి తిరిగి వివాహం చేసిన కొడుకుల కథను విజయ్ ఆంటోని సినిమాగా రూపొందించారు. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని ఎలాంటి ఆధారమూ లేక.. కనీసం ఆదరించే దిక్కు లేక ఒక తల్లి.. ఇద్దరు పిల్లల్ని పెంచడమనేది ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. పిల్లల కోసం సింగిల్ పేరెంట్ పడే కష్టాలను దర్శకుడు శశి కళ్లకు కట్టారు. ఫస్ట్ హాఫ్ అంతా తల్లి కొడుకుల బంధం.. వారి కోసం తల్లి పడే తపన వంటి అంశాలతో రూపొందించగా.. సెకండాఫ్.. తల్లికి వివాహం చేయాలని తపించే కొడుకును చూపించారు. ఈ చిత్రానికి హీరో అంటే అజయ్ ధీశన్ అనే చెప్పాలి. విజయ్ ఆంటోనీ సెకండాఫ్ తర్వాతే మనకు కనిపిస్తారు. అయినా కూడా ఆయన తన నటనతో బలమైన ముద్ర వేశారు. అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీతగా అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
ముఖ్యంగా చెప్పుకోవల్సింది విజయ్ ఆంటోని గురించి. ఒక అమాయకపు రైతుగా ఆయన అద్భుతంగా నటించారు. ప్రతి సన్నివేశంలోనూ ఆయన నటిస్తున్నారన్న భావన కలుగనీయలేదు. ఇక స్వాసిక సైతం పిల్లలే ప్రపంచంగా బతికే తల్లిగా అద్భుతంగా నటించింది. ఓ సన్నివేశంలో ఆమె పలికించిన హావభావాలు ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టిస్తాయి. ఇక ఈ చిత్రంలో చెప్పుకోవల్సిన మరో పాత్ర.. అజయ్ ధీశన్ . చాలా నేచురల్‌గా అద్భుతంగా నటించాడు. తొలుత తల్లికి పెళ్లేంటంటూ కోపగించుకోవడం.. ఆ తరువాత తనే వివాహం చేయాలనుకోవడం దాని కోసం తపించడం వంటి అంశాల్లో అజయ్ అద్భుతంగా నటించారు. శక్తి రాజ్, కావ్య అనిల్, పదినీ కుమార్, కరుణాస్, బాలాజీ శక్తివేల్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు.
ఫైనల్‌గా.. ‘వంద దేవుళ్లు’ భావోద్వేగాలతో కట్టిపడేసే చిత్రం
రేటింగ్: 3/5