Entertainment

Manchu Manoj: వీడు మగాడ్రా బుజ్జి అంటూ మంచు మనోజ్‌పై నెటిజన్ల ప్రశంసలు.. కారణమేంటంటే..

ఆడపిల్లలపై ఏ అన్యాయం జరిగినా కూడా ముందుగా ఇండస్ట్రీ తరుఫున ఒకే ఒక్క గళం వినిపిస్తుంది. కొన్నిసార్లు ఏ ఒక్కరూ పెదవి విప్పరు. ఆయన మాత్రం వెనుకాడరు. ఆ ఒక్క గళం మరెవరిదో కాదు.. మంచు మనోజ్. ఆసక్తికర విషయం ఏంటంటే..

Manchu Manoj: వీడు మగాడ్రా బుజ్జి అంటూ మంచు మనోజ్‌పై నెటిజన్ల ప్రశంసలు.. కారణమేంటంటే..

ఆడపిల్లలపై ఏ అన్యాయం జరిగినా కూడా ముందుగా ఇండస్ట్రీ తరుఫున ఒకే ఒక్క గళం వినిపిస్తుంది. కొన్నిసార్లు ఏ ఒక్కరూ పెదవి విప్పరు. ఆయన మాత్రం వెనుకాడరు. ఆ ఒక్క గళం మరెవరిదో కాదు.. మంచు మనోజ్. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఎవరో ఒక ఆడపిల్ల సమస్యల్లో పడటం ఒక ఎత్తైతే.. ఎవరి కారణంగా లైంగిక వేధింపులు ఎదుర్కొందనేది మరో ఎత్తు. ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తనయుడు బండి భగీరథ్ ఓ అమ్మాయిని వేధించిన కేసులో అతనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

ఈ విషయమై మంచు మనోజ్ స్పందించడం అనేది ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అవతలి వ్యక్తి సాధారణ పొలిటీషియన్ అయితేనే ఎటు పోయి ఎటొస్తుందోనని పెదవి విప్పరు. కానీ మనోజ్ ఏమాత్రం వెనుకాడకుండా ట్విటర్ వేదికగా స్పందించడం విశేషం.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌పై ఇటీవల నమోదైన పోక్సో కేసు తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రతి మైనర్ బాలికకు కచ్చితంగా న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే పోక్సో చట్టాన్ని తీసుకువచ్చారని తాను బలంగా నమ్ముతున్నానన్నారు. అధికారం, పదవి, పలుకుబడి లేదా హోదా ఎప్పుడూ న్యాయానికి అడ్డు రాకూడదని.. రాజ్యాంగం, చట్టం దృష్టిలో ప్రతి బాలికకు సమానమైన న్యాయం దక్కాల్సిందేనన్నారు. మైనర్లకు సంబంధించిన కేసుల్లో వేగంగా స్పందించాలని.. అలాగే పారదర్శకత, జవాబుదారీతనం చాలా అవసరమన్నారు. విచారణలో జాప్యం జరిగినా, మౌనం వహించినా లేదా పక్షపాత చర్యలు తీసుకున్నా.. అది న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తుందని మంచు మనోజ్ పేర్కొన్నారు.

ఇది రాజకీయాలకు లేదా వ్యక్తులకు సంబంధించిన విషయం కాదని.. కేవలం నిజం బయటకు రావాలి, న్యాయం గెలవాలన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రభావాలకు తావులేకుండా ఈ కేసు దర్యాప్తు, చట్టపరమైన ప్రక్రియలన్నీ అత్యంత వేగంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. న్యాయం జరగడమే కాదు, అది జరిగినట్లు అందరికీ స్పష్టంగా కనిపించాలి. చట్టం ముందు అందరూ సమానులే అని ఈ కేసు ద్వారా మరోసారి నిరూపితం కావాలంటూ జస్టిస్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను మంచు మనోజ్ జత చేశారు. మొత్తానికి మంచు మనోజ్ ట్వీట్ చూసిన నెటిజన్లంతా ‘వీడు మగాడ్రా బుజ్జి’ అంటున్నారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 11, 2026 1:14 PM